తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ.. పలు అంశాలపై కీలక చర్చలు..!

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీలో ఒకే వేదికపై కలుసుకున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి గడిచిన కొంతకాలంగా కొనసాగుతున్న జల సమస్యలను పరిష్కరించేందుకు ఈ భేటీ ఏర్పాటు చేశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమన్వయంతో శ్రమశక్తి భవన్‌లో ఈ సమావేశం ప్రారంభమైంది.

సమావేశంలో ప్రధానంగా ఏపీ ప్రతిపాదించిన పోలవరం.. బనకచర్ల లింక్ ప్రాజెక్టు, అలాగే తెలంగాణ ప్రతిపాదించిన పది ప్రధాన అంశాలపై సీఎంలు మధ్య చర్చలు జరుగనున్నట్లు సమాచారం. జలవనరుల పంచాయితీకి తుది పరిష్కారం చూపించేందుకు ఈ చర్చలు కీలకం కానున్నాయని అధికారులు అంటున్నారు.
ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్‌లు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు కూడా హాజరయ్యారు. ముఖ్య మంత్రుల ముందు ఈ ప్రతిపాదనలపై అధికారులు పూర్తి వివరాలు సమర్పించనున్నారు.

ముఖ్యంగా భేటీకి ముందు హైదరాబాద్, అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయాల్లో అధికారులతో సమీక్షలు జరిపారు. కేంద్రానికి ఎలాంటి అంశాలు వివరించాలి, ఎలాంటి సమస్యలను ఉంచాలి అనే దానిపై చంద్రబాబు, రేవంత్‌లు గంటన్నర పాటు సమీక్షలు నిర్వహించినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాలకు ఉపయోగపడేలా, నీటిని సమర్థంగా వినియోగించే దిశగా ఈ చర్చలు సాగుతాయని, దీని ద్వారా ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న వివాదాలకు కొంత మేర పరిష్కారం దొరకవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.