ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖకు కన్నా లక్ష్మీనారాయణను తప్పించి సోము వీర్రాజును అధ్యక్షుడిగా నియమించినపుడు పార్టీ శ్రేణుల్లో ఎనలేని ఉత్సాహం పొంగింది. కానీ ఆ ఉత్సాహం అంతా మూడు నెలల్లోనే చప్పబడినట్లు కనిపిస్తున్నది. పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ, తెలుగుదేశం కోవర్టులుగా వ్యవహరిస్తున్న కొందరు ముసుగువీరులను వీర్రాజు నిర్మొగమాటంగా సస్పెండ్ చెయ్యడం పార్టీలో ఒకరకమైన క్రమశిక్షణను ప్రోదిచేసింది అనడంలో సందేహం లేదు. కానీ, అదే ఊపు కొనసాగుతున్నట్లు కనిపించడం లేదు. కారణం ఏమంటే పొరుగున ఉన్న తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్, అరవింద్ లాంటి యువనాయకులకు ఢిల్లీలో లభిస్తున్న ఆదరణ ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులకు దక్కడం లేదనేది నిస్సందేహం.
మొదట్లో ఒకటి రెండు నెలల పాటు దూకుడుగా వ్యవహరించనప్పటికీ, వీర్రాజు దక్షతకు పరీక్ష అనదగ్గ సంఘటనలు ఇంతవరకు ఎదురు కాలేదు. తెలంగాణాలో బీజేపీ సారధ్యం తీకున్న కొద్ది నెలల్లోనే దుబ్బాక ఉపఎన్నిక రూపంలో సంజయ్ కు అదృష్టం తలుపు తట్టింది. టీఆరెస్ సిట్టింగ్ స్థానమైన దుబ్బాకను బీజేపీ స్వాధీనం చేసుకోవడంతో బండి సంజయ్ నాయకత్వ పరీక్షను విజయవంతంగా నెగ్గినట్లయింది. ఆ తరువాత పదిరోజులలోపే వచ్చిన గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా నాలుగునుంచి నలభై ఎనిమిది స్థానాలకు ఎగబాకడం బండి సంజయ్ నాయకత్వ పటిమకు తిరుగులేని నిదర్శనంగా నిలిచింది. రేపు రాబోతున్న నాగార్జునసాగర్ ఉపఎన్నికకోసం బీజేపీ శ్రేణులు సమరోత్సాహంతో ఎదురు చూస్తున్నాయంటే అది రాష్ట్ర నాయకత్వ ప్రతిభే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
మరి అలాంటి అవకాశం సోము వీర్రాజుకు ఇప్పటివరకు రాకపోయినప్పటికీ, దాదాపు అలాంటి సంఘటనలే ఆంధ్రప్రదేశ్ లో కూడా చోటుచేసుకోబోతున్నాయి. తిరుపతి లోక్ సభకు ఉపఎన్నిక రాబోతున్నది. దీన్నైతే వాయిదా వెయ్యడం ఎవ్వరికీ సాధ్యం కాదు. తిరుపతిలో గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి నోటా కన్నా తక్కువ సంఖ్యలో ఓట్లు పోలయ్యాయి. ఆ సంఖ్యని వేలరెట్లు అధికం చేసి పార్టీని విజయతీరాలకు చేర్చడం వీర్రాజుకు అగ్నిపరీక్ష అనడంలో సందేహం లేదు. ఆ స్థానం తమకు ఇమ్మని జనసేన కూడా కోరుతున్నది. జనసేనకు ఇచ్చినప్పటికీ పొత్తు ధర్మం ప్రకారం గెలిపించాల్సిన బాధ్యత బీజేపీకి కూడా ఉంటుంది. ఇప్పటికే తెలుగుదేశం నుంచి పనబాక లక్ష్మి రంగంలోకి దూకారు. వైసిపి నుంచి డాక్టర్ గురుమూర్తి దిగుతున్నారు. గురుమూర్తిని గెలిపించుకోవడం ముమ్మాటికీ జగన్మోహన్ రెడ్డి వంతే అవుతుంది. ఎందుకంటే గురుమూర్తి పెద్దగా ప్రజాజీవితంలో ఉన్నవారు కారు. అయినప్పటికీ ఆయన వెనుక జగన్ ఉన్నారు కాబట్టి ఆయన ధీమాగా ఉంటారు. దానికితోడు చిత్తూర్ జిల్లాలో చంద్రబాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ వైసిపి వారే. వారిలో రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి ఉద్దండులు ఉన్నారు. వీరంతా గురుమూర్తి గెలుపుకోసం సకలశక్తులు ఒడ్డుతారు. మరి వీరందరినీ దాటుకుని సోము వీర్రాజు తన సత్తా చాటుతారా?
ఇక వీర్రాజు అధ్యక్షుడైన తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాజీ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి చిరంజీవిని కలిశారు. వారిని ఎందుకు కలిశారో, ఏమి ప్రయోజనాలు ఆశించి కలిసారో ఆ పరమాత్ముడికి తెలియాలి. మొన్న మళ్ళీ సినిమా నటి హేమను వెంటబెట్టుకుని తెలుగుదేశం వీరాభిమాని, చంద్రబాబును అందగాడిగా అభివర్ణిస్తూ వేదికమీదనే ముద్దులాడిన రాజేంద్రప్రసాద్ ను కలిశారు. బీజేపీ పట్ల అభిమానం చూపించే తటస్తులను, మేధావులను కలవకుండా..చిల్లిగవ్వకు కొరగాని ఇలాంటి సినిమావారిని కలిస్తే వచ్చే ప్రయోజనం ఏమిటో వీర్రాజుకే తెలియాలి మరి. ఒక వంక తెలంగాణాలో బండి సంజయ్ పవన్ కళ్యాణ్ ను నిర్మొగమాటంగా ఎన్నికల ప్రచారానికి దూరంగా పెట్టడమే కాక అసలు అతనితో మాకు పొత్తే లేదని, ఆయనే మా వెంట పడ్డాడని ప్రకటించి తన ప్రతిభను వెలికి తెచ్చుకోగా, వీర్రాజు మాత్రం పైసాకు కొరగాని వెకిలి నటులను కలవడం, అదేదో గొప్ప అని భ్రమించడం చూసి బీజేపీ నాయకులు నవ్వుకుంటున్నారు.
రాబోయే తిరుపతి ఉప ఎన్నిక, పంచాయితీ ఎన్నికల్లో బీజేపీకి చెప్పుకోదగిన విజయాలను సాధించిపెట్టలేకపోతే వీర్రాజు సామర్ధ్యం మీద అనుమానాలు రేగడం ఖాయం.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు