ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలుకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 మదింపు సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేసే గడువును ముందు ప్రకటించిన జులై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ నిర్ణయం లాభదాయకంగా మారనున్నందుకు పన్ను చెల్లింపుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిర్ణయానికి ముఖ్యమైన కారణం ఐటీఆర్ ఫారాల నోటిఫికేషన్‌లో ఆలస్యం జరగడమే. ఐటీఆర్ ఫారాల్లో ఇటీవల చేపట్టిన కొన్ని మార్పుల కారణంగా, ఆయా మార్పులను ఎలక్ట్రానిక్ ఫైలింగ్ సిస్టమ్‌లో అనుసంధానం చేయడానికి ఇంకా కొంత సమయం అవసరమని పన్ను శాఖ స్పష్టం చేసింది. ఫారాల సరైన అమలుతో పాటు పన్నుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫైలింగ్ ప్రక్రియ సాగేందుకు ఇది అవసరమని తెలిపింది.
ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ తన అధికారిక ఎక్స్ (మునుపటి ట్విట్టర్) ఖాతాలో ప్రకటన విడుదల చేసింది. “పన్ను చెల్లింపుదారుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి సెప్టెంబర్ 15 వరకు గడువును పొడిగిస్తున్నాం. ఐటీఆర్ ఫైలింగ్‌కు మరింత సమయం లభించడంతో అవసరమైన ఆధారాలను సమీకరించడానికి, సరైన లెక్కలతో రిటర్ను సమర్పించేందుకు అవకాశముంటుంది” అని పేర్కొంది.