దీపావళి ఉత్సవాల ఆరంభాన్ని సూచించే ధన త్రయోదశి ఈ ఏడాది అక్టోబర్ 18న వస్తోంది. సంప్రదాయపరంగా ఈ రోజున ధనాన్ని, ఆయురారోగ్యాన్ని, సౌభాగ్యం కోసం పూజిస్తారు. అంతేకాదు ఈ రోజు యమదీపం వెలిగిస్తారు. కానీ దీని వెనుక ఒక పురాణ గాధ దాగి ఉందని చాలా మందికి తెలియదు. యముడే రక్షణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన ఆ కథే.. యమదీపం పుట్టుకకు కారణమైంది.
పురాణాల ప్రకారం హిమ అనే రాజుకు ఓ కుమారుడు పుట్టాడు. అతని జాతకాన్ని చూసిన పండితులు అతని వివాహం జరిగితే నాలుగో రోజుకే మృత్యువు సంభవిస్తుందని హెచ్చరించారు. ఆ భయంతో రాజు కొడుకుకు పెళ్లి జరపకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ విధి అనేది తప్పించలేనిది. కాలక్రమంలో యువరాజుపై ఒక రాకుమారికి ప్రేమ పుట్టింది. వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. హెచ్చరికలు తెలిసినా.. ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తన భర్తను తానే కాపాడుకుంటాను అనే నమ్మకంతో పెళ్లికి సిద్ధమైంది. చివరికి రాజు కూడా విధి ముందు తలవంచి వివాహానికి అంగీకరించాడు.
వివాహం జరిగి నాలుగో రోజు.. ఆశ్వయుజ బహుళ త్రయోదశి వచ్చింది. అదే రోజు రాకుమారుడి ప్రాణాలు హరించడానికి యముడు పాము రూపంలో రాజప్రాసాదానికి చేరుకున్నాడు. కానీ రాజమహల్ లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. యువరాణి సర్వసంపదలతో ప్రాసాదాన్ని అలంకరించి… బంగారు ఆభరణాలను రాశులుగా పోసి.. దీపాల వెలుగులతో రాజమహల్‌ను ప్రకాశవంతం చేసింది. సంపద దేవత లక్ష్మీదేవిని స్తుతిస్తూ మధురమైన గీతాలను ఆలపిస్తోంది. ఆ వెలుగులు, బంగారు మెరుపులు, గానాల సౌందర్యం యముడినే కట్టిపడేశాయి. సమయం గడిచిపోయింది. మృత్యు ఘడియ దాటిపోయింది. యముడు ఖాళీచేతులతో తిరిగి వెళ్లిపోయాడు.
అప్పటి నుంచే ధన త్రయోదశి రోజు బంగారం, వెండి కొనుగోలు చేయడం, దీపాలు వెలిగించడం, లక్ష్మీదేవిని పూజించడం శుభప్రదంగా భావిస్తున్నారు. ఈ రోజున ఇంటి బయట వెలిగించే దీపాన్ని యమదీపం అంటారు. దీన్ని వెలిగిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, ఆయురారోగ్యం కలుగుతుందని నమ్మకం ఉంది.
ధన త్రయోదశి మరొక ప్రత్యేకత ధన్వంతరి జయంతి. పురాణాల ప్రకారం ధన్వంతరి క్షీరసాగర మథనంలో అమృత కలశంతో అవతరించి ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందించాడు. ఆయనే వైద్యశాస్త్ర పితామహుడు. సూర్యుని వద్ద ఆయుర్వేద విద్య నేర్చుకున్న ఆయనను వైద్యో నారాయణ హరి అని స్తుతిస్తారు. ఈశాన్య దిశలో ధన్వంతరి విగ్రహాన్ని ఉంచి ప్రార్థిస్తే దీర్ఘాయుష్షు లభిస్తుందని విశ్వసిస్తారు.
ఈ రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం కేవలం ఆచారం మాత్రమే కాదు… సంపద, ఆరోగ్యం, ఆయురారోగ్యానికి సంకేతం. గుజరాత్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ధన్వంతరి ఆలయాలు ఉండగా, ప్రతి ఏటా ఈ రోజు ఆయన్ను స్మరించి ప్రత్యేక పూజలు జరుగుతాయి. దీపావళి పండుగకు ఆరంభం కావడమే కాకుండా ధన త్రయోదశి రోజు వెలిగించే యమదీపం.. జీవితాన్ని దీర్ఘాయుష్షుతో, సౌభాగ్యంతో నింపుతుందనే విశ్వాసం నేటికీ కొనసాగుతోంది.
