రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ని హైకోర్టు కొట్టివేయడం పట్ల అధికార పార్టీ హర్షం వ్యక్తం చేసింది. మంత్రులు, వైసీపీకి చెందిన ఇతర ముఖ్య నేతలు.. రాష్ట్ర ప్రజలందరికీ ఇది సుదినమంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కరోనా ముప్పు నుంచి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించిందనీ, ఎస్ఈసీ తీరుతో రాష్ట్ర ప్రజానీకం కరోనా పట్ల ఆందోళన చెందారనీ, వారికి హైకోర్టు తీపి కబురు అందించిందనీ కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్ తదితర మంత్రులు వ్యాఖ్యానించారు. మంత్రి కొడాలి నాని అయితే, తన సహజ శైలిలో టీడీపీ అధినేత చంద్రబాబుపైనా, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘వెధవలు’ అంటూ విరుచుకుపడిపోయారు. ‘బూట్లు నాకడం’ వంటి పదాలూ దొర్లాయి కొడాలి నాని నోటి వెంట. ఆయన మాట్లాడితే అలాగే వుంటుంది మరి.
ఒక్కటి మాత్రం నిజం. కరోనా నేపథ్యంలో కొంత గందరగోళ పరిస్థితి ప్రజల్లో వున్న మాట వాస్తవం. పైగా, వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతోందాయె. ఈ తరుణంలో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ జారీ చేయాల్సినంత అత్యవసరం నిమ్మగడ్డకు ఏమొచ్చిందన్నదే మిలియన్ డాలర్ల పశ్న. ఈ అంశంపై కొడాలి నాని స్పందిస్తూ, ‘కుక్క కాటుకి చెప్పు దెబ్బ’ అనేశారు. ఇంత తీవ్ర స్థాయిలో కొడాలి నాని స్పందించడం వెనుక, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఎస్ఈసీ నిమ్మగడ్డ తీసుకుంటున్న నిర్ణయాలే కీలక పాత్ర పోషించాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. అయితే, కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ఇప్పుడే కథ మొదలయ్యింది. నిమ్మగడ్డ, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేయబోతున్నట్లు ప్రకటించిన దరిమిలా, ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఇలాంటి వ్యవహారాల్లో కోర్టు జోక్యం అనేది చాలా అరుదు.. అన్నది రాజకీయ పరిశీలకుల భావన. సరే, ఎవరి వాదన వారిదనుకోండి, అది వేరే విషయం. అయితే, రేప్పొద్దున్న తీర్పు ఇంకోలా వస్తే, అప్పుడూ అధికార పార్టీ నేతలు ‘కుక్క కాటుకి చెప్పుదెబ్బ’ అనే మాటకు కట్టుబడి వుంటారా.? వ్యవస్థల్ని చంద్రబాబు మేనేజ్ చేసేస్తున్నారని బుకాయిస్తారా.? వ్యవస్థల్ని మ్యానేజ్ చేసేంత సీన్ చంద్రబాబుకి వుందా.? అంటే, ఛాన్సే లేదని.. హైకోర్టు తాజా తీర్పుతో తేటతెల్లమయిపోయిందన్నది ఇంకో వర్గం వాదన.