ఆవిర్భవించి నలభై ఏళ్ళు దాటినా, నేటికీ పురిటినొప్పులతోనే అల్లాడుతూ, అంగుళం కూడా ఎదుగుదల లేని పుట్టుకవైఫల్యంతో అవస్థలు పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీలో ఏదో కదలిక మొదలైన సూచనలు కనిపిస్తున్నాయి. పుట్టినదాదిగా వెంకయ్యనాయుడి ధృతరాష్ట్ర కౌగిలిలో నలిగిపోతూ, కేవలం తమ కులంవారు స్థాపించిన పార్టీకోసం, వారి అధికారంకోసం, వారి దోపిడీకోసం, వారి అవినీతికోసం, వారి స్వార్ధం కోసం, తనకు పదవులు, హోదాలు ఇచ్చిన కన్నతల్లిలాంటి పార్టీని నిర్దాక్షిణ్యంగా అణచివేతకు గురి కావడంతో ఈనాటికీ తన ఉనికిని చాటుకోలేకపోయింది.
కేంద్రంలో అయిదుసార్లు అధికారాన్ని చేపట్టినా, రాష్ట్రంలో మాత్రం వెంకయ్యనాయుడు, హరిబాబు లాంటివారి కుతంత్ర రాజకీయాలతో తెలుగుదేశం పార్టీకి తోకలా మిగిలిపోయింది. ఆరెస్సెస్ నేపధ్యం, ఉక్కు క్రమశిక్షణ కలిగినదని చెప్పుకోబడే బీజేపీ ఆంధ్రాలో మాత్రం చంద్రబాబు నాయుడు కోవర్టులతో నిండి, పార్టీ పాతాళానికి జారిపోయింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరేడుగురు ఎంపీలను కలిగి ఉన్న బీజేపీ ఈనాడు ఒక్క ఎంపీని, ఒక్క ఎమ్మెల్యేను కూడా చూడటానికి నోచుకోలేదు. సంపూర్ణ ఆధిక్యతతో మోడీ ఐదేళ్లు పాలించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నోటా కన్నా తక్కువ ఓట్లు తెచ్చుకుందంటే, ఆ పార్టీలో తెలుగుదేశం కోవర్టులు ఎలా నిండిపోయారో చెప్పాల్సిన పనిలేదు. సాక్షాత్తూ అధ్యక్షహోదాలో లోక్ సభ స్థానానికి పోటీ చేసిన కన్నా లక్ష్మీనారాయణకు పదహారు వేల ఓట్లు మాత్రమే వచ్చాయంటే బీజేపీని ఎంత దయనీయస్థాయికి దిగజార్చారో అర్ధం అవుతుంది.
ఒకప్పుడు బీజేపీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. నీతి నిజాయితీ విలువలకు, నైతికవర్తనకు ఆలవాలం. ఒకేఒక్క ఓటును కొనుగోలు చేస్తే ప్రభుత్వం నిలబడే పరిస్థితి ఉన్నప్పటికీ, అందుకు ఏమాత్రం అంగీకరించక పదవీత్యాగానికే సిద్ధపడిన మహానేత అటల్ బిహారి వాజపేయి లాంటి వికాసపురుషుడు, హవాలా కేసులో తన మీద ఆరోపణలు వినిపించినపుడు వెంటనే పదవికి రాజీనామా చేసి తాను నిర్దోషిగా నిరూపితం అయ్యేంతవరకు లోక్ సభలో అడుగు పెట్టబోనని ప్రతిజ్ఞ చేసిన లాల్ కృష్ణ అద్వానీ లాంటి లోహపురుషుడు తమ రుజువర్తనతో పార్టీని పునీతం చేశారు. బీజేపీ పట్ల ఇంకా కాస్తో కూస్తో గౌరవం మిగిలి ఉన్నదంటే అందుకు ఆ ఇద్దరు నేతలు వేసిన పునాదులు, పాటించిన విలువలే కారణం. అలాంటి పార్టీలో నేడు ఆర్ధిక ఉగ్రవాదులు, బ్యాంకులను నిలువునా ముంచిన దేశద్రోహులు, చంద్రబాబు ఉప్పు తిన్న విశ్వాసంతో ఆస్తులను కాపాడుకోవడానికి కమలం ముసుగు వేసుకున్న ధూర్తులు చేరి పార్టీని ఉప్పుపాతర వేశారు.
అలాంటి రాష్ట్ర బీజేపీలో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. చంద్రబాబు బంటుగా దుష్కీర్తిని మూటగట్టుకున్న కన్నా లక్ష్మీనారాయణను పదవీకాలానికి ఏడాదిముందే అధ్యక్షస్థానం నుంచి తరిమేసింది బీజేపీ అధిష్టానం. ఆ స్థానంలో కరుడుగట్టిన బీజేపీ వాది, నలభై ఏళ్ల చరిత్ర కలిగిన సోము వీర్రాజును నియమించింది. ఆ క్షణం నుంచి బీజేపీలో ఏవేవో మార్పులు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా పార్టీలో క్రమశిక్షణ పాటించడం మొదలైంది.
రాజధాని వికేంద్రీకరణలో పార్టీ నిర్ణయానికి, సిద్ధాంతానికి వ్యతిరేకంగా, కొందరు చంద్రబాబు కోవర్టులు ఎత్తుతున్న గొంతులను నొక్కివేయడం మొదలైంది. అధికారప్రతినిధుల హోదాల్లో చంద్రబాబు గొంతు వినిపిస్తున్న కొందరు స్వార్ధపరులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కొందరిని పార్టీనించి సస్పెండ్ చేశారు. సుజనాచౌదరి లాంటి కోవర్టుల అభిప్రాయాలు వారి వ్యక్తిగతమే అని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర బీజేపీ విస్పష్టంగా ప్రకటించింది. అమరావతి వికేంద్రీకరణకు కేంద్రం అడ్డుకుంటుందని, రాజధాని అంగుళం కూడా కదలదని మార్జాలప్రతిజ్ఞలు చేస్తున్న కొందరు నాయకులకు ముకుతాడు వేసింది.
రాజధాని వికేంద్రీకరణతో తమకు ఎలాంటి సంబంధం లేదని కేంద్రం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చెయ్యడంతో నిన్నటిదాకా బీజేపీ గూట్లోనుంచి తెలుగుదేశం స్వరాన్ని వినిపిస్తున్న కొందరు కోవర్టుల గుండెలు జారిపోయాయి. పార్టీ లైన్ ను ధిక్కరిస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టే పనిలేదని అధిష్టానం హెచ్చరించడంతో ఇన్నాళ్లూ చంద్రబాబు సొమ్ముతిని ఆ విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్న కొందరి కాళ్లకు సంకెళ్లు పడినట్లయింది.
ఇక రాబోయే ఎన్నికల నాటికి పార్టీని అధికారంలోకి తేవడమే తమ లక్ష్యంగా వీర్రాజు ప్రకటించారు. అయితే అది జరిగే పని కాదని ఆయనకు కూడా తెలుసు. జనసేనతో కలిసి ఉన్నన్నాళ్లూ బీజేపీకి ఎక్కడా డిపాజిట్లు కూడా రావు. కేవలం కాపుల ఓట్ల కోసమే జనసేనతో పొత్తు ఉన్నట్లు బీజేపీ కొనసాగిస్తున్నది. అయితే త్వరలో ఆ బంధాన్ని కూడా తెంచుకుని కాపుల ఓట్లను తామే సొంతం చేసుకునే విధంగా వీర్రాజు అడుగులు వేస్తున్నట్లు నిన్న ఆయన చిరంజీవిని కలవడం ద్వారా ప్రయత్నిస్తున్నారనేది అర్ధమవుతున్నది.
కేవలం కులం ఓట్లను నమ్ముకోకుండా, రాష్ట్రంలో అందరి ఆదరాభిమానాలను చూరగొనేవిధంగా బీజేపీ తన కార్యాచరణను రూపొందించుకోవాలి. అప్పుడే ప్రజలు ఆ పార్టీని నమ్ముతారు. ప్రస్తుతానికైతే తెలుగుదేశం ఓటుబ్యాంకు బాగానే ఉన్నది. దాదాపు నలభైశాతం ఓట్లు మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీకి లభించాయి. గత ఏడాది జగన్ పాలనలో మరికొంతమేర ఆ పార్టీకి నష్టం జరిగిఉండచ్చు. ప్రస్తుతం వైసిపి ఓటు బ్యాంకు యాభై అయిదు శాతం కన్నా ఎక్కువగా ఉండొచ్చు. రాజధానుల వికీన్ద్రకరణ జరిగి మరో రెండేళ్లలో పాలన కుదుటపడితే వైసీపీ ఓటుబ్యాంక్ డెబ్బై శాతం దాటినా ఆశ్చర్యం లేదు. తెలుగుదేశం అయిదేళ్ల పాలనలో జరిగిన అవినీతి, దోపిడీని కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరిపించి దోపిడీదార్లను కటకటాల వెనక్కు పంపించినపుడే తెలుగుదేశం కకావికలై బీజేపీ వైసిపికి ప్రత్యామ్యాయంగా ఎదగగలుగుతుంది. అంతటి సాహసం బీజేపీ అధిష్టానం చేస్తుందా లేదా అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు