Revanth Reddy – Chiranjeevi: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినీ పరిశ్రమ మధ్య గతంలో నెలకొన్న దూరాన్ని తగ్గించేందుకు నిర్మాత దిల్ రాజు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం రేవంత్ స్వయంగా మెగాస్టార్ చిరంజీవిని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రితో కలిసి చిరంజీవి కూడా కార్యక్రమానికి హాజరుకావడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఎకో ఫ్రెండ్లీ ఎక్సీపీరియం పార్క్‌ను ప్రొద్దుటూరులో ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సుమారు 150 కోట్ల రూపాయల ఖర్చుతో 150 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ఈ పార్క్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిరంజీవి కలిసి మంగళవారం మధ్యాహ్నం పాల్గొన్నారు. ఈ పార్క్ నగరానికి మాత్రమే కాకుండా హైదరాబాద్ శివార్లకు గర్వకారణంగా నిలుస్తుందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
పార్క్‌లో పర్యావరణ హితమైన అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో భాగంగా 25,000 రకాల మొక్కలను నాటారు. ఇవి ఇప్పటికే ఆకర్షణీయంగా పెరిగి ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నాయి. అంతేకాకుండా, పార్క్‌లో ఏర్పాటు చేసిన యాంపీ థియేటర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతిరోజూ సాయంత్రం ఇక్కడ సినిమాలు ప్రదర్శించి సందర్శకులను అలరించేలా చర్యలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనడం తెలుగు సినీ పరిశ్రమతో సంబంధాలను మెరుగుపరిచే దిశగా తీసుకున్న అడుగుగా చెప్పవచ్చు. పర్యావరణ హితమైన ఈ ప్రాంగణం భవిష్యత్తులో ఆహ్లాదకరమైన ప్రదేశంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చిరంజీవి కూడా ఈ ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మరింత ఎక్కువగా జరగాలని ఆకాంక్షించారు.