ఇకనైనా బీజేపీ పుంజుకుంటుందా?

Somu Veeraju
హఠాత్తుగా ఉరుములతో కూడి  పిడుగుల వర్షం కురిసినట్లు…ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రెండేళ్లక్రితం నియమించబడిన కన్నా లక్ష్మీనారాయణను తొలగించి సోము వీర్రాజును అధ్యక్షుడిగా నియమించడం సంచలనం సృష్టించింది అని చెప్పాలి.   నిజానికి కన్నా లక్ష్మీనారాయణను ఎప్పుడో సాగనంపాల్సిన ఉన్నప్పటికీ “తగిన” అర్హతలు కలిగిన అభ్యర్థి దొరక్కపోవడం కారణం కావచ్చేమో కన్నానే కొనసాగించారు.  కన్నా కాంగ్రెస్ పార్టీలో అనేకసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవులు అనుభవించి చాలా అవినీతిపరుడిగా ఖ్యాతి గడించాడు.  ఆయన మరికొద్ది గంటల్లో వైసిపిలో చేరడానికి ముహూర్తం కూడా సిద్ధం చేసుకుని చివరినిముషంలో బీజేపీలో చేరాడు.  ఆయనకు రాష్ట్ర అధ్యక్షపదవిని కట్టబెడతామనే వాగ్దానం చేసారని, పైగా ఆర్ధికంగా బలవంతుడని, దానికితోడు కాపు కులం ఓట్లకోసం ఆయన్ను చేరదీశారని అప్పట్లో వార్తలు  వచ్చాయి.
 
కానీ ఏమి లాభం?   అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి బురదలోకి లాగినట్లు కన్నా లక్ష్మీనారాయణ ప్రవర్తన మొదటినుంచి అనుమానాస్పదంగానే ఉన్నది.  వైసిపిలో చేరడానికి రెడీ అయిపోయిన వ్యక్తి ఉన్నట్లుండి జగన్మోహన్రెడ్డిని అత్యంత పరుషమైన పదజాలంతో తిట్టడం ప్రారంభించాడు .  జగన్ మీద లెక్కలేనన్ని ఆరోపణలు చేశాడు.  ముఖ్యంగా అమరావతిని మూడు భాగాలు చేస్తున్నామని జగన్ ప్రకటించిన మరుక్షణం నుంచి ఆయన జగన్ మీద విషాన్ని చిమ్మడం ప్రారంభించారు .  తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి చంద్రబాబుకు బంటుగా, బానిసగా వ్యవహరించి పార్టీని ప్రజలలో పలుచన చేశాడు.  పోనీ ఆయన పార్టీ అధ్యక్షుడుగా ఏమైనా ఇరగదీశాడా అంటే అదీ లేదు.  కన్నా రాకముందు ఏపీలో బీజేపీ ఓటు బ్యాంకు సుమారు ఏడు శాతం కాగా కన్నా నిర్వాకంతో అది ఒకశాతం కన్నా తక్కువకు దిగిజారిపోయింది .  కరుడుగట్టిన బీజేపీ నాయకులు ఎవ్వరూ కన్నాను గౌరవించలేదనే చెప్పాలి.  బీజేపీలో జన్మించి ఆరెస్సెస్ నేపధ్యం కల్గిన తమను కాదని, కాంగ్రెస్ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు అధ్యక్ష పదవిని ఇవ్వడం తొలినుంచి బీజేపీని నమ్ముకున్నవారిని కుపితులను చేసింది.  అప్పటినుంచి సోము వీర్రాజు లాంటి అచ్చమైన బీజేపీ నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 
 
ఇక అధ్యక్షుడుగా కన్నా వ్యవహరించిన తీరు ఘోరాతిఘోరం.  పార్టీ నాయకులను, కార్యకర్తలను  ఉత్తేజితులను చెయ్యడంలో ఆయన దారుణంగా విఫలం అయ్యారు.  ఆయన్ను అసలు బీజేపీ నాయకుడిగా జనమే గుర్తించలేదు.  ఇక నాయకులెలా గుర్తిస్తారు?   క్షణం క్షణం చంద్రబాబుకు తానా అంటే తందానా అంటూ చంద్రబాబు దగ్గర ప్యాకేజీలు అందుకున్నాడేమో అని సందేహం కలిగేలా చంద్రబాబు భజనలో మునిగిపోయి పార్టీని పాతాళానికి దించేశాడు.  బీజేపీ కేంద్రస్థాయి నేతల ప్రకటనలను కూడా లెక్కచెయ్యకుండా, వారి అభిప్రాయాలకు వ్యతిరేకంగా జగన్ మీద విషం కక్కుతూ, ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తూ పార్టీని నవ్వులపాలు చేశాడు .   ఆయన వలన కాపుల ఓట్లు ఏమైనా పడ్డాయా అంటే అదీ లేదు.  ఒకరకంగా చెప్పాలంటే రెండేళ్లపాటు బీజేపీని సమాధిస్థితిలోకి నెట్టేశాడు కన్నా.  
 
 
బీజేపీకి, వైసిపికి మధ్య గాప్ ను వీలైనంత ఎక్కువగా పెంచి చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ను మోడీకి సన్నిహితం చెయ్యడమే అజెండాగా కన్నా పనిచేశారనేది నిర్వివాదం.  చంద్రబాబుతో మళ్ళీ సంబంధాలను పునరుద్ధరించుకోవడం ఏమాత్రం ఇష్టం లేని కేంద్రనాయకత్వం కన్నాను సాగనంపడమే ఉత్తమం అని నిశ్చయించుకున్నట్లు కనిపిస్తున్నది.  చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగితే వేటు తప్పదు అని హెచ్చరించిందని కన్నా మార్పు ద్వారా ఒక సందేశాన్ని బీజేపీ అగ్రనాయకత్వం పార్టీశ్రేణులకు పంపించింది.  
 
ఇక సోము వీర్రాజు కులాన్ని చూసే ఆయన్ను ఆ పదవిలో నియమించారని కొందరు వాదిస్తున్నారు.  అది పూర్తిగా పొరపాటు.  నలభై ఏళ్లుగా అట్టడుగు స్థాయినుంచి రాష్ట్రస్థాయికి ఎదిగిన నికార్సైన బీజేపీ నేత సోము వీర్రాజు.  ఈయనకు కూడా చంద్రబాబుతో సంబంధాలు ఉన్నాయని అంటారు కానీ కన్నాకు ఉన్నంతమాత్రం కాదు.  చంద్రబాబుతో స్నేహం కోసం పార్టీని బలిపెట్టే దుర్మార్గానికి వీర్రాజు దిగజారడు అని నా నమ్మకం.  ఆ పదవికి వీర్రాజు ముమ్మాటికీ అర్హుడు .  ఆయన నేతృత్వంలో బీజేపీ పాతాళం నుంచి మళ్ళీ భూతలానికి ఎగబాకుతుందని ఆశిద్దాం.  అలాగే రాష్ట్రంలో ఎదగాలనుకుంటే జనసేనను కూడా వీలైనంత తొందరగా వదిలించుకుని స్వతంత్రంగా బీజేపీ తనవంతు కృషి చెయ్యాలి.  తెలుగుదేశం బాగా బలహీనపడుతున్న దృష్ట్యా వైసిపికి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగడం రాష్ట్రానికి శ్రేయస్కరం.
 
సోము వీర్రాజు గారికి శుభాకాంక్షలు.
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు