Yamaha Motors: యమహా వినియోగదారులకు డబుల్ గిఫ్ట్.. ఊహించని సర్‌ప్రైజ్!

భారత మార్కెట్‌లో నాలుగు దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న యమహా మోటార్ ఇండియా, ఈ సందర్భంగా వినియోగదారులకు భారీ గిఫ్ట్ ఇచ్చింది. తమ మోటార్ సైకిళ్లు, స్కూటర్లపై ఏకంగా 10 ఏళ్ల మొత్తం వారంటీని ప్రకటించింది. దీని ద్వారా కొనుగోలుదారులకు ఉత్పత్తులపై నమ్మకాన్ని పెంపొందించడమే కాకుండా, పోటీ మార్కెట్‌లో తమ ప్రాధాన్యతను మరింత బలపరిచే దిశగా యమహా ముందడుగు వేసింది.

ఈ వారంటీ స్కీం ప్రామాణికంగా లభించే 2 ఏళ్లతో పాటు, అదనంగా 8 ఏళ్ల పొడిగింపు ఉంటుంది. ప్రధానంగా ఇంజిన్, ఎలక్ట్రికల్ వ్యవస్థలు, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ వంటి ముఖ్య భాగాలపై ఈ వారంటీ వర్తించనుంది. ఈ స్కీం పరిమితకాలపు ఉచిత ఆఫర్‌గా అందుబాటులో ఉండగా, ఆ తర్వాత తగ్గిన ధరకు కొనుగోలు చేయొచ్చని కంపెనీ తెలిపింది.

రే జెడ్ఆర్ ఎఫ్ఐ, ఫ్యాసినో 125 ఎఫ్ఐ, ఏరాక్స్ 155 వర్షన్ ఎస్ స్కూటర్లకు ఒక లక్ష కిలోమీటర్ల వరకు, ఎఫ్‌జెడ్, ఆర్15, ఎమ్‌టి-15 మోటార్‌సైకిళ్లకు 1.25 లక్షల కిలోమీటర్ల వరకు ఈ పొడిగితిన వారంటీ వర్తించనుంది. వాహనం యజమాని మారినా కూడా వారంటీ కొనసాగుతుందన్నది మరో ప్లస్ పాయింట్. దీనివల్ల రీసేల్ విలువ పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం యమహా రోడ్డుపై విజయవంతంగా నడుస్తున్న మోడళ్లను విక్రయిస్తోంది. ఈ నూతన వారంటీ పథకం వినియోగదారుల్లో విశ్వాసాన్ని మరింత పెంచుతుందని, అమ్మకాలపై సానుకూల ప్రభావం చూపుతుందని ఆటో పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పది ఏళ్ల భరోసా గిఫ్ట్‌తో యమహా కస్టమర్ల మనసుల్లో మరో మెట్టు ఎక్కనుంది.