దిల్ రాజు వార్నింగ్.! ఈ అత్యుత్సాహం దేనికి రాజా.?

ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అందరూ చూస్తుండగానే రెండు మీడియా సంస్థలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అవి రెండూ ప్రముఖ వెబ్ సైట్లను నడుపుతున్న మీడియా సంస్థలు. పేర్లు చెప్పలేదుగానీ, ఆ రెండు వెబ్ సైట్లు.. అంటూ దిల్ రాజు వార్నింగ్ ఇచ్చేశారు.. అది కూడా, ‘తాట తీస్తాను..’ అని హెచ్చరిస్తూ.!

సంక్రాంతి సినిమాలనగానే దిల్ రాజు మీద విమర్శలు ఇటీవలి కాలంలో మామూలే అయిపోయాయ్. గత ఏడాది, తమిళ సినిమాని తీసుకొచ్చి, తెలుగు సంక్రాంతి మీద బలవంతంగా మోపేశారు దిల్ రాజు.

థియేటర్ల విషయమై మన సినిమాలు, అందునా పెద్ద హీరోల సినిమాలు.. అది కూడా చిరంజీవి, బాలకృష్ణ ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ ఏడాది కూడా ఓ డబ్బింగ్ సినిమాని దిల్ రాజు తీసుకొస్తున్నారన్న ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో ఆ సినిమాని వెనక్కి నెట్టారనుకోండి.. అది వేరే సంగతి.

కాగా, హనుమాన్ సినిమాకి థియేటర్లు దక్కకపోవడం ఓ యెత్తు, ‘చిన్న సినిమా.. పెద్ద సినిమా.. ఈ రెండిటికీ అర్థం చెప్పి’ దిల్ రాజు అందరికీ టార్గెట్ అయిపోయారు. ‘ఈగిల్’ సినిమా వెనక్కి వెళ్ళడానికీ దిల్ రాజే కారణమన్న ప్రచారం జరిగింది.

ఇంత గందరగోళానికి దిల్ రాజే ఎందుకు సెంటరాఫ్ ఎట్రాక్షన్ అవుతున్నట్లు.? ఎందుకంటే ఆయన కేవలం నిర్మాత మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూటర్ కూడా. తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లు ఆయన గుప్పిట్లో వున్నాయ్. ఇదీ అసలు సమస్య.

సరే, మీడియాలో ఏవో వార్తలొచ్చాయ్.. వాటిని గాలి వార్తలే అనుకుందాం. ఖండించి ఊరుకుంటే సరిపోయేది. వేదిక మీద వార్నింగ్ ఇవ్వడం ఓ యెత్తు, సదరు మీడియా సంస్థ ప్రతినిథి కన్పించగానే, కోపంతో అతని మీదకు దూసుకెళ్ళి గొడవ చేయడం ఇంకో యెత్తు.

సభ్యత, సంస్కారం పూర్తిగా మర్చిపోయారు దిల్ రాజు. ఈ వ్యవహారం ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకింతలా దిల్ రాజు సంయమనం కోల్పోతున్నట్టు.? ఈ అతి ఎందుకు.?