రాజకీయం అంటేనే ఉత్తుత్తి డ్రామా అయిపోయింది.! దేశాన్ని కుదిపేసిన లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తెలంగాణ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత కవిత పేరు ప్రముఖంగా వినిపించింది. వినిపించడమేంటి.? దర్యాప్తు సంస్థలు ఆమెను సీరియస్‌గా విచారించేస్తుంటేనూ.! మధ్యలో చిన్న బ్రేక్.. మళ్ళీ ఇంకోసారి కవితని ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారించనుంది. విచారణలో ఏం తేలుతుంది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, కవిత మాత్రం విపరీతమైన పొలిటికల్ మైలేజ్ సంపాదించేసుకున్నారు. దేశవ్యాప్తంగా కవిత పేరు మార్మోగిపోతోంది.
ఇదిలా వుంటే, లిక్కర్ స్కామ్ నుంచి కవిత దాదాపు తప్పించేసుకున్నట్లేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలా.? అంటే, తెరవెనుకాల పెద్ద కథే నడుస్తోందనీ, లిక్కర్ స్కామ్ ముందు ముందు నీరుగారిపోవడం ఖాయమనీ అంటున్నారు. ఒకవేళ లిక్కర్ స్కామ్‌లో హడావిడి కొనసాగినా, కవిత పేరు మాత్రం ముందు ముందు డైల్యూట్ అయిపోనుందట ఈ కేసులో. ఔనా.? అంతలా తెరవెనుక ఏం మంత్రాంగం నడిచినట్లు.? అంటే, ఆ గులాబీ మంత్రాంగమేంటో, ఏ కమలనాధుడు గులాబీ పార్టీకి అభయమిచ్చారో.. అంటూ మీడియా, రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే, కవితను వదిలే ప్రసక్తే లేదని తెలంగాణ బీజేపీ నేతలంటున్నారు. బీజేపీని వదిలేది లేదని గులాబీ నేతలు ఇంకా గట్టిగా చెబుతున్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసు.. లిక్కర్ స్కామ్.. ఈ రెండిటికీ సంబంధించి ‘పరస్పర అవగాహన’ ఈ మొత్తం వ్యవహారంలో కీలక భూమిక పోషిస్తోందిట.