Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందంటూ జనసేన శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. హైద్రాబాద్‌లోని పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర అనుమానాస్పద రీతిలో వాహనాలు సంచరిస్తున్నాయట.. కొందరు వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి యత్నించారట.. పవన్ కళ్యాణ్‌ని దుర్భాషలాడారట.
ఈ మేరకు హైద్రాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో జనసేన పార్టీ ఫిర్యాదు కూడా చేసింది. ఇంకోపక్క, ఏకంగా పవన్ కళ్యాణ్‌కి జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలంటూ కేంద్రానికి సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నాయి జనసేన శ్రేణులు. కేంద్రం ఈ మేరకు బాధ్యత తీసుకుంటుందా.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే.
ఇటీవల విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ చాలా పెద్ద పొలిటికల్ షో చేశారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో కొందరు నేతలకు చెప్పు చూపించారు.. పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, అంతే కాదు, వైసీపీ నేతల్ని గట్టిగానే తిట్టారు కూడా. అంతకన్నా దారుణమైన తిట్లు వైసీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ మీద ప్రయోగించారు.
రాజకీయాల్లో విమర్శలు సహజాతి సహజం. ఇప్పుడది తిట్ల వరకూ వెళ్ళిపోయింది. భౌతిక దాడులూ జరుగుతున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడి ఇందుకు నిదర్శనం. ఏమో, పవన్ కళ్యాణ్ మీద కూడా భౌతిక దాడికి ప్రయత్నాలు జరగొచ్చు. ఇంకాస్త ముందుకెళ్ళి ఆయన్ని అంతమొందించేందుకూ ఎవరైనా ప్రయత్నించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
మరి, ఫిర్యాదు అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఏం చేస్తారు.? జడ్ ప్లస్ సెక్యూరిటీ డిమాండ్ విషయంలో కేంద్రమెలా స్పందిస్తుంది.?