ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఈ నెల 9వ తేదీన ముగియబోతోంది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభను నిర్వహించడానికి ఆ పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేస్తున్నాయి. 3500 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేయాల్సిన రోజు కాబట్టి..ఇష్టం లేకపోయినా మీడియా జగన్ సభపై ఫోకస్ చేయక తప్పదు. దీని నుంచి దృష్టి మరల్చడానికేనా అనేలా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ కీలక ప్రకటన చేయబోతున్నారు.
వంద రోజుల పాటు ఎనిమిది జిల్లాల్లో మినీ పాదయాత్రను నిర్వహించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. వంద రోజుల పార్టీ ప్రణాళికను ఆయన అదే రోజు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు వంద రోజుల పాటు ఏమేమి చేయదల్చుకున్నారనే విషయాన్ని పవన్ కల్యాణ్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీనితో పాటు జిల్లా కమిటీలను కూడా అదే రోజు వెల్లడించనున్నారని జనసేన పార్టీ వెల్లడించింది.
మొదట్లో స్వల్పకాలిక జిల్లా కమిటీలను మాత్రమే ప్రకటిస్తారని భావించినప్పటికీ.. ఎన్నికలకు తగిన సమయం లేకపోవడం వల్ల దీర్ఘకాలిక కమిటీలను వెల్లడిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికోసం ఆయన జిల్లాలవారీగా సమీక్షలను నిర్వహిస్తున్నారు.
శ్రీకాకుళం, నెల్లూరు, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ జిల్లా స్థాయి నాయకుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. వాటిని క్రోడీకరించి, జిల్లా కమిటీలను ప్రకటించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి పండగ నాటికి అన్ని జిల్లాల సమావేశాలను పూర్తి చేయాలని నిర్ణయించారు.
సంక్రాంతి తరువాత జిల్లాల పర్యటనకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇప్పటికే ఆయన అయిదు జిల్లాల్లో పర్యటనలను పూర్తి చేశారు. మరో ఎనిమిది జిల్లాల పర్యటనకు ఆయన వెళ్లాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం కావడానికి వంద రోజుల పాటు పర్యటనకు శ్రీకారం చుట్టే చర్యల్లో భాగంగా అన్ని జిల్లాలలో కమిటీలను ఏర్పాటు చేస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు.