తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్  ఊపిరి పోస్తాడా? 

2019  ఎన్నికల్లో ఎదురైన ఘోరపరాజయం తెలుగుదేశం పార్టీని, ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును తీవ్రదిగ్భ్రాంతిలో ముంచెత్తింది.  పోల్ మేనేజ్మెంట్ బాగా తెలుసని, మీడియా మొత్తం చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తుందని, చివరి నిముషంలో అయినా చక్రం తిప్పుతారని, నంద్యాల ఫార్ములాను మళ్ళీ ప్రయోగించి రెండోసారి పార్టీని అధికారంలోకి తెస్తారని పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు చంద్రబాబుపై పెట్టుకున్న ఆశలమీద నీళ్లు చిమ్మారు ఓటర్లు.  చాణక్యుడని, యుగంధరుడని  చంద్రబాబుకు అప్పటిదాకా ఉన్న పేరు 2019  ఎన్నికల పరాజయంతో పటాపంచలై పోయింది.  అధికారంలో ఉండికూడా, మంత్రిగా ఉన్న సొంత కొడుకును సైతం గెలిపించుకోలేని అసమర్ధుడుగా చంద్రబాబు మీద పడిన ముద్ర ఎన్నటికీ చెరిగిపోనిది.  జీవితాంతం మనస్సును ముల్లులా పొడిచే చేదు జ్ఞాపకం.  
 
అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి పాలనలో తనదైన శైలిలో దూసుకుని వెళ్తున్నాడు జగన్.  చేతికి ఎముకే లేనట్లు సంక్షేమ పధకాలను ప్రకటిస్తున్నాడు.  ప్రకటించడమే కాదు..వాటిని వాయువేగంతో అమలు చేస్తున్నాడు.  మొదటి ఏడాదిలోనే దాదాపు నలభై మూడువేల కోట్ల రూపాయల విలువైన పథకాలను అమలు చేసాడు.  తెలుగుదేశంతో పాటు పచ్చ మీడియా ఎంత దుష్ప్రచారం చేసినప్పటికీ, జగన్ ఏమాత్రం వెరవడం లేదు. 
 
చంద్రబాబు మీద ప్రతివిమర్శలు చెయ్యకుండా, పట్టించుకోకుండా ముందుకు సాగిపోతుండటం తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం జీర్ణం కావడం లేదు.  హైకోర్టు ఇస్తున్న తీర్పులు, ఆదేశాలు చీకాకు కలిగిస్తున్నప్పటికీ అసలు ఏమీ జరగనట్లే జగన్ గుంభనంగా ఉండటం ప్రత్యర్థుల గుండెలను మండిస్తున్నది.  ఇటీవలే జాతీయస్థాయిలో జరిగిన ఒక సర్వే దేశంలోనే నాలుగో అత్యుత్తమ ముఖ్యమంత్రి అని కితాబు ఇవ్వడం నైతికంగా జగన్ కు గొప్ప బలం ఇస్తుందనడంలో సందేహం లేదు.  రాబోయే పదేళ్లు కూడా జగనే ముఖ్యమంత్రిగా ఉంటాడని అనేకమంది నమ్ముతున్నారు.  మరి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్ధకంగా మారింది.
 
Nara Lokesh
Nara Lokesh during Telugu Desam Maha Nadu
మరో పదేళ్లు అంటే అప్పటికి చంద్రబాబుకు ఎనభై ఏళ్ళు వస్తాయి.  ఆ వయసులో చంద్రబాబు ఇప్పటిలా చురుగ్గా ఉండే అవకాశాలు తక్కువ.  ఇక ఆయన కొడుకు లోకేష్  పార్టీ నడిపే భారాన్ని మోయగలరా అని ప్రశ్నించుకుంటే అది అసాధ్యం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.  లోకేష్ కు భాషాసమస్య విపరీతంగా ఉన్నది.  ఆయనకు తెలుగు భాష ధారాళంగా మాట్లాడటం అస్సలు రాదు అని మొన్న ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలిసిపోయింది.  ఇంగ్లిష్, హిందీ బొత్తిగా రావు.  పైగా లోకేష్ కున్న లోకజ్ఞానం పట్ల పలువురికి సందేహాలు ఉన్నాయి.  తెలుగుదేశం అభిమానులకు, నాయకులకు లోకేష్ సమర్ధత మీద ఎలాంటి ఆశలు లేవు. 
 
నా అంచనా ప్రకారం మరో అయిదేళ్లపాటు చంద్రబాబు చురుగ్గానే ఉంటారు. ఎందుకంటే రాజకీయాల్లో ఎనభై ఏళ్ళవయసులో కూడా ఎన్నికల్లో పోరాడి ముఖ్యమంత్రులు అయినవారు ఎందరో కనిపిస్తారు.  కరుణానిధి, అచ్యుతానందన్, కరుణాకరన్, జ్యోతిబసు, మొరార్జీ దేశాయ్, వాజపేయి, మన్మోహన్ సింగ్   లాంటి అనేకమంది నాయకులు ఎనభై ఏళ్ల తరువాత కూడా చురుగ్గానే అధికారం నిర్వహించారు.  కనుక 75  ఏళ్ల వయసు అనేది చంద్రబాబు విషయంలో పెద్ద లెక్కలోనిది కాకపోవచ్చు.  అయితే 2024  ఎన్నికల్లో కూడా తెలుగుదేశం విజయాన్ని సాధించలేకపోతే ఇక ఆ పార్టీలో ఎంతమంది మిగులుతారో చెప్పడం కష్టం.  
 
తెలుగుదేశం పార్టీలోని మరొక పెద్ద లోపం ఏమిటంటే ఆ పార్టీలో ఇంకా మూడు తరాలనాటి వృద్ధ నాయకత్వమే పెత్తనం చెలాయిస్తున్నది.  చంద్రబాబు, గోరంట్ల బుచ్చయ్య, కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు,  ముఖాలే కనిపిస్తున్నాయి తప్ప నలభై ఏళ్ల తరువాత కూడా యువనాయకత్వం రావడం లేదు.    లోకేష్ కోసం చంద్రబాబు ఎవ్వరినీ ఎదగకుండా తొక్కేశారు అనేది పార్టీలో కొందరు నాయకులు ఆంతరంగిక సమావేశాల్లో చెప్పుకునే విషయం.  ఒక్క రామ్మోహన్ నాయుడు తప్ప చురుకైన యువనేతలు ఎవరైనా తెలుగుదేశం పార్టీలో ఉన్నారా?  
 
ఒకవేళ 2024 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం గెలవకపోతే, ఇక ఆ పార్టీ భవిష్యత్తు శూన్యం అని చెప్పుకోవచ్చు.  అలాంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ చీలిపోవచ్చు…లేదా 1995 లో  ఎన్టీఆర్ ను బహిష్కరించి చంద్రబాబును అధినేతగా ఎన్నుకున్నట్లు చంద్రబాబును బహిష్కరించి జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరగొచ్చు.  తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు.  అదే పేరును కలిగి ఉన్న ఎన్టీఆర్ మనుమడు పార్టీ పగ్గాలు చేపట్టాలనే డిమాండ్ తలెత్తవచ్చు.
 
Jr NTR
Jr NTR in 2009 election campaign

అయితే ఎన్టీఆర్ కు సినిమాల్లో మరో పదిహేనేళ్ల పాటు ఢోకా లేదు.  పైగా  సీనియర్ ఎన్టీఆర్ పోయాక ఆయన కుటుంబం తనను, తన తల్లిని ఎంత వేధించిందో, ఎన్ని అవమానాలకు గురి చేసిందో జూనియర్ ఎన్టీఆర్ మర్చిపోతాడనుకోలేము.  చంద్రబాబు తనను వాడుకుని కరివేపాకులా వదిలేశాడనే గుర్రు జూనియర్ ఎన్టీఆర్ లో మెండుగా ఉన్నదంటారు.   తనను అవమానించిన చంద్రబాబు సారధ్యంలోని తెలుగుదేశం పార్టీ పూర్తిగా భూస్థాపితం కావాలని, లోకేష్ ఎందుకూ పనికిరానివాడుగా అపఖ్యాతి పాలు కావాలని జూనియర్ మనసులో కోరుకోకుండా ఉండడు.  అందువలన ఆయన సినిమా కెరీర్ ను పాడుచేసుకుని రాజకీయాల్లో ప్రవేశించి జగన్ తో శత్రుత్వం పెట్టుకుంటాడంటే విశ్వసించలేము.  
 
 
ఇక మిగిలిన ఆప్షన్ లోకేష్ ఇల్లాలు బ్రాహ్మణి.  ఆమె వ్యాపార రంగంలో చురుగ్గా ఉంటున్నారు.  డైనమిక్ లేడీ అనే పేరు సంపాదించుకున్నారు.  ఆమెను పార్టీలోకి తీసుకొస్తే మళ్ళీ తెరచాటున చంద్రబాబు, లోకేష్ ల పెత్తనమే సాగుతుంది.  ఒకవేళ బ్రాహ్మణి పార్టీ పగ్గాలు చేపట్టినా ఆమె మరో అయిదేళ్ళో పదేళ్ళో వైసీపీతో పోరాడక తప్పదు.  వ్యాపారాన్ని వదిలేసి ఏళ్లతరబడి రాజకీయ పోరాటం చేసే తెగువ ఆమె ప్రదర్శిస్తుందా అనేది కూడా సందేహమే.
 
Nara Brahmani
Nara Brahmani
ఏమైనప్పటికీ, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కనీసం నలభై  సీట్లయినా సంపాదించలేకపోతే ఇక తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు డోలాయమానమే. అయితే ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సర్వసాధారణం.  ఇవాళ గెలిచినంతమాత్రాన మరో ఐదేళ్లు, పదేళ్లు మనమే గెలుస్తాం అని ధీమా పెంచుకోవడం ప్రమాదమే.  2014  లో జగన్ గెలుస్తాడని సర్వేలన్నీ కుండబద్దలు కొట్టినా, చంద్రబాబు గెలిచారు.  2019 లో చివరి నెలల్లో తాను ముప్ఫయి వేలకోట్ల రూపాయల పసుపుకుంకుమలు ఇచ్చాను కాబట్టి మళ్ళీ తానె గెలుస్తారని చంద్రబాబు నమ్మితే,  అమేయవిజయాన్ని సాధించారు జగన్.  కాబట్టి అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు.   మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటే అది జగన్ చేసే తప్పుల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది.  
 
 
 
Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు