తుత్తర: ట్వల్త్ మేన్ గా కోటంరెడ్డి!

ఇంతకాలం జగన్ కి నమ్మిన బంటు. అసలు జగన్ ను ఈ స్థాయిలో అభిమానించే, ఆ స్థాయిలో ఆరాధించే మరో వైకాపా నాయకుడు ఉండడేమో అనే రేంజ్ ఫెర్మార్మెన్స్! ఇవన్నీ చూసినవారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనేవారు జగన్ కి అత్యంత ఆప్తుడు అని భావించారు. ఆ భావన కేవలం భ్రమ అంటూ… కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జగన్ పై ఆరోపణలు చేశారు. పార్టీని వీడారు! అయితే ప్రస్తుత రాజకీయాల్లో కోటంరెడ్డి పరిస్థితి?

అత్యంత బలంగా ఉన్నామని చెప్పుకుంటున్న వైకాపా నుంచి ఈ సమయంలో ఒక ఎమ్మెల్యే బయటకు వస్తే.. అదికూడా జగన్ పై విమర్శలు చేసి బయటకు వస్తే.. ఆ ఎమ్మెల్యే డిమాండ్ మామూలుగా ఉండకూడదు. ప్రతిపక్ష పార్టీలు ఆ ఎమ్మెల్యే వెంటపడాలి.. తమ పార్టీలో చేరమంటే తమ పార్టీలో చేరమని ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించాలి. కానీ… కోటంరెడ్డి విషయంలో అది జరగడం లేదు!

ప‌దేళ్లుగా ఏ చ‌ట్ట‌స‌భ‌కూ ప్రాతినిథ్యం వ‌హించ‌ని కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి బయటకు వస్తే… మిగిలిన పార్టీలు పోటీపడి మరీ రెడ్ కార్పెట్ వేయడానికి రెడీ అవుతుంటే… వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ నుంచి బయటకు వచ్చిన కోటంరెడ్డి ని మాత్రం కనీసం పలకరించేవారు కరువయ్యారని అంటున్నారు సన్నిహితులు!

దానికి గల కారణం ఒకే ఒకటి! కోటంరెడ్డి వైకాపా నుంచి బయటకు వస్తూ వస్తూనే… తాను 2024లో టీడీపీ నుంచి పోటీచేస్తానని చెప్పడం! టీడీపీ అనే ప్రస్థావన లేకుండా.. సైలంటుగా బయటకు వచ్చి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేది! ఈ తుత్తర వల్లే అటు బీజేపీ నుంచి కానీ ఇటు జనసేన నుండి కానీ కోటంరెడ్డి కి కనీసం ఫోన్ కూడా రాని పరిస్థితికి కారణం అయ్యింది అంటున్నారు!

అనంతరం ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా… చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఆ ఛానల్ అధినేతతో… “నన్ను టీడీపీలోకి రానిస్తారా” అని రిక్వస్ట్ చేసుకునే స్థితికి దిగజారిపోవడం కూడా కోటంరెడ్డి పరిస్థితికి అద్దం పడుతుందని.. ఫలితంగా…ఫ్యూచర్ పాలిటిక్స్ లో కోటంరెడ్డి పరిస్థితి ట్వల్త్ మేన్ గా మిగిలిపోవడమేనేమో అని ఆందోళన చెందుతున్నారు ఆయన అభిమానులు!