Meerpet Murder Case: హైదరాబాద్ మీర్ పేటలో జరిగిన హత్య కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియాతో మాట్లాడారు. తన భార్య వెంకట మాధవిని (35) అత్యంత క్రూరంగా హత్య చేసిన గురుమూర్తి పశ్చాత్తాపం కూడా లేకుండా ఉన్నాడని సీపీ పేర్కొన్నారు. ఆర్మీ ఉద్యోగం నుండి రిటైర్ అయిన అతడిపై దర్యాప్తు చేసినప్పుడు అతడి చర్యల తీవ్రత అమానుషత్వం తాము ఊహించలేకపోయామని చెప్పారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా గురుమూర్తి తన భార్య, పిల్లలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత పిల్లలను అక్కడే ఉంచి భార్యతో ఇంటికి తిరిగొచ్చాడు. గొడవ సమయంలో మొదట భార్య తల గోడకు బలంగా కొట్టాడు. తలకు దెబ్బ తగలడంతో ఆమె కిందపడింది. తర్వాత ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత, అత్యంత క్రూరంగా ఆమె శరీర భాగాలను కత్తితో కట్ చేసి, నీళ్లలో ఉడికించి, స్టవ్ పై కాల్చాడు. ఎముకల్ని పొడి చేసి వాటిని చెరువులో వేసినట్లు సీపీ తెలిపారు.
హత్య అనంతరం ఇంట్లో శుభ్రం చేయడానికి ప్రయత్నించిన అతడు, పిల్లలతో కూడా అమాయకంగా ప్రవర్తించాడు. పిల్లలు తల్లిని అడగకుండా బంధువుల ఇంటి నుంచి తీసుకువచ్చి, ఆమెను బయటకు వెళ్లిందని చెప్పాడు. అయితే వెంకట మాధవి తల్లిదండ్రులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగు చూసింది. కేసు దర్యాప్తులో తీవ్రంగా శ్రమించిన పోలీసులు, గురుమూర్తి చేసిన పొరపాట్లను ఆధారంగా తీసుకొని అతడిని అరెస్ట్ చేశారు. ఇలాంటి అమానుష హత్య చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. దొరికిన ఆధారాల ఆధారంగా కేసు పరిష్కరించాం అని సీపీ సుధీర్ బాబు వివరించారు. ఈ ఘటన ప్రజలలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.