వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న తరుణంలో, ఈ అంశంపై చైతన్యాన్ని పెంచేందుకు బీజేపీ చెన్నై వేదికగా ఒక ప్రత్యేక సెమినార్ నిర్వహిస్తోంది. దీనికి ముఖ్య అతిథిగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానుండటం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఎన్డీఏ మిత్రపక్షంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు మద్దతు ప్రకటించిన పవన్… ఈ సెమినార్‌లో తన వాదనను బలంగా వినిపించనున్నారు.
రాష్ట్రాలుగా విడిపోయినా దేశంగా ఒకటే అన్న సిద్ధాంతంతో ఎన్నికలు కూడా ఒకేసారి జరగాలన్న ఉద్దేశంతో బీజేపీ ఈ ప్రయత్నం చేస్తోంది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లోని కొన్ని పార్టీలు, ముఖ్యంగా తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. కేంద్రం తీసుకొస్తున్న ప్రతీ నిర్ణయానికి నిరసనగా డీఎంకే గళమెత్తుతుంటే… ఇప్పుడు అదే గడ్డపై పవన్ వేదికపై నిలబడి వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు మద్దతు పలికే అవకాశం ఉంది.
చెన్నైకు చేరిన పవన్ కల్యాణ్‌కు బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేందిరన్, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆధ్వర్యంలో పవన్‌కు సంప్రదాయ రీతిలో స్వాగతం తెలిపినట్టు సమాచారం. ఆదివారం రాత్రి చెన్నైలో బస చేసిన పవన్, సోమవారం ఉదయం సెమినార్‌లో పాల్గొంటారు. తన ప్రసంగంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ప్రజలకు, ప్రభుత్వాలకు కలిగే లాభాలను వివరించే అవకాశముందని భావిస్తున్నారు.
ఈ సెమినార్ ద్వారా పవన్ చేసిన వ్యాఖ్యలు డీఎంకే పార్టీకి ఎదురుదెబ్బగా మారే అవకాశముంది. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బీజేపీకి మద్దతు ఇవ్వగలిగే నేతగా పవన్ తన వైఖరిని వినిపిస్తే, దక్షిణ రాష్ట్రాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ చర్చ మరింత ఉద్ధృతం కావడం ఖాయం. పవన్ వాయిస్ వల్ల వాదనకి బలం చేకూరుతుందని బీజేపీ ఆశిస్తోంది.