ఉస్మానియా యూనివర్సిటి ఆర్ట్స్ కళాశాల వెనుక జరిగిన అనూష హత్య కేసులో నిందితుడు వెంకట్ తానే నేరం చేశానని అంగీకరించాడు. అనూష తనను దూరం పెట్టడంతో దాన్ని తట్టుకోలేకే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. సికింద్రాబాద్ పార్శీగుట్టకు చెందిన ఆరేపల్లి వెంకట్ నారాయణగూడలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. అంబర్ నగర్ కు చెందిన అనూష హిమాయత్ నగర్ లోని నారాయణ కళాశాలలో చదివేది. వీరిద్దరికి ట్యూషన్ లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది.
అనూష, వెంకట్
వెంకట్ వేరే అమ్మాయిలనను ప్రేమిస్తున్నాడనే అనుమానం అనూషకు కలిగింది. దీంతో అనూష నకిలీ ప్రొఫైల్ తో అతనిని టెస్టు చేయగా వెంకట్ చాట్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో వెంకట్ మంచివాడు కాదని అనూష అతనిని దూరం పెట్టింది. అతని ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేసింది. అనూష అతనితో మాట్లాడకుండా దూరంగా ఉంది. దీంతో కక్ష పెంచుకున్న వెంకట్ అనూషను స్నేహితురాలు శ్రావ్య సహాయంతో ఆర్ట్స్ కళాశాల వెనుక ఉన్న పాడుబడ్డ క్వార్టర్స్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ జరిగిన గొడవతో వెంకట్ ముందుగా తాను తెచ్చుకున్న బ్లేడ్ తో అనూష గొంతు కోసి హత్య చేశాడు. అనూష అరుపులకు స్థానికులు వచ్చి వెంకట్ ను కొట్టి పట్టుకున్నారు. అనూషను చంపి తాను కూడా చనిపోదామని అనుకున్నానని ఈ లోపు అక్కడున్న వారు వచ్చి పట్టుకున్నారని వెంకట్ విచారణలో ఒప్పుకున్నాడు. వెంకట్ కు త్వరగా శిక్షపడేలా చేస్తామని కాచిగూడ ఏసిపి నర్సయ్య తెలిపారు.