భారతీయ వ్యవసాయ రంగానికి నూతన దిశను చూపించిన పద్మశ్రీ డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ మరణం కలకలం రేపుతోంది. ఆక్వాకల్చర్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన ఆయన.. అనూహ్యంగా అదృశ్యమై, చివరకు శవమై కనిపించడం శోకాన్ని మిగిల్చింది. మైసూరులో నివసిస్తున్న అయ్యప్పన్ ఈ నెల 7వ తేదీ నుంచి కనిపించకుండా పోగా, శనివారం కావేరీ నదిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. సంఘటనా స్థలానికి సమీపంలో ఆయన స్కూటర్ లభించింది. పోలీసులు ప్రస్తుతం మరణ కారణాన్ని అన్వేషిస్తున్నారు.
చేపల ఉత్పత్తిలో నూతన పద్ధతులకు ప్రేరకుడిగా నిలిచిన డాక్టర్ అయ్యప్పన్, ‘నీలి విప్లవం’ రూపకర్తగా గుర్తింపు పొందారు. భారతదేశపు ఫిషరీస్ రంగానికి నూతన శకం తెచ్చిన ఆయన కృషి గ్రామీణ ఆదాయాన్ని పెంచడమే కాకుండా, దేశ ఆహార భద్రతలో భాగమైన చేపల ఉత్పత్తిని విస్తృతంగా విస్తరించింది. ఈ సేవలకు గుర్తింపుగా 2022లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీను ప్రదానం చేసింది.
పలు కీలక పదవులను అలంకరించిన అయ్యప్పన్, ముంబైలోని సీఐఎఫ్ఈ, భువనేశ్వర్‌లోని సీఐఎఫ్ఏలకు డైరెక్టర్‌గా, హైదరాబాదులో ఎన్‌ఎఫ్‌డీబీ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా, కేంద్ర వ్యవసాయ పరిశోధన శాఖ కార్యదర్శిగా సేవలందించారు. పదవీ విరమణ అనంతరం కూడా సీఏయూ వైస్ ఛాన్సలర్‌గా, నేబల్ చైర్మన్‌గా వ్యవహరించారు.
సుదీర్ఘంగా సేవలందించిన ఇటువంటి గొప్ప శాస్త్రవేత్త మృత్యువాత పడిన తీరు అనుమానాలకు తావిస్తోంది. ఒక మేధావి ఇలా మాయమై, నదిలో శవంగా తేలిపోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఆయన మరణం వెనుక ఏమైనా కుట్ర ఉందా? లేక ఇది ఆత్మహత్యా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.