తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, మాజీ అధికార పార్టీ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ పని అయిపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు.
మీడియాతో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు తీవ్రమయ్యాయని ఆరోపించారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే మాజీ మంత్రి హరీశ్ రావు ఊరుకోరని, ఆయన స్వతంత్ర పార్టీ పెట్టే అవకాశం ఉందని వదంతులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవల కొందరు నేతలు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసినప్పుడు, కవిత అంశంపై తర్వాత ఆలోచిద్దామని కేసీఆర్ చెప్పి పంపినట్లు తమకు తెలిసిందని కోమటిరెడ్డి తెలిపారు.
అయితే, కేసీఆర్ కుటుంబ కలహాల్లో తాము తలదూర్చమని స్పష్టం చేశారు. అదే సమయంలో, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే మాత్రం ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతిపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో స్పష్టంగా తేలిందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఈ అవినీతిపై విచారణ జరిపించాల్సిందిగా సీబీఐకి అప్పగించామని, సీబీఐ విచారణలో ఎవరు అవినీతికి పాల్పడ్డారో బయటపడుతుందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారని, మరో 15 సంవత్సరాలు కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతుందని మంత్రి కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.


