కుటుంబాల్లో కలహాలు అత్యంత సహజం. తిట్టుకుంటుంటారు, కొట్టుకుంటుంటారు..కలిసిపోతుంటారు. కుటుంబం అని చెప్పేది అందుకే. ఆ కలహాలనేవి సుదీర్ఘంగా కొనసాగితే కలహాల కాపురం అవుతుంది. తెగే దాకా లాగితే.. కొంప కూలుతుంది.
రాజకీయాల రంగం కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. కుటుంబ కలహాల్లాగే ఉంటాయి రాజకీయాలు కూడా. రాజకీయ ప్రత్యర్థులు పరస్పరం తిట్టుకుంటారు, నెట్టుకుంటారు. రాత్రయితే ఏ పేకాట క్లబ్‌లోనూ ఒకే టేబుల్‌పై కూర్చుని లగ్జరీగా సిప్ కొడుతూ పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటారు.
ప్రస్తుతం కర్ణాటకలో ఇదే తరహా రాజకీయ వాతావరణం నెలకొని ఉంది. అధికారాన్ని పంచుకుంటున్న రెండు పార్టీల కాపురంలో అప్పుడెప్పటి నుంచి రాజుకున్న కలహాలు ప్రస్తుతం పీక్స్‌కు చేరుకున్నాయి. ఎప్పుడు విడాకులు తీసుకుంటారో తెలియని పరిస్థితి. దీనికి కారణం- లోక్‌సభ ఎన్నికలు. లోక్‌సభ ఎన్నికల సీట్ల సర్దుబాటులో రాజుకున్న చిచ్చు.. అగ్నిపర్వతంలా మారింది. ఆ రెండు పార్టీలు.. కాంగ్రెస్-జేడీఎస్.
ఈ సీట్ల సర్దుబాటులో ఒక్క లోక్‌సభ నియోజకవర్గం వద్ద ఈ రెండు పార్టీల నేతలు ఒక్క మెట్టు కూడా కిందికి దిగడానికి ఇష్టపడట్లేదు. ఆ స్థానంపై వారికి ఉన్న `ప్రత్యేక ఆసక్తి` దీనికి కారణం. అదే- మండ్య లోక్‌సభ స్థానం. ఓ రకంగా చెప్పాలంటే కర్ణాటకలో రాజకీయ వారసత్వానికి బీజం వేసింది మండ్య. జిల్లా కేంద్రం. తమ వారసులను బరిలో దింపాలనే ఉద్దేశంతోనే ఈ సీటు తమకు కావాలంటే తమకు కావాలంటూ కాంగ్రెస్-జేడీఎస్ కాట్లాడుకుంటున్నాయి.
కన్నడికులు రెబల్‌స్టార్‌గా పిలుచుకునే మాస్ హీరో అంబరీష్.. గత ఏడాది నవంబర్ 24న కన్నుమూశారు. ఆయన సొంత జిల్లా మండ్య. కాంగ్రెస్ అభ్యర్థిగా మూడు దఫాలుగా పోటీ చేసి, విజయం సాధించారు. మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో సహాయమంత్రిగా పనిచేశారు. ఇదే నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన మరణంతో మండ్య జిల్లాలో కాంగ్రెస్‌కు ఆ స్థాయి నాయకుడు లేరు. ఆ లోటును భర్తీ చేసుకోవడానికి సుమలతను బరిలో దింపాలని నిర్ణయించింది.
సుమలత ఎవరో దశాబ్దాలుగా మనకు తెలుసు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్. మన తెలుగింటి ఆడపడచు. అంబరీష్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అంబరీష్ స్థానంలో ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో మండ్య లోక్‌సభ స్థానంలో సుమలతను నిలపాలనేది కాంగ్రెస్ నిర్ణయం. సుమలత పోటీ చేస్తే గెలుపు పక్కా అనేది వారి ధీమా.
ఇదే స్థానంలో జేడీఎస్ కూడా కన్నేయడంతో చిక్కుముడి బిగుసుకుంది. తన తనయుడు, శాండల్‌వుడ్ హీరో నిఖిల్ గౌడను మండ్య నుంచి లోక్‌సభకు పోటీ చేయించాలని జేడీఎస్ చీఫ్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తీర్మానించుకున్నారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో అంబరీష్ లోక్‌సభకు పోటీ చేయలేదు. ఆ తరువాత జేడీఎస్ ఈ స్థానాన్ని చేజిక్కించుకుంది.
ఇప్పుడు కూడా మండ్య స్థానం జేడీఎస్ ఆధీనంలోనే ఉంది. తన కుమారుడు నిఖిల్ గౌడను మండ్య నుంచి పోటీ చేయించాలనే కుమారస్వామి పట్టుబడుతున్నారు. ఈ నిఖిల్ గౌడ మరెవరో కాదు. మొన్నామధ్య తెలుగులో వచ్చిన `జాగ్వార్` హీరో. మరో రెండు కన్నడ సినిమాల్లో ఆయన నటించారు. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
సీట్ల సర్దుబాటులో భాగంగా.. మండ్య లోక్‌సభ స్థానాన్ని తమకే అప్పగించాలనేది జేడీఎస్ డిమాండ్. ఇదే స్థానం కోసం జేడీఎస్ ఇంత గట్టిగా అడగడానికీ ఓ కారణం ఉంది. అది రాజకీయ కోణం. తమకు కంచుకోటగా ఉన్న మండ్య లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్ చేతిలో పెడితే.. తమ గతేం కాను అనే భయం వారిది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. 2018 ఎన్నికల్లో ఈ ఎనిమిదింటినీ జేడీఎస్ గెలుచుకుంది జేడీఎస్.
అలాంటి బంగారుబాతును కాంగ్రెస్ చేతిలో పెడితే.. రాజకీయంగా ఇబ్బందులొస్తాయనేది భయం జేడీఎస్ నేతల్లో ఉంది. ఈ ఒక్క సీటుతో మరికొన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్-జేడీఎస్ మధ్య సయోధ్య కుదరట్లేదు. అది కాస్తా చివరికి తెగదెంపులు చేసుకునే స్థాయికి వస్తోందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.