నాయకులంతా కారణజన్ములా..? కరోనాను ఇట్టే జయిస్తున్నారు !

కరోనా వైరస్ సామాన్యుల జీవితాలను ఎంత దెబ్బ తీసిందో అందరికీ తెలుసు.  రెక్కాడితే కానీ డొక్కాడని కూలీల దగ్గర్నుండి ప్రభుత్వ ఉద్యోగుల  వరకు అందరూ ఆర్థికంగా కుంగిపోయారు.  పనులు లేక అసంఘటిత కార్మికులు కష్టాలు పడుతుంటే అర జీతాలతో ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి ప్రైవేట్ ఉద్యోగులు తలకిందులవుతున్నారు.  పరిస్థిని అర్థం చేసుకుని ఆర్థిక కష్టాలకు కూడా సిద్దమయ్యారు జనం.  ప్రాణాలతో ఉంటే చాలనుకుని అర్థాకలి బ్రతుకులు వెళ్లదీస్తున్నారు.  కానీ ఏ ప్రాణాల కోసం అయితే అన్ని కష్టాలను భరిస్తున్నారో ఆ ప్రాణాలకే భరోసా కరువైతే.  అన్ని రాష్ట్రాల ప్రజల పరిస్థితి ఇలానే ఉంది.  కరోనా బారినపడిన సామాన్యులకు బ్రతుకుతామనే భరోసా పూర్తిగా కరువైపోయింది.  
 
 
మన తెలుగు రాష్ట్రాల సంగతే తీసుకుంటే మన ప్రభుత్వ వైద్యం యొక్క ప్రమాణాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల ఏపాటివో అందరికీ తెలసు.  మామూలు రోజుల్లో అయితే ఎలాగోలా వాటితోనే అరకొర వైద్యం పొందుతూ నెట్టుకొస్తున్న జనం ఈ కరోనా కాలంలో మాత్రం తట్టుకోలేమంటూ చేతులు జోడించి ప్రభుత్వాలకు, నాయకులకు దండం పెడుతున్నారు.  వైరస్ ప్రభావం మొదలై ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సర్కార్ దావఖానాలు ఎప్పటిలానే అధ్వానంగానే ఉన్నాయంటే ప్రభుత్వాల పనితీరు ఎంత కింది స్థాయిలో ఉందో అర్థమవుతుంది.  అరకొర వసతులున్న పాత ఆసుపత్రులనే కోవిడ్ సెంటర్లుగా మార్చారు మన వాళ్లు.  కరోనా సోకితే సామాన్యులకు ఆ ఆసుపత్రులే దిక్కు. 
 
 
అలాంటి ఆసుపత్రుల స్టాండర్డ్స్ దయనీయంగా ఉన్నాయి.  కరోనా చికిత్సలో ప్రధానమైనది రోగులకు ప్రాణవాయువును అందించడం.  అదే కరువైంది.  కరోనా సిట్యుయేషన్ మొదలై ఇన్ని రోజులు గడుస్తున్నా ప్రభుత్వ వైద్యశాలల్లో సరిపడినన్ని ఆక్సీజన్ సిలిండర్లు లెవంటే నిర్వహణ ఎంత అద్వానంగా ఉందో తెలుస్తుంది.  కేవలం సరైన సమయానికి ఆక్సీజన్ అందక చాలామంది ప్రాణాలు కోల్పోయారు.  కొత్తగా అడ్మిట్ అవుతున్న వారికి బెడ్లు దొరకడం గగనమైపోయింది.  ఇప్పటివరకు తెలంగాణలో మరణాల సంఖ్య 500కు చేరువలో ఉండగా ఏపీలో మరణాలు 1040 దాటాయి.  సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా కరోనా సోకుతోంది.  తెలంగాణలో హోంమంత్రి సహా  ఎమెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్, ముత్తురెడ్డి యాదగిరిరెడ్డి, కాంగ్రెస్ నేత హనుమంతరావుకు సోకగా, ఈరోజు మేయర్ బొంతు రామ్మోహన్ కు పాజిటివ్ అని తేలాగా ఎపీలో విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు, డిప్యూటీ సీఎంకు, ఎస్.కోట వైసీపీ ఎమ్మెల్యే కె.శ్రీనివాసరావు, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ వైరస్ బారినపడ్డారు.
 
 
మరి వీరంతా కూడ సామాన్యుల మాదిరిగానే వైద్యం కోసం ఇబ్బందిపడుతున్నారా అంటే అదేం లేదు.  ప్రాథమిక స్థాయి లక్షణాలు కనబడగానే వీరంతా కార్పొరేట్ ఆసుపత్రులకు పరుగులు తీశారు.  24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ వీవీఐపీ ట్రీట్మెంట్ తీసుకుని కోలుకుంటున్నారు.  ఎవ్వరికీ ప్రాణాపాయం లేదు.  ఎందుకంటే వీరంతా లీడర్లు.  మరి లీడర్లంటే కారణజన్ములే కదా.  లక్షల ప్రజాధనంతో కార్పొరేట్ ట్రీట్మెంట్ దొరకుతోంది వాళ్లకు.  అందుకే కరోనాను ఇట్టే ఓడించేస్తున్నారు.  ఆ ఉత్సాహంలోనే సరైన మందులు, సకాలంలో వైద్యం తీసుకుంటే కరోనా మనల్ని ఏమీ చేయలేదని, గుండె ధైర్యం ఉంటే చాలని, ప్రమాదం నుండి బయటపడిపోవచ్చని అలవోకగా చెప్పేస్తున్నారు.  మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సామాన్యులు చనిపోయేది నేతలంటున్న గుండె ధైర్యం లేకనా అంటే కాదు.. సకాలంలో మెరుగైన వైద్యం అందక.  వైద్యం ఎందుకు అందట్లేదు అంటే వారంతా కారణజన్ములు.. అదే పొలిటికల్ లీడర్లు కాదు కాబట్టి.  
 
 
ఈ తేడానే సామాన్యుల ప్రాణాలు తీస్తోంది.  ఒక రాజకీయ నాయకుడి ప్రాణానికున్న విలువ నిరుపేద ప్రాణానికి లేదు.  అతని కోసం ప్రభుత్వాలు కదలవు.  ప్రత్యేక సిఫార్సులు రావు.  సత్వర వైద్యం అందదు.
24 గంటల అబ్జర్వేషన్ ఉండదు.  వైరస్ బారినపడితే వైరస్ ప్రభావానికన్నా వైద్యం అందక, సౌకర్యాల కొరతతో చనిపోతామేమో అనే భయం ప్రస్తుతం జనంలో బలంగా పాతుకుపోయి ఉంది.  టీవీ ఛానెళ్లలో, పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో కొవిడ్ సెంటర్లలోని దారుణ పరిస్థితులు, చూస్తుండగానే ప్రాణాలు పోతున్న ఘటనలు చూసి భయపడిపోతున్నారు.  ఒకవేళ వైరస్ సోకితే మనం కూడా అక్కడికే పోవాలి కదా, పోతే మన పరిస్థితీ అంతే కదా అని ప్రభుత్వ ఆసుపత్రులను తలచుకుని వణికిపోతున్నారు.  పాలకులు ఇంత చేశాం, అంత చేశాం, ఇంకా చేస్తాం భయపడొద్దు అంటూ ఎన్ని కబుర్లు చెప్పినా గ్రౌండ్ లెవల్లోని చేదు వాస్తవం మాత్రం ఇదే.