ఢిల్లీలో టెన్షన్ టెన్షన్… కవిత అరెస్ట్?

బీఆరెస్స్ శ్రేణులు, కవిత అభిమానులు ఆందోళనగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఇప్పటికే ఒకసారి కవితను విచారించిన ఈడీ… నేడు మరోసారి కవితను విచారిస్తుంది. ఈ తరుణంలో లిక్కర్ స్కాం లో కవిత విషయంలో పక్కా ఆధారాలు ఉన్నాయని ఈడీ కాన్ఫిడెంట్ గా ఉందని కథనాలొస్తున్న పరిస్థితుల్లో.. ఈరోజు కవిత అరెస్టు ఉండొచ్చని టెన్షన్ తో ఉన్నారు బీఆరెస్స్ శ్రేణులు! దీంతో మరోసారి తెలంగాణ రాజకీయాలకు హస్తిన వేదికైంది.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత మరోసారి ఈడీ విచారణకు హాజరు అవ్వడంతో.. హస్తిన కేంద్రంగా బీజేపీ – బీఆరెస్స్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కవితకు మద్దతుగా తెలంగాణ మంత్రులు, ఎంపీలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఈ రోజు అరెస్టు చేసే అవకాశాలున్నాయంటూ వస్తున్న ఊహాగాణాలతో బీఆరెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికె మార్చి 11న ఈడీ కవితను తొలిసారి విచారించిన సంగతి తెలిసిందే. నాడు సుమారు 9 గంటల పాటు కవిత విచారణ సాగింది. అయితే ఈడీ విచారణకు కవిత పూర్తిగా సహకరించలేదని కథనాలొచ్చాయి కూడా. ఇక.. నేటి విచారణ విషయానికొస్తే… అరుణ్‌ పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించాలని ఈడీ డిసైడ్ అయింది. కవితను విచారించే ముందురోజే బుచ్చిబాబును కూడా ఈడీ విచారించింది. అయితే నేడు కవిత సమక్షంలో బుచ్చిబాబును మరోసారి విచారించనుంది ఈడీ!

దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సూత్రదారులు – పాత్రదారులు.. వారిలో కవిత పాత్ర మొదలైన విషయాలపై మాగ్జిమం ఇన్ ఫర్మేషన్ వచ్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. అదే జరిగితే.. కవిత అరెస్టు ఉండొచ్చని అంటున్నారు!

ఆ సంగతులు అలా ఉంటే… ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణను ఎదుర్కొంటున్న కవిత.. ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా ఈడీ అధికారులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారని.. తీవ్రమైన బలవంతపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. అయితే ఆ విచారణను కోర్టు ఈ నెల 24న విచారణకు స్వీకరించనుంది!