ప్రముఖ ఐరిష్ విమానయాన సంస్థ రయన్‌ఎయిర్ తన సిబ్బందికి షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇటీవల జీతాలు పెంచిన సంస్థ ఇప్పుడు అదే సొమ్మును తిరిగి చెల్లించాలని ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. ఒక్కో ఉద్యోగి సుమారు రూ.2.8 లక్షల వరకూ అదనంగా పొందగా, ఆ మొత్తాన్ని వెంటనే తిరిగి సంస్థ ఖాతాలో జమ చేయాలని సూచించింది. లేదంటే నెలవారీ జీతాల నుంచి కోతలు పెట్టేలా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.
రయన్‌ఎయిర్ సిబ్బందికి సంబంధించి ‘సీసీఓఓ’ అనే కార్మిక సంఘంతో జీతాల పెంపు ఒప్పందం కుదిరింది. అయితే అదే సమయంలో ప్రత్యర్థి కార్మిక సంఘం ‘యూఎస్ఓ’ కోర్టును ఆశ్రయించింది. సీసీఓఓకి తమ సభ్యుల తరఫున ఒప్పందం చేసుకునే హక్కు లేదని, అది చట్టబద్ధం కాదని కోర్టులో వాదించింది. విచారణ జరిపిన కోర్టు సీసీఓఓతో జరిగిన ఒప్పందాన్ని చెల్లదని తేల్చింది. దీంతో జీతం పెంపు ద్వారా సిబ్బంది పొందిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని సంస్థ అధికారికంగా నోటీసులు జారీ చేసింది.
ఈ పరిణామంపై యూఎస్ఓ ప్రతినిధి ఎస్టర్ పెయ్రో గాల్డ్రాన్ స్పందిస్తూ, సంస్థ తీసుకున్న చర్యలు న్యాయసమ్మతంగా లేవని విమర్శించారు. తమ సభ్యులను ఇతర యూనియన్‌లోకి బలవంతంగా చేర్చే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. వాస్తవానికి సంస్థపై న్యాయపోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఇది ఉద్యోగుల హక్కులను కాలరాసే చర్యగా అభివర్ణించారు.
అయితే రయన్‌ఎయిర్ ప్రతినిధులు మాత్రం తాము కోర్టు తీర్పును పాటిస్తున్నామని చెప్పారు. యూఎస్ఓ దాఖలు చేసిన కేసు ప్రస్తుతం అప్పీల్ దశలో ఉందని స్పష్టం చేశారు. అయితే పెంచిన జీతాన్ని తిరిగి ఇవ్వాలన్న సంస్థ నిర్ణయం ఉద్యోగుల మధ్య కలకలం రేపుతోంది. తుదంగా ఈ వివాదం ఎలా పరిష్కారం కాగలదో వేచి చూడాలి.