ప్రపంచ కుబేరుల్లో ఒకడు, దేశంలోనే అతి పెద్ద లక్ష్మీపతి అయినట్టి ముఖేష్ అంబానీ స్వయంగా అమరావతి వెళ్లి ముఖ్యమంత్రి జగన్ ను కలిసి తన సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు పరిమళ నత్వాని ని వైసిపి టికెట్ మీద మరోసారి రాజ్యసభకు పంపమని కోరితే కాదనడం ఎవరికైనా సాధ్యమా? జగన్ స్థానంలో చంద్రబాబు ఉన్నట్లయితే, చంద్రబాబునే ఢిల్లీకో, ముంభైకో వచ్చి తనను కలవమని హుకూం జారీ చేసేవాడు ముకేశ్ అంబానీ. చంద్రబాబు ఆగమేఘాలమీద ప్రత్యేకవిమానం వేసుకుని పరిగెత్తి అంబానీ ముందు చేతులు కట్టుకుని కూర్చుని నామినేషన్ పేపర్ మీద పరిమళ్ నత్వాని సంతకాలు తీసుకుని వివరాలు అన్నీ ఫార్మ్ లో తానే నింపేసేవాడు! జగన్ సంగతి అంబానీకి బాగా తెలుసు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో ఆయన ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చునే ముఖేష్ అంబానీ, వైఎస్సార్ హయాంలో ఆయన కూర్చుని ఉండగా తాను చేతులు కట్టుకుని నిలుచునేవాడు. అప్పటి ఫోటోలు చాలామందికి గుర్తుండే ఉంటాయి.
గత మాసంలో జగన్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నప్పుడు అంతకుముందు జగన్ కు దర్శనం ఇవ్వని మోడీ, అమిత్ షా లు ఇద్దరు జగన్ తో గంటసేపు మాట్లాడటం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. బహుశా ఆ మీటింగ్స్ లో రిలయన్స్ అధినేత కోరిక తీర్చమని వారిద్దరూ జగన్ ను కోరి ఉంటారు. అయితే, అంబానీ స్వయంగా అభ్యర్థిస్తే పరిశీలిస్తామని జగన్ చెప్పి ఉంటారు. జగన్ పట్టుదల, పౌరుషం ఏమిటో మోడీకి, అమిత్ షా కు ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. శాసనసభలో ఎనభై శాతం సీట్లతో, అంతులేని ప్రజాదరణతో, సంక్షేమ పథకాలతో, సరికొత్త పాలనా పద్ధతులతో దూసుకుని పోతున్న జగన్ తో డీల్ చెయ్యడం అంటే చంద్రబాబుతో చేసినంత సులభం కాదని వారికి ఏనాడో అర్ధం అయింది. ఫలితమే కొండమీది కుబేరుడు దిగివచ్చి స్వయంగా జగన్ ను కలిసి అభ్యర్ధించాడు. వీరి కలయిక వెనుక రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చాణక్యం కూడా ఉన్నదంటున్నారు. అదే నిజమైతే విజయసాయి రెడ్డి రాజకీయ జీవితంలో దీన్నొక ఘనవిజయంగా నమోదు చెయ్యాలి.
అయితే ఇక్కడ జగన్ వ్యూహం పెద్దపెద్ద సీనియర్లమని చెప్పుకునేవారిని కూడా కంగు తినిపించింది. పార్టీ ముద్ర లేకుండా వైసిపి ఓట్లతో స్వతంత్రుడిగా రాజ్యసభకు తన సహచరుడిని పంపాలని ముకేశ్ అంబానీ వేసిన ఎత్తు జగన్ ముందు పారలేదు. పోటీ చెయ్యదలచుకుంటే తమ పార్టీ టికెట్ మీదనే పోటీ చెయ్యాలని జగన్ తెగేసి చెప్పడంతో అంబానీ మైండ్ బ్లాంక్ అయిఉంటుంది. వ్యాపార దిగ్గజం అయిన తన కోరికను జగన్ యధాతధంగా మన్నిస్తాడని అంబానీ పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. చివరకు పరిమళ్ నత్వాని ని వైసిపి ఎంపీగా అంగీకరించక తప్పలేదు. ఆ విధంగా దేశంలోని ఒక వ్యాపారసామ్రాట్టును తన ఖాతాలో వేసుకోవడంతో జగన్ వ్యూహం అభినందనీయం.
రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలు వైసిపి ఖాతాలోకే వెళ్తాయి. వాటిలో రెండింటిని మండలి రద్దుతో పదవులు పోగొట్టుకుంటున్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ కు కేటాయించడం ద్వారా వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు జగన్. వారిద్దరూ కోట్లాధిపతులు కారు. కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి విధేయులు. వారికి టికెట్లను కేటాయించడం ద్వారా విధేయత, విశ్వాసానికి పెద్దపీట వేసినట్లయింది. ఇక మరో స్థానాన్ని పారిశ్రామికవేత్త అయోధ్య రామిరెడ్డికి ఇవ్వడం ద్వారా పారిశ్రామికవేత్తలకు తాను ఇచ్చే ప్రాధాన్యతను చాటుకున్నాడు.
ఇక వైసిపి తన టికెట్ ను పరిమళ్ నత్వానికి ఇవ్వడాన్ని చంద్రబాబు తప్పు పట్టడం ఏమిటో అర్ధం కాదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభ స్థానాలను వందల కోట్లకు అమ్ముకున్నాడు. బ్యాంకులకు అప్పులు ఎగగొట్టిన ఆర్థికఉగ్రవాదులు సుజనాచౌదరి, సీఎం రమేష్ లాంటి ఆర్థికనేరగాళ్లకు టికెట్లు ఇచ్చారు. అలాగే పొంగూరు నారాయణలాంటి మహారాజపోషకులకు ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చి పార్టీకి నిస్వార్ధంగా సేవచేసిన వారికి పంగనామాలు పెట్టాడు. అందుకు భిన్నంగా ఇద్దరు బీసీలకు జగన్ టికెట్లు కేటాయించడం అంటే చాలా గొప్ప విషయం.
ఇక పరిమళ్ నత్వానికి టికెట్ ఇవ్వడం ద్వారా అతి పెద్ద పారిశ్రామికవేత్తకు తన పట్ల విధేయత, గౌరవం పెరిగేట్లు చేసుకున్నాడు. మోడీ మాటను మన్నించి ఆయన మెప్పును పొందాడు. ఇక రాష్ట్రంలో రిలయన్స్ వారు కచ్చితంగా పెట్టుబడులు పెట్టక తప్పని పరిస్థితిని తెచ్చాడు జగన్. వారి పెట్టుబడులన్నీ భారీస్థాయిలో ఉంటాయి కాబట్టి ఉపాధికల్పన కూడా అదే స్థాయిలో ఉంటుంది. తద్వారా రాష్ట్రానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. కేంద్రప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ పట్ల కొంచెం ఉదారత్వం ప్రదర్శించే అవకాశం ఉంటుంది.
ఏదేమైనా నలుగురు సభ్యులను రాజ్యసభకు పంపించడంలో స్వప్రయోజనం, పార్టీ ప్రయోజనం, ప్రభుత్వ ప్రయోజనం, రాష్ట్ర ప్రయోజనం కూడా ఇమిడేట్లు చూడటంలో జగన్ అతి గొప్ప చాకచక్యాన్ని, దూరద్రుష్టిని ప్రదర్శించారనడంలో అతిశయోక్తి లేదు.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు