జనసేన చిరునామా ఎక్కడ?

Janasena Party
అమరావతి ( August 18,2020 ), ఎన్నికల ముందు వరకు అభిమానుల ఈలలు, అరుపులు, కేకలు, ఒన్సమోర్లు తనకు లభించబోయే ఓట్లుగా భావించి, సొంతంగా ఎదగడానికి ఏమాత్రం ప్రయత్నించకుండా, కేవలం చంద్రబాబు భజనలు చేస్తూ, ప్రతిపక్షంలో ఉన్న వైసిపిని పరుషపదజాలంతో విమర్శిస్తూ, జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిని కావవ్వను అని ప్రగల్భాలు పలుకుతూ, తీరా ఎన్నికల సమయానికి ఎవరితోనూ పొత్తు లేకుండా సొంతంగా పోటీ చేసి ప్రజలతో ఛీత్కరించబడిన జనసేన పార్టీ, ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో అని అందరికీ సందేహాలు కలుగుతున్నాయి.  ఎన్నికలు అన్న తరువాత పోరాడాలి.  ప్రజలతో మమేకం కావాలి.  ప్రజాసమస్యల పట్ల చిత్తశుద్ధి ఉండాలి.  కానీ, పవన్ కళ్యాణ్ మొదటినుంచి కూడా ప్రజల విశ్వాసాన్ని ఆవగింజంత కూడా చూరగొనలేకపోయారు.  అతి జుగుప్సాకరమైన భాష, బూతుప్రయోగాలతో జనసైనికులు విమర్శకుల మీద విరుచుకుపడి జనసేన అంటే ప్రజల్లో అసహ్యం కలిగేట్లు చేశారు. ఒకవంక కేసులను ఎదుర్కొంటూ, మరొకవంక పాదయాత్రతో ప్రజలకు చేరువ అవుతున్న వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిని కేవలం చంద్రబాబుకోసం అసభ్యంగా విమర్శిస్తూ ఆయనకు పెరుగుతున్న ఆదరణను, తనకు తరుగుతున్న అభిమానాన్ని ఏమాత్రం గుర్తించలేక చతికిలపడిపోయాడు.  చంద్రబాబు ఎన్ని కుంభకోణాలు చేస్తున్నా, అవినీతికి పాల్పడుతున్నా, ఆయన పాటలకు తాళం వేస్తూ పాకేజిస్టార్ గా అపఖ్యాతిపాలయ్యాడు.  
 
Janasena Party
 
ఎన్నికలు అన్న తరువాత గెలుపోటములు సహజం.  అయితే పోరాడి ఓడటానికి, ఉత్తుత్తి డ్రామా పోరాటాలకు చాలా తేడా ఉంది.  ఎన్నికలకు తొమ్మిది నెలలముందు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇరవై మూడు జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని రెండుమూడుసార్లు చాపచుట్టేసారు ఒకపుడు ఎన్టీఆర్.  కేవలం మూడేళ్ళ వయసున్న పార్టీతో ఎన్నికల్లో పోరాడి అరవైఏడు సీట్లు తొలిప్రయత్నంలోనే సాధించారు జగన్మోహన్ రెడ్డి.  మీడియా సహకారం, బీజేపీతో బహిరంగ మైత్రి, జనసేనతో రహస్య మైత్రి  లేనట్లయితే తెలుగుదేశం పార్టీ ఆనాడే పరాజయం పాలైఉండేది.  మొదటిప్రయత్నంలో విజయాన్ని సాధించలేకపోయినప్పటికీ, ఏమాత్రం నిరాశపడకుండా, పార్టీ నాయకులను, కార్యకర్తలను కాపాడుకుంటూ, పదహారునెలలపాటు ప్రజలమధ్యన కాలినడకన పర్యటించి , కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, ఉభయకమ్యూనిస్టు, జనసేనలను ఏకకాలంలో ఎదుర్కొని మలిప్రయత్నంలో విజయకేతనం ఎగురవేశారు జగన్మోహన్ రెడ్డి.  పోరాటం అంటే ఎలా ఉండాలో ఢంకా కొట్టి చాటారు.  
 

పోరాటం చేయని సేనాని కళ్యాణ్

 
మరి పవన్ కళ్యాణ్ పోరాటం ఎలా ఉంది?  నాడు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినపుడు ఆయన పర్యటనల తీరు చూసి “ఒకరోజు పర్యటన..వారం రోజుల విశ్రాంతి”  అంటూ వైసిపి నాయకురాలు రోజా ఎద్దేవా చేసేవారు.  బద్ధకానికి  చిరునామాగా చిరంజీవి అవహేళన పాలయ్యారు.  అయినప్పటికీ,  అప్పటి బలమైన రాజశేఖరరెడ్డి ప్రభావం ముందు పద్దెనిమిది సీట్లను సాధించగలిగి గౌరవాన్ని నిర్లబెట్టుకున్నారు చిరంజీవి.  మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్?  చంద్రబాబుకు ఆదరణ క్షీణిస్తున్న విషయాన్ని పసిగట్టలేక, లేకపోతె, పసిగట్టీ కూడా పాకేజికి లొంగిపోయినట్లు ప్రజలు నమ్మేట్లు ప్రవర్తించి తాను పోటీ చేసిన రెండుచోట్ల కూడా పరాభవానికి గురయ్యాడు.  ఏవిధమైన సినీ గ్లామర్ లేని లోక్ సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ తెలంగాణాలో పోటీ చేసి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించగా, సూర్యచంద్రులు కూడా పవన్ కళ్యాణ్ వెలుగు ముందు పనికిరారు అని భజనలు చేయించుకున్న పవన్ మాత్రం పార్టీ అధ్యక్ష హోదాలో పోటీచేసి చిత్తుగా ఓడిపోయారంటే  పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితానికి  అంతకన్నా అవమానం మరొకటేముంది?  రాజే యుద్ధంలో కూలబడితే ఇక సైన్యం ఎలా పోరాడుతుంది?  ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పరిస్థితి అదేవిధంగా ఉన్నది.  
 

పార్టీ వీడిన నాయకులు

 
ఎన్నికల్లో పరాజయం తరువాత పవన్ కళ్యాణ్ గ్లామర్ ను నమ్ముకుని పార్టీలో చేరిన కొందరు నాయకులు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు.  ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ తప్ప మరొక పేరున్న నాయకుడు ఆ పార్టీలో లేడు.  నాదెండ్ల మనోహర్ కూడా పలుకుబడి కలిగిన నాయకుడేమీ కాదు.  నాదెండ్ల భాస్కర రావు కుమారుడు కావడం, కొంతకాలం సభాపతిగా పనిచెయ్యడం వలన ఆయన పేరు ఆమాత్రం జనం నోళ్ళలో నానుతున్నది. అంతే.  
 
 
ఎన్నికలముందు “ఇక తాను సినిమాల్లో నటించను…నాది పాతికేళ్ల రాజకీయ జీవితం” అంటూ డంబాలు పలికిన పవన్ ఎన్నికల్లో ఓడిపోగానే తన మాటను తుంగలో తొక్కి మళ్ళీ సినిమాలో బిజీ అయిపోయారు.    డబ్బు సంపాదించుకోవడం తప్పా అని ప్రశ్నించవచ్చు.  తప్పేమీ లేడు.  కానీ, ఎన్నికలకు ముందు అలా చెప్పి, ఎన్నికలు అయిపోయాక మాట తప్పడం కచ్చితంగా తప్పే.  పవన్ కళ్యాణ్ మీద ఎవరికైనా కాస్తో కూస్తో అభిమానం మిగిలి ఉంటే ఇప్పుడు అది పూర్తిగా పోయి ఉంటుంది.  ప్రపంచమంతా భీతిగొల్పుతున్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేస్తున్న సమయంలో ప్రజల మధ్యన తిరుగుతూ వారికి ధైర్యాన్ని నూరిపోయాల్సిన బాధ్యతను పట్టించుకోకుండా, సినిమా షూటింగుల్లో మునిగిపోయారు పవన్.  అంతేకాకుండా, ఆ మధ్య విశాఖలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో పదకొండు మంది మరణిస్తే ప్రభుత్వం మీద నిప్పులు చిమ్మిన పవన్ కళ్యాణ్ మొన్న విజయవాడ స్వర్ణ ప్యాలస్ దుర్గ్టనలో పదిమంది మరణిస్తే కనీసం కూతవేటు దూరంలో ఉన్న ఆ ప్రాంతానికి వెళ్లి బాధితులను పరామర్శించలేదు.  హాస్పిటల్ యాజమాన్యాన్ని విమర్శించలేదు.  తాను అభిమానిస్తున్న అమరావతి ప్రాంతం కావడం,  ఆ హాస్పిటల్ యాజమాన్యానికి సినిమారంగంతో, తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో పవన్ కళ్యాణ్ నోటికి తాళం పడిపోయింది అని ప్రజలు హేళనగా నవ్వుకుంటున్నారు!
 

బీజేపీ తో పొత్తు ఫలితమిస్తుందా?

 
Janasena and BJP Alliance
 
ఏమైనప్పటికీ, ఏ కోణంలోనుంచి చూసినా జనసేన భవిష్యత్తు అంధకారంగానే కనిపిస్తున్నది.  పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ధి లేదని, ఏమాత్రం విశ్వసనీయత కలిగినవాడు కాదని ఇప్పటికే ప్రజల్లో ఒక అభిప్రాయం స్థిరపడిపోయింది.  దానికి తోడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా నానాటికీ తీసికట్టుగానే కనిపిస్తున్నది.  ఒక్కశాతం కూడా ఓటుబ్యాంక్ లేని బీజేపీతో పొత్తు వలన “జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది” అనే సామెత మరొకసారి రుజువు కావడం తప్ప మరొక ప్రయోజనం లేదు.  రోజురోజుకు ప్రజాదరణతో దూసుకుపోతున్న జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నంతకాలం పవన్ కళ్యాణ్ కు పురోగతి ఉండదు.  
 
“జ్ఞానహీనుడు ఆశ్రమంలో ఉన్నా, అడవుల్లో ఉన్నా, బాహ్యప్రపంచంలో ఉన్నా తేడా ఉండదు”  అని ఆర్యోక్తి.  పవన్ కళ్యాణ్ కు ఆ సూక్తి సరిగ్గా సరిపోతుంది.  
 
 
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు