తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్‌కు త్వరలోనే రాజ్యసభ సభ్యత్వం దక్కనుందని సమాచారం. అధికార డీఎంకే పార్టీ ఆయనను తమ కోటాలో రాజ్యసభకు పంపేందుకు సిద్ధంగా ఉందని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కమల్ హాసన్ నివాసానికి తమిళనాడు మంత్రి పీ.కే. శేఖర్ బాబు నేడు వెళ్లడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కమల్ హాసన్ నేతృత్వంలోని ఎంఎన్ఎం, స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. అప్పటికే కమల్ హాసన్‌కు డీఎంకే తన కోటాలో రాజ్యసభ సీటు కేటాయిస్తుందని అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుతం డీఎంకే నుంచి జులైలో ఖాళీ కాబోయే స్థానాల్లో ఒకటి కమల్ హాసన్‌కు ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల కమల్ హాసన్ డీఎంకే నాయకత్వంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి స్టాలిన్ తో కమల్ హాసన్‌కి మంచి అనుబంధం ఉండటంతో ఈ అవకాశం ఖాయమని అంటున్నారు. తమిళనాడు రాజకీయాల్లో కమల్ హాసన్‌కి ఇది కీలక మలుపుగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.