New Ambulances: “190 కొత్త ‘108’ అంబులెన్స్‌లు సిద్ధం: ఏపీలో వైద్య సేవలకు వేగం, గోల్డెన్ అవర్‌పై దృష్టి!”

రోడ్డు ప్రమాదాలు, పాము కాట్లు వంటి అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ‘గోల్డెన్ అవర్’ (ప్రమాదం జరిగిన గంటలోపు) చాలా ముఖ్యం. ఈ గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రులకు తీసుకెళ్తే గాయాల తీవ్రత తగ్గి, బాధితులకు ప్రాణాపాయం తగ్గుతుంది. ఈ అత్యవసర సేవల్లో అంబులెన్స్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే రాష్ట్రంలో అంబులెన్స్‌ల కొరత, పాత వాహనాల సమస్యను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

త్వరలో 190 కొత్త ‘108’ వాహనాలను ప్రారంభించనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్ వెల్లడించారు. దీంతో రోగులకు, క్షతగాత్రులకు వేగవంతమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కొత్త అంబులెన్స్‌లు రోగులను మరింత వేగంగా ఆస్పత్రులకు తరలించేందుకు వీలవుతుందని మంత్రి తెలిపారు.

పాత వాహనాల తొలగింపు

గత ప్రభుత్వంలో నిర్వహణ సరిగా లేక తరచూ రిపేర్ అవుతున్న, కాలం చెల్లిన అంబులెన్స్‌లను తొలగిస్తామని మంత్రి చెప్పారు. వాటి స్థానంలో కొత్త అంబులెన్స్‌లు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఫలితంగా క్షతగాత్రులు ‘గోల్డెన్‌ అవర్‌’లోనే వైద్యం సహాయం పొందుతారన్నారు.

త్వరలో ప్రారంభించనున్న 190 కొత్త 108 వాహనాల్లో 56 అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్ట్‌ (ALS) అంబులెన్సులు, 136 బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌ (BLS) అంబులెన్సులు ఉన్నాయి.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 650 అంబులెన్స్‌లు నడుస్తున్నాయి. పాతవాటిని తొలగించి, కొత్త వాటిని కలిపితే మొత్తం వాహనాల సంఖ్య 731కు చేరుకుంటుందని మంత్రి వివరించారు.

కొత్త రంగుల్లో అంబులెన్స్‌లు

గత ప్రభుత్వంలో నీలం, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న అంబులెన్స్‌లు ఇకపై మారనున్నాయి. కొత్త అంబులెన్స్‌లు నేషనల్ అంబులెన్స్‌ కోడ్‌ (NAC) ప్రకారం తెలుగు, ఎరుపు రంగుల్లో ఉంటాయని సత్య కుమార్ తెలిపారు. గత నెలలోనే ప్రభుత్వం ఈ మేరకు పాత రంగులు మార్చుతున్నట్లు తెలిపింది.

ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి సత్యకుమార్ విమర్శలు గుప్పించారు. జగన్ సర్కార్ 108 అంబులెన్స్‌లను నిర్లక్ష్యం చేసిందని, నిర్వహణను పట్టించుకోలేదని ఆరోపించారు. కాలం చెల్లిన అంబులెన్స్‌లను ఉపయోగించడం వలన ప్రమాద బాధితులను ఆసుపత్రులకు తరలించడంలో జాప్యం జరిగిందని, 108 అంబులెన్స్‌ల ప్రతిస్పందన సమయం పెరిగిందని మంత్రి ఆరోపించారు.

Fake Votes Found In Jubilee Hills Bypoll.? | Telugu Rajtam