హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కున్న సినిమా ‘సబ్జెక్టు’ మారిందట. ఈసారి హరీష్ శంకర్ రీమేక్ చేయబోతున్నాడట. స్ట్రెయిట్ సినిమా చేయడానికి తగినంత సమయం పవన్ కళ్యాణ్ వద్ద లేకపోవడంతోనే చివరి నిమిషంలో ఈ మార్పు అట.
‘తెరి’ సినిమాని పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నాడన్నది పాత వార్తే. అది ఇప్పుడు ఇంకాస్త గట్టిగా వినిపిస్తోందంతే. ఇందులో హరీష్ శంకర్ తప్పేముంది.? హరీష్ శంకర్ అయితే ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా కథ రాసుకుని రెడీగా వున్నాడు.
త్వరలో, అతి త్వరలో మంచి అప్డేట్ రాబోతోందని హరీష్ శంకర్ ట్వీటేసేసరికి అభిమానులకు మండిపోయింది. రీమేక్ చేస్తే బాగోదంటూ హెచ్చరికలే కాదు.. ఆత్మహత్య చేసుకుంటామంటూ సూసైడ్ నోట్లు కూడా సోషల్ మీడియా వేదికగా పంపుతున్నారు.
ఇక్కడో విషయం పవన్ అభిమానులూ గుర్తుంచుకోవాలి. హరీష్ శంకర్ గతంలో పవన్‌తో చేసిన సినిమా ‘గబ్బర్ సింగ్’ కూడా రీమేకే. పవన్ నటించిన ‘వకీల్ సాబ్’, ‘భీమ్లానాయక్’ కూడా రీమేక్ చిత్రాలే. పవన్ ఏం చేయాలి.? హరీష్ ఎలాంటి సినిమా తీయాలనేది కూడా అభిమానులే డిసైడ్ చేసేస్తే ఎలా.?