Nara Lokesh: ‘బ్లూ బ్యాచ్’ సమాజానికి అత్యంత ప్రమాదకరం: నకిలీ ప్రచారాలపై మంత్రి లోకేశ్

సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా ‘బ్లూ బ్యాచ్’ (Blue Batch) అంటూ ఒక వర్గాన్ని ఉద్దేశిస్తూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. తప్పుడు ప్రచారం ఆధారంగా రాజకీయ లబ్ధి పొందాలనుకునే ఈ శక్తులు సమాజానికి అత్యంత ప్రమాదకరంగా మారాయని ఆయన హెచ్చరించారు.

పొరుగు రాష్ట్రంలోని ఒక గురుకుల పాఠశాలలో 2023లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను తీసుకుని, దాన్ని తాజాగా అరకులో జరిగినట్లు చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి లోకేశ్ ఆరోపించారు. ఈ ఫేక్ ప్రచారాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అనుబంధ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

“ఇదే వార్తపై, ఇదే వీడియోపై రాష్ట్ర ప్రభుత్వం తరపున ‘ఫ్యాక్ట్ చెక్’లో సంపూర్ణ వివరాలతో సమాచారం అందించినా కూడా కొద్ది రోజులు ఊరుకుని మళ్లీ అదే వీడియోతో తాజాగా తప్పుడు ప్రచారం ప్రారంభించారు” అని మంత్రి లోకేశ్ తెలిపారు.

ఇలా తరచూ నేరాలకు పాల్పడేవారిని ‘హ్యాబిచ్యువల్ అఫెండర్స్’ (నేరాలు చేయడానికి అలవాటు పడ్డవారు) అంటారని, అందుకే అది ఒక రాజకీయ పార్టీనా, లేక హ్యాబిచ్యువల్ అఫెండర్స్ ముఠానా అనే అనుమానం వస్తున్నదని లోకేశ్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఈ ఫేక్ ప్రచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేవారిపై చర్యలు తీసుకోవలసిందిగా పోలీసులను కోరుతున్నానని మంత్రి నారా లోకేశ్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.

Akhanda 2 Thaandavam | Balakrishna Gives A Strong Warning | Telugu Rajyam