రేవంత్ – బండి క్షమాపణల విలువ రూ.100కోట్లు… చెబుతారా?

తెలంగాణలో సంచలనంగా మారిన టీఎస్పీఎసీ పేపర్ లీకేజ్ వ్యవహారం విషయంలో… అటు విద్యార్థులు, నిరుద్యోగులు పడుతున్న బాధ, అనుభవిస్తున్న ఒత్తిడి ఒకెత్తు అయితే… ఇటు రాజకీయ పార్టీల నేతల చేస్తున్న విచిత్ర విన్యాసాలు మరొకెత్తు! ఈ విషయంలో టీఎస్పీఎస్సీ లీకేజ్ అనేది ఇద్దరు వ్యక్తులు చేసిన స్వార్థపూర్తి తప్పిదం కాదు.. ఇది ప్రభుత్వ కనుసన్నల్లో, కేటీఆర్ అధ్వర్యంలో జరిగిన కుంభకోణం అని రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో హర్ట్ అయిన కేటీఆర్ వీరిద్దరిపై పరువునష్టం దావా వేశారు.

అవును… రసవత్తర రాజకీయ పోరుకు వేదికగా మారిన టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో.. ఆరోపణలు ప్రత్యారోపణల అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కు మంత్రి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు పంపారు. టీఎస్పీఎసీ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి ఇప్పటి వరకు తనపై చేసిన వ్యాఖ్యలపై వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొన్న ఆయన… క్షమాపణ చెప్పకపోతే రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని పేర్కొన్నారు.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ వ్యవహారంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును అనవసరంగా ప్రస్తావిస్తున్నారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు కేటీఆర్. సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు ఈ వ్యాఖ్యలు భంగం కలిగించాయని.. సంజయ్‌, రేవంత్‌ రెడ్డి పదే పదే అబద్ధాలు మాట్లాడుతున్నారని, ప్రజాప్రతినిధులుగా ఉన్నంత మాత్రాన ఎదుటి వారిపై అసత్య ఆరోపణలు చేసే హక్కు వారికి లేదని కేటీఆర్ ఆ నోటీసుల్లో చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా ఐపీసీ 499, 500 సెక్షన్ల ప్రకారం పరువు నష్టం దావాకు నోటీసులు పంపించినట్టు తెలిపిన కేటీఆర్… ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. ఇప్పటి వరకు చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉప సంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా వారి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పని పక్షంలో లేకపోతే రూ.100 కోట్లకు పరువు నష్టం దావాను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.

ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తన పరువుకు నష్టం కలిగిస్తే దాని విలువ 100కోట్లు అని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేసిన కేటీఆర్.. తాను అనుకున్నది సాధిస్తారా? రేవంత్ – బండి సంజయ్ లతో క్షమాపణలు చెప్పించుకుంటారా? లేక, 100కోట్ల యవ్వారం కోర్టులో వాదనల వరకూ చేరుతుందా అనేది వేచి చూడాలి!

కాగా… టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన అనంతరం.. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన టీఎస్పీఎస్సీ సంస్థ చైర్మన్ కానీ, సెక్రటరీ కానీ.. మరే ఇతర అధికారి కానీ స్పందించిన దాఖళాలు లేవు. వారి సంస్థలో జరిగిన విషయాలు ప్రభుత్వానికి తెలియదని భావిస్తే… కేటీఆర్ మాత్రం తనకు అక్కడ ఏమిజరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మొత్తం తెలుసన్నట్లుగా ముందుకువచ్చారు. అధికారులెవ్వరూ స్పందించలేదు సరికదా… విద్యాశాఖా మంత్రిని – హోం మంత్రిని – ఆఖరికి ముఖ్యమంత్రినీ సైడ్ కు నెట్టి… ఈ విషయంపై కేటీఆర్ స్పందించిన సంగతి తెలిసిందే! సిట్ కూడా ఏర్పడకముందే… ఈ కేసులో ఇద్దరు వ్యక్తుల ప్రమేయం మాత్రం ఉందని.. దీన్ని వ్యవస్థ మొత్తానికి అపాదించొద్దని కోరిన సంగతి తెలిసిందే!