US Military: అమెరికా సైన్యంలో అతి భయంకరమైన ఆయుధం

అగ్రరాజ్యం అమెరికా మరోసారి తన అణు శక్తిని ప్రపంచానికి చూపించింది. అత్యంత శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అయిన మినిట్‌మ్యాన్‌-3ను కాలిఫోర్నియాలోని వాండెన్‌బెర్గ్‌ స్పేస్‌ బేస్ నుంచి విజయవంతంగా పరీక్షించింది. గంటకు 15,000 మైళ్ల వేగంతో దూసుకెళ్లిన ఈ క్షిపణి, 4,200 కిలోమీటర్ల దూరంలోని మార్షల్ దీవుల్లో లక్ష్యాన్ని తాకినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ప్రయోగంపై అమెరికా గ్లోబల్ స్ట్రైక్ కమాండ్‌ జనరల్ థామస్ బుస్సెరీ స్పందించారు. “ఇది ఒక రూటీన్ టెస్ట్ మాత్రమే. ప్రపంచ పరిస్థితులతో దీని సంబంధం లేదు. అమెరికా అణు శక్తిని ఎలా సమర్థంగా నిర్వహిస్తోంది అనేది దీని ఉద్దేశ్యం” అని వివరించారు. దీని ద్వారా అమెరికా తన రక్షణ సామర్థ్యాన్ని నిరూపించుకోవడమే లక్ష్యంగా ఉందన్నారు.

మినిట్‌మ్యాన్‌-3లో అమర్చిన మార్క్-21 రీఎంట్రీ వెహికల్ అత్యంత శక్తివంతమైనది. ఇది అవసరమైతే అణు వార్‌హెడ్‌ను మోహరించగలదు. గతంలోనూ ఈ క్షిపణిని అమెరికా అనేకసార్లు పరీక్షించింది. దీని సరసన ఇప్పుడు సెంటెనిల్ సిస్టమ్ అనే కొత్త పథకం రూపొందించబడుతోంది. అయినా ఇప్పటికీ మినిట్‌మ్యాన్-3ని అమెరికా వాయుసేన ప్రధానంగా వినియోగిస్తోంది.

1970ల నుంచే అమెరికా సైన్యంలో ఈ క్షిపణి కొనసాగుతుండటం గమనార్హం. ఇది రక్షణ వ్యవస్థలో నమ్మకమైన భాగంగా ఉండటం వల్లే ఇప్పటికీ ప్రయోగాలు చేస్తూ శక్తిని నిలబెట్టుకుంటోంది. ఈ ప్రయోగం మరోసారి అమెరికా అణు శక్తిని గుర్తుచేసే ఘటనగా మారింది.