Womens World Cup: సచిన్‌తో నారా లోకేష్ కుటుంబం… ప్రపంచకప్‌ ఫైనల్‌కు ప్రత్యేక కళ!

భారత్, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య నవీ ముంబై వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా హాజరై సందడి చేశారు. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ టైటిల్ పోరును ఆయన తన సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌లతో కలిసి వీక్షించారు. భారత జట్టుకు మద్దతు తెలుపుతూ ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చుని ఉత్సాహంగా కనిపించారు.

ఈ సందర్భంగా నారా లోకేష్ కుటుంబానికి ఓ మధురానుభూతి ఎదురైంది. క్రికెట్ దేవుడిగా అభిమానులు కొలిచే దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌ను లోకేష్ తన కుటుంబంతో సహా కలిశారు. సచిన్‌తో కలిసి వారు ఫోటోలు దిగారు.

ఈ భేటీపై లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఇది తనకు ఒక ‘ఫ్యాన్ బాయ్ మూమెంట్’ అని అభివర్ణించారు. సచిన్ వినయం, ఆప్యాయత గురించి విన్నవన్నీ నిజమేనని, వాటిని స్వయంగా అనుభవించడం తన అదృష్టమని లోకేష్ పేర్కొన్నారు. తరతరాలకు స్ఫూర్తినిచ్చిన గొప్ప క్రీడాకారుడే కాకుండా, అంతకంటే గొప్ప మానవతావాది సచిన్ అని లోకేష్ ప్రశంసించారు.

సచిన్ టెండూల్కర్‌ను కలవడమే కాక, ఐసీసీ ఛైర్మన్ జైషాను కూడా నారా లోకేష్ ఈ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కలిశారు.

మహిళల ప్రపంచకప్ ఫైనల్‌కు హాజరు కావడంపై లోకేష్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. “చరిత్రను ప్రత్యక్షంగా చూసేందుకు బ్రాహ్మణి, దేవాన్ష్‌తో కలిసి నవీ ముంబైలో ఉన్నాను. భారత జట్టుకు మద్దతు తెలపడం, మహిళల క్రికెట్ ఎదుగుదలను వేడుక చేసుకోవడం గర్వంగా ఉంది. స్టేడియంలో వాతావరణం అద్భుతంగా ఉంది. ఇలాంటి క్షణాలను కుటుంబంతో పంచుకోవడం, తర్వాతి తరానికి స్ఫూర్తినివ్వడం గొప్ప అనుభూతి” అని ఆయన పేర్కొన్నారు.

Prof Haragopal: End Of Naxalism? | Madvi Hidma | telugu Rajyam