కిషన్ రెడ్డి హైడ్రామా ముగిసింది.! కానీ, ఎందుకు.?

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన సంగతి తెలిసిందే. బండి సంజయ్‌ని తొలగించి, ఆ స్థానంలో కిషన్ రెడ్డిని బీజేపీ అధినాయకత్వం నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ విషయమై కిషన్ రెడ్డి ఒకింత అసహనం వ్యక్తం చేశారు.

మరోపక్క, కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నారనీ, ఆ పదవిలోకి బండి సంజయ్‌ని తీసుకుంటారనీ ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు కిషన్ రెడ్డి సుముఖంగా లేరనీ, ఆ పదవి తీసుకోవడానికి బండి సంజయ్ కూడా సుముఖంగా లేరనీ.. గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

మొత్తానికి హైడ్రామా ముగిసింది. కిషన్ రెడ్డి మౌనం వీడారు. పార్టీని ఏదీ అడగలేదనీ, పార్టీ అప్పగించే బాధ్యతల్ని శిరసావహిస్తాననీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. మరోపక్క బండి సంజయ్ కూడా, తన స్థానంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు సోషల్ మీడియా వేదికగా.

అయినా, బండి సంజయ్ ఎందుకు కేంద్ర మంత్రి పదవిని వదులుకుంటారు. పైగా, ఆయన మీద ఒకప్పుడు పెద్ద బాధ్యత వుండేది.. అదిప్పుడు తొలగిపోయింది. నిజమే, రానున్న తెలంగాణ అసెంబ్లీలో బీజేపీని ముందుకు నడపడం కత్తి మీద సాము. ఇకపై ఆ తలనొప్పులు బండి సంజయ్‌కి లేనే లేవు.

కేంద్ర మంత్రి పదవి వస్తే బండి సంజయ్ అదృష్టవంతుడే అవుతారు.! ఆ విషయం ఆయనకీ తెలుసు. ఒకవేళ బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సరిగ్గా రాణించకపోతే, ‘నన్ను పక్కన పెట్టారు.. ఫలితం అనుభవించారు..’ అని బీజేపీ అధినాయకత్వం మీద సెటైర్లేయడానికీ బండి సంజయ్‌కి అవకాశం దొరుకుంది.

ఇదే, ఈ భయమే కిషన్ రెడ్డి.. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి స్వీకరించేందుకు కాస్త వెనకడుగు వేసేలా చేసింది. కానీ, పార్టీ అధినాయకత్వాన్ని ధిక్కించేంత సీన్ ఆయనకు లేదు కదా.!