ప్రమాదాల్లోనూ రాజకీయ ప్రమోదాలు! 

Swarna palace hotel fire accident
నిన్న తెల్లవారుజామున విజయవాడలోని కోవిద్ ఆసుపత్రిగా వినియోగిస్తున్న స్వర్ణ పాలస్ లో ఘోరమైన అగ్నిప్రమాదం సంభవించి పదిమందికి పైగా ప్రాణాలు కోల్పోవడం కలచివేసే సంఘటన.  వైరస్ బారినుంచి ప్రాణాలు రక్షించుకుందామని ఆసుపత్రిని ఆశ్రయించిన వారు అగ్నికి ఆహుతి కావడం హృదయవిదారకం.  దీనిమీద ప్రభుత్వం వెంటనే స్పందించడం, ఫోన్ చేసిన రెండు నిముషాల్లోనే అగ్నిమాపకదళం సిబ్బంది రావడం, మంటలను ఆర్పడానికి ప్రయత్నించడం వేగంగా జరిగినప్పటికీ, మంటలకు కొందరు, పొగతో ఊపిరి ఆడక కొందరు మరణించారు.  
 
విచిత్రం ఏమిటంటే, నెలరోజుల క్రితం విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో రసాయనాల పేలుడు జరిగి పన్నెండు మంది మరణించినపుడు తెలుగుదేశం, కమ్యూనిస్ట్, జనసేన పార్టీలవాళ్ళు అక్కడ రాబందుల్లా వాలిపోయారు.  ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని, డైరెక్టర్స్ ను, అధికారులను వెంటనే అరెస్ట్ చెయ్యాలని, వారి పాస్పోర్టులను స్వాధీనం చేసుకోవాలని, మృతుల కుటుంబాలకు పది లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని కోవిద్ నిబంధనలను సైతం ఉల్లంఘించి ఆందోళనలను చేశారు.  ఆ కంపెనీ డైరెక్టర్లకు కొందరు వైసిపి నాయకులకు బంధుత్వాలు ఉండబట్టే యాజమాన్యాన్ని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారని గావుకేకలు పెట్టారు.  బాధితుల ఇళ్లకు వెళ్లి వారిముందు మీడియా గొట్టాలను పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించారు.  విశాఖ రాజధానిగా పనికిరాదని కొందరు పనికిమాలిన మేధావులతో ఘంటకొట్టి చెప్పించారు.  
 
ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఎప్పుడో యాభై ఏళ్ళక్రితం విశాఖకు పన్నెడు కిలోమీటర్ల దూరంలో నెలకొల్పారు.  ఇప్పటికీ ఆ కంపెనీ నగరానికి దూరంగానే ఉన్నట్లు లెక్క.  కానీ, నిన్న అగ్నిప్రమాదం జరిగిన స్వర్ణ పాలస్ విజయవాడ నడిబొడ్డున ఉన్నది.  అదొక మూడు నక్షత్రాల హోటల్.  అలాంటి హోటల్ ను గిరాకీ లేకపోవడంతో కోవిద్ ఆసుపత్రిగా మార్చడానికి రమేష్ హాస్పిటల్ వారికి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.  అలాంటి చోట అగ్నిప్రమాదం జరగడానికి మానవతప్పిదమే కారణం అని ప్రాధమిక దర్యాప్తులో తేలింది.  విచారణ కోసం రెండు కమిటీలను నియమించింది ప్రభుత్వం.  మృతుల కుటుంబాలకు యాభై లక్షల నష్టపరిహారాన్ని కూడా ప్రకటించింది.  అయితే ఈ పరిహారం హాస్పిటల్ యాజమాన్యం ఇస్తుందా లేక ప్రభుత్వం ఇస్తుందా అనేది తెలియదు.  

స్వర్ణ హోటల్ ప్యాలస్ అగ్ని ప్రమాదం పై టీడీపీ స్పందన

అయితే రాజధాని నడిబొడ్డున ఇంతటి ఘోరప్రమాదం జరిగితే కరోనా భయంతో హైద్రాబాద్ లో దాక్కొన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు కనీసం విజయవాడ వెళ్లే ప్రయత్నం చెయ్యలేదు.   అవినీతి కేసుల్లో అరెస్ట్ కాబడిన తెలుగుదేశం నాయకులను పరామర్శించడానికి ఎనిమిదిగంటలు ప్రయాణం చేసి తాడిపత్రి, పన్నెండు గంటలు ప్రయాణం చేసి శ్రీకాకుళం కూడా వెళ్లిన లోకేష్ నాయుడు నాలుగు గంటల ప్రయాణం చేసి విజయవాడ వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించలేదు. కేవలం దిగ్భ్రాంతిని మాత్రమే వ్యక్తం చేసారు.  షాక్ తిన్నట్లు ట్వీటారు.  మృతుల ఆత్మశాంతికి ప్రార్ధించారు. అంతే తప్ప తమ శ్రేణులతో హాస్పిటల్ ముందు ధర్నాకు దిగలేదు. హాస్పిటల్ యాజమాన్యాన్ని అరెస్ట్ చెయ్యమని హుంకరించలేదు.  రమేష్ హాస్పిటల్ ను మూసెయ్యాలని రంకెలు వెయ్యలేదు.  వారి పాస్పోర్టులను సీజ్ చేయాలనీ డిమాండ్ చెయ్యలేదు!  ఎల్జీ పాలిమర్స్ బాధితులకు పార్టీ తరపున నష్టపరిహారాన్ని ప్రకటించినట్లు విజయవాడ అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు, బతికి బయటపడ్డవారికి పార్టీ తరపున నష్టపరిహారాన్ని ప్రకటించలేదు. 
 
ఇక బీజేపీ ముసుగు వేసుకున్న తెలుగుదేశం నాయకుడు సుజనాచౌదరి గారు కూడా ఆ సంఘటన కేవలం దురదృష్టకరం అని బాధపడ్డారు తప్ప యాజమాన్య నిర్లక్ష్యం అని ప్రకటించలేదు.  ఎందుకు?  ఎందుకు?  కారణం బహిరంగ రహస్యమే!  ఆ ఆసుపత్రి యాజమాన్యం వారు తెలుగుదేశం పార్టీకి చెందినవారు. పైగా  చంద్రబాబు సామాజికవర్గం వారు.  అందుకే చంద్రబాబు, ఆయన కుమారుడు నోరు మెదపలేదు. ఇక చంద్రబాబు బంట్లు కమ్యూనిస్ట్ పార్టీవారు కూడా ధర్నాలు చెయ్యకపోవడం విడ్డూరమే. ఒకప్పుడు విజయవాడ కమ్యూనిస్టులకు కంచుకోట. అలాంటి చోట ఇంతటి ఘోరప్రమాదం జరిగితే, యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని అరవడానికి కూడా కమ్మనిస్టులకు నోరు లేవడం లేదు!  
 
ఇక మొన్నమొన్నటిదాకా రాజధాని రైతుల ఇళ్లముందు కూర్చుని వారు తెచ్చుకున్న పెరుగన్నం తిని రైతులకోసం ప్రాణాలైనా ఇస్తానని హామీ ఇచ్చిన జనసేనాధిపతి వాయువేగంతో విజయవాడ వెళ్ళలేదు.  బాధితులను పరామర్శించలేదు.  ఒక్క రెట్టతో సరిపెట్టారు!  నగరం మధ్యలో అగ్నిప్రమాదం జరిగింది కాబట్టి విజయవాడ రాజధానిగా పనికిరాదని కేకలు పెట్టలేదు. 
 
ఇక బీజేపీ నాయకుడు వెలగపూడి కృష్ణప్రసాద్ వైఖరి మరీ విడ్డూరం.  ఆయన మనిషి బీజేపీలో ఉన్నప్పటికీ మనసు మాత్రం తెలుగుదేశంతోనే ఉంటుంది.  పార్టీ వైఖరికి, ఆదేశాలకు భిన్నంగా ఆయన అమరావతి రైతుల మధ్య కూర్చుని తన చెప్పుతో తననే కొట్టుకుని క్రమశిక్షణను బాహాటంగా ఉల్లంఘించారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నట్లయితే ఆయన ఒంటిమీద ఈగ కూడా వాలకపోయేది. కానీ, సోము వీర్రాజు అధ్యక్షుడు కావడంతో ఆయన్ను పార్టీనుంచి సస్పెండ్ చేశారు!  
 
ఇలాంటి నికృష్ట కులరాజకీయాలు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే చూస్తాము!  దౌర్భాగ్యం! 
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు