నాగర్‌కర్నూల్ స్వాతి బెయిల్ పై కొత్త ట్విస్టు

సంచలన కేసులో అరెస్టయ్యి జైలు నుంచి విడుదలైన నాగర్ కర్నూల్ స్వాతి కథ మరో మలుపు తిరిగింది. ప్రియుడు రాజేష్ తో కలిసి భర్త సుధాకర్ రెడ్డిని హత్య చేసిన కేసులో అనేక మలుపుల తర్వాత స్వాతికి బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యి  ప్రస్తుతం మహిళ హోం లో ఉంటుంది. స్వాతిని తీసుకెళ్లడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో పోలీసులు స్వాతిని మహబూబ్ నగర్ మహిళా  హోంకు తరలించారు. అయితే స్వాతికి జామీను ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు తమ  జామీను ఉపసంహరించుకున్నారు. అసలేంటో ఆ  కథ మీరే చదవండి.

స్వాతి భర్త సుధాకర్ రెడ్డిని… ప్రియుడు రాజేష్ తో కలిసి అతి కిరాతకంగా చంపి డ్రామావేసి అడ్డంగా దొరికి పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టయ్యి 11 డిసెంబర్ 2017 నుంచి మహబూబ్ నగర్ జైల్లో శిక్ష అనుభవిస్తుంది. లీగల్ సెల్ అథారిటి ఆధ్వర్యంలో ఆమెకు బెయిల్ అప్లై చేయగా జూలై 16న ఆమెకు బెయిల్ లభించింది. అయితే స్వాతికి జామీన్ ఇచ్చి తీసుకెళ్లేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో బెయిల్ ఆలస్యమైంది. నాగర్ కర్నూల్ మున్సిపాలిటిలో పనిచేసే ఓ వ్యక్తితో పాటు మరొకరు ఆమెకు జామీను ఇవ్వగా గత నెల 27 న జైలు నుంచి విడుదలయ్యి ప్రస్తుతం మహిళ హోంలో ఉంది. శుక్రవారం స్వాతిని నాగర్ కర్నూల్ కోర్టులో హాజరు పరిచారు. అయితే జామీను ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు న్యాయస్థానం ముందు తమ పూచీకత్తును ఉపసంహరించుకుంటున్నామని విన్నవించుకున్నారు. ఈ అంశంపై కోర్టు ఆగష్టు 7వ తేది వరకు గడువు పెట్టింది. జామీను ఇచ్చిన వారిపై స్వాతి కుటుంబ సభ్యులు, అత్తగారింటి నుంచి ఒత్తిడి రావడంతోనే స్వాతి జామీనును వారు ఉపసంహరించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న స్వాతి నిరాశకు గురయ్యారట. కోర్టు ఆవరణలోనే కన్నీరు పెట్టుకోని విలపించిదని పలువురు చెబుతున్నారు. పిల్లలతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామనుకున్న స్వాతి ఆశలు అడియాశలు అయ్యేలా ఉన్నాయి. అనేక మలుపులు తిరుగుతూ సంచలనాలు సృష్టిస్తున్న స్వాతి కేసు ఆగష్టు 7 వ తేదిన ఏ మలుపు తిరగనుందో అని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.