తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చిరంజీవి ‘రాజకీయాలు’ చర్చించారా.?

కాంగ్రెస్ నేత, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో, మాజీ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఎంపీ (రాజ్యసభ) సినీ నటుడు ‘మెగాస్టార్’ చిరంజీవి భేటీ అవడం సినిమాల పరంగానే కాదు, రాజకీయ కోణంలోనూ చర్చనీయాంశమయ్యింది.

‘చిరంజీవి కాంగ్రెస్ నాయకుడే’ అని పదే పదే కాంగ్రెస్ నేతలు చెబుతుంటారు. వాస్తవానికి, రాజ్యసభ సభ్యత్వాన్ని రెన్యువల్ చేస్తామని కాంగ్రెస్ అధినాయకత్వం చెప్పినా, చిరంజీవి అప్పట్లో అందుకు ససేమిరా అన్నారు. ఆ తర్వాత ఏనాడూ తాను కాంగ్రెస్ నాయకుడినని చిరంజీవి చెప్పుకోలేదు.

సొంత రాజకీయ కుంపటి ప్రజారాజ్యం పార్టీ నుంచి తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే పదవి వదిలేసుకుని, రాజ్యసభకు ఎంపికై, ఆ తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు చిరంజీవి. పదవీ కాలం ముగిశాక, రాజ్యసభకు ఇంకోసారి ఆయన ప్రయత్నించలేదు.

అన్ని రాజకీయ పార్టీలతోనూ చిరంజీవి దాదాపుగా సత్సంబంధాలే కొనసాగిస్తున్నారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ దరిదాపుల్లోకి కూడా వెళ్ళకుండా జాగ్రత్త పడ్డారు చిరంజీవి. అయితే, తన ఆశీస్సులు తన తమ్ముడికి ఎప్పుడూ వుంటాయని చిరంజీవి చెబుతుంటారు.

ఈ పరిస్థితుల్లో చిరంజీవి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో రాజకీయాలు చర్చించి వుండొచ్చన్న వాదన తెరపైకి రావడంలో వింతేమీ లేదు. కాకపోతే, ఇది మర్యాద పూర్వక భేటీ మాత్రమేనని, పరిశ్రమలో ఒకడిగా సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపైనే సీఎం రేవంత్ రెడ్డితో చిరంజీవి చర్చించారనీ అంటున్నారు.

పనిలో పనిగా రాజకీయాలు ప్రస్తావనకు రాకుండా వుంటాయా.? రేవంత్ రెడ్డికి చంద్రబాబు గురువు లాంటివారన్నది బహిరంగ రహస్యం. ఆ రేవంత్ రెడ్డికి టీడీపీ పూర్తి మద్దతిచ్చింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో. అదే టీడీపీతో ఇప్పుడు పొత్తులో వున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ స్వయానా చిరంజీవి తమ్ముడు.!

సో.. విషయం క్లియర్‌గానే వుందన్నమాట.!