కమలాన్ని ఊడ్చేసిన చీపురు 

ఎగ్జిట్ ఫలితాలను నూటికి నూరుపాళ్లు వాస్తవమని తేలుస్తూ వరుసగా మూడోసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయాన్ని సాధించి కేంద్రప్రభుత్వాన్ని సంపూర్ణ ఆధిక్యతతో ఏలుతున్న భాజపాను మట్టికరిపించింది.  విచిత్రం ఏమిటంటే ఎనిమిది మాసాలక్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలోని అన్ని సీట్లను కైవసం చేసుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ స్థాయి కాదు కదా చెప్పుకోదగిన స్థానాలకు కూడా సాధించలేకపోయింది.  అయితే గత ఎన్నికల్లో సాధించిన మూడు స్థానాలకన్నా కొద్దిగా నయం.  రెండంకెల సీట్లను సాధించగలిగే సూచనలు కనిపిస్తున్నాయి.  
 
దేశానికి సంబంధించిన ఎన్నికలలో ఒక విధంగా, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల్లో మరొక విధంగా ఓట్లను వేసే పరిణితిని మన ఓటర్లు సాధించారని సంతోషించాలి.  లేకపోతె మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ మొత్తాన్ని భాజపా చేతుల్లో పెట్టిన ఓటర్లు అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం అందుకు పూర్తి విధంగా ఓట్లు వెయ్యడం ఏమిటి?  మన ప్రజాస్వామ్యంలోని గొప్పదనాన్ని ఇంతకన్నా రుజువు ఏమి కావాలి?   వరుసగా ఆరేళ్లనుంచి దేశాన్ని పరిపాలిస్తున్నా సామాన్య ప్రజల అవసరాలను తీర్చడానికి తాము ఏమి చేశామో కూడా బీజేపీ చెప్పుకోలేకపోయింది.    సరిగ్గా పోలింగ్ కు కొద్దిరోజుల ముందు పాకిస్తాన్ తో యుద్ధం గూర్చి, రామమందిర నిర్మాణం గూర్చి ప్రస్తావించారు ప్రధాని మోడీ.   మొన్నటి మహారాష్ట్ర ఎన్నికల ముందు కూడా సర్జికల్ స్ట్రైక్స్ గూర్చి ప్రస్తావన తెచ్చినా మహారాష్ట్ర ఓటర్లు మన్నించలేదు.  అలాగే ఢిల్లీ ఎన్నికలకు వారం రోజుల ముందు రామమందిర నిర్మాణం గూర్చి ప్రస్తావన చేసారు మోడీ.  రామ మందిరం ఎవరికి కావాలి?   అదేమైనా కూడు పెడుతుందా గూడు ఇస్తుందా?  అలాంటి సెంటిమెంట్లు రెండు దశాబ్దాల క్రితం చెల్లాయేమో కానీ, ప్రపంచదేశాలతో సాంకేతికంగా, ఆర్ధికంగా, అభివృద్ధిపరంగా పోటీ పడాల్సిన వర్తమాన కాలంలో పనికిరాని మందిర నిర్మాణాల పేరుతో ఓట్లు కొల్లగొట్టాలని బీజేపీ చేసిన ప్రయత్నం విఫలం కావడం సంతోషించాల్సిన అంశం.  బ్యాంకులను నిమజ్జనం చెయ్యడం, ఎల్లైసి, ఎయిర్ ఇండియా, బిఎసెనెల్ లాంటి సంస్థలను అమ్మెయ్యడం, ఉద్యోగకల్పనలో విఫలం కావడం, మొన్నటి బజెట్ లో రాష్ట్రాలకు ఊరట ఇచ్చే అంశం ఒక్కటికూడా లేకపోవడం, కేవలం కార్పొరేట్లకు మాత్రమే బీజేపీ అనుకూలంగా తన విధానాలను రూపొందించడం బీజేపీని సామాన్య ప్రజలకు దూరం చేశాయి.  
 
ఇక ఆప్ అధినేత కేజ్రీవాల్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఆయనను ప్రజలకు మరింత చేరువ చేసాయి.  మహిళలకు రైళ్లలో ఉచిత ప్రయాణం, విద్యుత్ రాయితీలు ప్రజలకు నేరుగా ఫలితాలను అందించేవి.  తక్కువ ఆదాయవర్గాలకు ఊరట కలిగించేవి.  దానికి తోడు అయిదేళ్లపాటు అవినీతి రహిత పాలనను అందించడంలో సక్సెస్ అయ్యారు కేజ్రీవాల్.  అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ నిజంగా ఆమ్ ఆద్మీలకోసమే అని మరోసారి రుజువు చేసారు ఢిల్లీ ప్రజలు.   
 
అయితే గతంలో కేవలం మూడు సీట్లు మాత్రమే సాధించిన బీజేపీ ఈసారి కొంచెం మెరుగైన ఫలితాలను సాధించింది.  ఆమేరకు ఆప్ తన సీట్లను కోల్పోయింది.  అయినప్పటికీ ఇది ఘనవిజయం కిందనే లెక్క.  
 
కాంగ్రెస్ పరిస్థితి మరీ దిగజారిపోయింది.  గత అసెంబ్లీలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్ ఈసారి కూడా ఆ ఘనతను నిలబెట్టుకున్నది.  నెహ్రు-గాంధీ చెరనుంచి కాంగ్రెస్ విముక్తి పొందినపుడే ఆ పార్టీకి మరలా జీవం వస్తుంది.  
 
ఇకనైనా బీజేపీ బుద్ధి తెచ్చుకుని తన విధానాలను మార్చుకోకపోతే బీజేపీ ముక్త్ భారత్ త్వరలోనే తధ్యం అవుతుంది.  
 
ఈ వ్యాసం ఉదయం తొమ్మిదిన్నరకు రాసింది.  పూర్తి ఫలితాలు వచ్చేసరికి కాస్త అటూ ఇటూ కావచ్చు.  
 
 
Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు