జనసేన పార్టీ స్థాపనకు 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘జయకేతనం’ అనే పేరు పెట్టారు. ఈ పేరు ఇప్పుడు పార్టీ వర్గాల్లో పెద్ద ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. జనసేన తన రాజకీయ ప్రస్థానంలో ఈసారి 100 శాతం విజయాన్ని సాధించి ఓ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ అపూర్వమైన విజయాన్ని పురస్కరించుకుని, ఈ వేడుకను మరింత వైభవంగా నిర్వహించేందుకు పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది.
జనసేన ఇప్పటివరకు ఓ ప్రాంతీయ పార్టీగానే గుర్తింపు పొందినా, తాజా రాజకీయ పరిస్థితుల్లో అది కేవలం ప్రాంతీయంగా ఉండదనే సంకేతాలు ఇవ్వడానికి ఈ ‘జయకేతనం’ సభను వేదికగా మార్చుకుంటోంది. సభ ఏర్పాట్లు చూస్తుంటే, ఇది జాతీయ స్థాయి పార్టీలు నిర్వహించే విధంగా ఉంటుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. వాహనాల పార్కింగ్ కోసం ఐదు విభిన్న ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసారు. ఈ భారీ సభకు హాజరయ్యే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు 14 అంబులెన్స్‌లు, ఏడు మెడికల్ క్యాంప్‌లను ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ సదుపాయాలు అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో అందుబాటులో ఉంటాయి.
ఇప్పటికే జనసేన విజయాన్ని భారీగా సెలబ్రేట్ చేసుకుంటూ, భవిష్యత్‌లో మరింత బలంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే పార్టీ ఈ వేడుకలను కేవలం సాధారణ ఆవిర్భావ వేడుకగా కాకుండా, తన మున్ముందు దిశను ప్రజలకు స్పష్టంగా తెలియజేసే విధంగా నిర్వహిస్తోంది. పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో జనసేన భవిష్యత్ కార్యాచరణపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీనితో పాటు, తన మద్దతుదారులకు కొత్త లక్ష్యాలను ప్రకటించే అవకాశం ఉందని జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ వేడుక తర్వాత జనసేన మరింత విస్తృతంగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేలా ముందుకు సాగేలా చూస్తోంది. పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన, కూటమిలో కీలక పార్టీగా మారింది. ఇక వచ్చే ఎన్నికల నాటికి ఈ పార్టీ తన స్థాయిని మరింత పెంచుకునేలా కృషి చేస్తుందనే సంకేతాలు ఇప్పటికే పార్టీ నేతలు ఇస్తున్నారు. ‘జయకేతనం’ సభతో జనసేన మరో కీలక మైలురాయిని నమోదు చేసుకోబోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.