భారత రక్షణ శాఖ మరో కీలక ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. అండమాన్ నికోబార్ దీవుల పరిధిలో ఉన్న సముద్ర ప్రాంతంలో రెండు రోజుల పాటు గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. మే 23, 24 తేదీల్లో హై ఆల్టిట్యూడ్ ఆయుధ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పౌర విమానయాన సంస్థలకు ‘నోటీస్ టు ఎయిర్‌మెన్’ (NOTAM) జారీ చేశారు.
ఈ రెండు రోజుల్లో ఉదయం 7 గంటల నుంచి మూడు గంటలపాటు గగనతలం మూసివేయబడనుంది. ప్రయోగాల్లో ఏవైనా అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా ఇది అమలు కానుంది. పైగా ఆయుధ పరీక్షల సమయంలో పౌర విమానాలు గగనతలంలో ఉండటం ప్రమాదకరమవుతుందన్న కారణంతో ఈ ఆంక్షలు విధించినట్లు సమాచారం.
ఇలాంటి రక్షణ సంబంధిత ఆయుధ పరీక్షలు ఈ ప్రాంతంలో ఇదివరకు కూడా నిర్వహించిన అనుభవం భారత సైనిక వ్యవస్థకు ఉంది. అండమాన్ నికోబార్ ప్రాంతం వ్యూహాత్మకంగా కీలకమైనదిగా భావించబడుతోంది. దేశీయంగా తయారవుతున్న ఆయుధ వ్యవస్థలు, క్షిపణుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఇలాంటి ప్రాంతాల్లో హై ఆల్టిట్యూడ్ టెస్టులు నిర్వహించడం సహజమైంది.
ప్రయాణికుల భద్రతకు ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు విమానయాన సంస్థలు ఇప్పటికే తమ షెడ్యూళ్లలో మార్పులు చేసుకుంటున్నాయి. కొన్ని సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించనున్నాయి. టెక్నాలజీలో ముందంజ వేస్తున్న భారత్, రక్షణ రంగంలోకి స్వదేశీ పరిజ్ఞానాన్ని మరింతగా ప్రవేశపెట్టేందుకు ఇలా వ్యూహాత్మకంగా ఆయుధ పరీక్షలు చేపడుతోంది.