గతకొంతకాలంగా తెలంగాణలో అధికారపక్షం కాస్త స్లోగా ఉందని.. బీజేపీ స్థబధగా ఉందని.. కాంగ్రెస్ మాత్రం జోరుగా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఈసమయంలో స్లోగా ఉన్న బీఆరెస్స్ కు కాంగ్రెస్ జుట్టు ఇచ్చారు రేవంత్! దీంతో ఫుల్ గా వాయించేస్తున్న బీఆరెస్స్ నేతలకు తోడు… కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా డ్యూటీ ఎక్కేశారు!
అవును… తానా సభల్లో పాల్గొనడానికి అమెరికా వెళ్లిన రేవంత్ రెడ్డి… ఆ సందర్భంలో జరిగిన చిట్ చాట్ లో ఒక కీలక వ్యాఖ్య చేస్తూ, మరో సందర్భంలో టంగ్ స్ల్పి అయ్యారు. అది అనుకోకుండా అనేశారా.. లేక, చంద్రబాబు వారసత్వాన్ని కంటిన్యూ చేసే పనిలో భాగంగా అన్నారా అన్నది తెలియదు కానీ… రైతులకు ఉచిత విద్యుత్ పై నోరు జారారు.
రైతులకు రోజుకు మూడు గంటలు మాత్రమే ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని, 24 గంటలూ అవసరం లేదని రేవంత్ రెడ్డి చంళన వ్యాఖ్యలు చేశారు. దీంతో మైకులందుకున్న బీఆరెస్స్ నాయకులు.. రేవంత్ పై ఫైరవుతున్నారు. రేవంత్ ఇంట్లో మాత్రం 24 గంటలూ కరెంట్ కావాలి, రైతులకు మాత్రం 3 గంటలు సరిపోతుందా? అని నిలదీస్తున్నారు.
కారణం… తెలంగాణలో బోర్ల పై ఆధారపడి జరిగే వ్యవసాయం ఎక్కువ. దీంతో రైతులకు కరెంట్ ఎంతో అవసరం. 2004లో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది. నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ హామీ దోహదపడింది. రైతుల పక్షపాతిగా వైఎస్సార్ ను జనం చూడగా, వ్యవసాయం దండగ అన్న చంద్రబాబును రైతుల వ్యతిరేకిగా చూశారు.
ఆ విషయం రేవంత్ మరిచాడో.. లేక, అమెరికాలో తానా సభలకు వెళ్లగానే పాతరోజులు గుర్తొచ్చి చంద్రబాబు గుర్తొచ్చారో ఏమో కానీ… ఇలా ఉచిత విద్యుత్ పై కామెంట్ చేశారు. దీంతో… బీఆరెస్స్ నేతలు వాయించేస్తున్నారు.
బీఆరెస్స్ నేతల సంగతి అలా ఉంటే… రేవంత్ వ్యాఖ్యలపై సొంతపార్టీ నేతలు కూడా ఫైరవుతున్నారు. ఇందులో మరి ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. రైతులకు 3 గంటలే కరెంటు ఇస్తామన్న రేవంత్ వ్యాఖ్యలను పట్టించుకోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. పనిలో పనిగా నష్ట నివారణ చర్యలకు పూనుకున్నారు.
అవును.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చి తీరతామని అంటున్నారు కోమటిరెడ్డి. స్టార్ క్యాంపెయినర్ గా తానీమాట చెబుతున్నామని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అనేది తమ మేనిఫెస్టోలో కూడా ఉంటుందని ఈ సందర్భంగా కోమటిరెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా… రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పార్టీలో చర్చిస్తున్నామని చెప్పిన ఆయన… అమెరికానుంచి రాగానే రేవంత్ తోనే ప్రెస్ మీట్ పెట్టించి వివరణ ఇప్పిస్తామన్నారు.
ఇదే సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చాడనే విషయాన్ని ఆయనకు గుర్తుచేయాలనో.. లేక జనాలకు గుర్తుచేయాలనో తెలియదు కానీ… రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్నప్పుడు జాగ్రత్తగానే మాట్లాడేవారని, అమెరికా వెళ్లిన తర్వాత ఆయనపై పాత మిత్రుడు బాలయ్య ప్రభావం పడిందోమోనని సెటైర్లు పేల్చారు కోమటిరెడ్డి.
దీంతో… రేవంత్ అమెరికా పర్యటన అనంతరం ఫుల్ క్లాసే ఉండేలా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి!!