ఆంధ్ర ప్రదేశ్ లో అంతా రాజ్యాంగబద్ధమే!

YS Jagan, Mimmagadda Ramesh and Chandra babu
ఆంధ్ర ప్రదేశ్ లో రెండు రాజ్యాంగ వ్యవస్థలు రాజకీయం నడుపుతున్నట్టు కనిపిస్తోంది. కోర్టులు ప్రభుత్వం ఏం చేయకూడదో నిరంతరం నిర్దేశిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉత్తరం రాసినా, ఒకవేళ ఉత్తరం రాసినట్టు కనిపించినా లేదా వినిపించినా ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు స్పందిస్తోంది. వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో సిద్దహస్తులైన వ్యక్తులు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉత్తరాలు సృష్టిస్తూనే ఉన్నారు. అవి కోర్టులో “అడ్మిట్” అవుతూనే ఉన్నాయి. కోర్టు తీర్పులు ప్రతిపక్షాలు లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్ధులు ఆశించిన తీర్పులు వస్తూనే ఉన్నాయి. 2019 ఎన్నికల ప్రజాతీర్పు అపహాస్యం అవుతూనే ఉంది. 
 
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అదృష్టవంతుడు. ఒక ఎమ్మెల్యేని కొనే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి డబ్బుమూటతో సహా దొరికిపోబట్టి సరిపోయింది కానీ లేకపోతే తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇలాంటి పరిస్థితే వచ్చి ఉండేది. కంప్యుటర్లో కీ బోర్డుపై ఏ అక్షరం నొక్కితే స్రీన్ పై అదే అక్షరం కనిపించినట్టు తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ నాయకుడు ఏది చెపితే వ్యవస్థలన్నీ అవే చేస్తుంటాయి అని అనేక సందర్భాల్లో ఋజువైంది. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతినిత్యం ఇది నిరూపించబడుతోంది. తెలంగాణ ప్రజలు, తెలంగాణ అధికార పార్టీ ఈ మేరకు నక్కను తొక్కినట్టే. రేవంత్ రెడ్డిని దొరకబుచ్చుకోకపోయి ఉంటే కెసిఆర్ ప్రభుత్వం 2014 నుండి కోర్టు నుండి వ్యతిరేక తీర్పులు వింటూ ఉండాల్సి వచ్చేది. 
 
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం పూర్తిగా రాజకీయంగానే నడుస్తోంది. ప్రతిపక్షాల నుండి లేఖలు ఆధారంగానే ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ తన నిర్ణయానికి ముందు కనీస సంప్రదాయం పాటించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం కాదు. ప్రతిపక్షాల ఫిర్యాదులపై స్పందించే ముందు పాలక పక్షాన్ని కూడా అడగాలని లేదా ప్రభుత్వంలోని కీలక అధికారులను అడగాలని ఎన్నికల కమిషనర్ భావించకపోవడం విధి నిర్వహణగానే చూడాలి తప్ప రాజకీయమ్ అనకూడదని ఆంధ్ర ప్రదేశ్ లో న్యాయస్థానం, మీడియా చెపుతున్నాయి. 
 
ఒక రాజ్యాంగ పదవిలో ఉండి, ఐఏఎస్ వంటి ఉన్నత శ్రేణి ఉద్యోగం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రిపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ లేఖలు రాయకూడదని స్పృహ లేకపోవడం కూడా రాజ్యాంగ బద్దమే అని ఇప్పుడు ప్రజలు అర్ధం చేసుకోవాలి. గత ప్రభుత్వం గడువు లోగా ఎన్నికలు నిర్వహించకుండా వాయిదా వేసినప్పుడు తనది స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న పదవి అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు గుర్తు రాకపోవడం, ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేయమనగానే “సరే” అని కూర్చోవడం రాజ్యాంగ బద్దమైన విధానమని రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఆలోచించాలి. 
 
చివరికి వివాదం కోర్టులో తేలి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ నే ఎన్నికల కమిషనర్ గా నియమించండి అని కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తే, ప్రభుత్వం నుండి నియామక ఉత్తర్వులు రాకుండానే, తీర్పు కాపీలు కూడా కోర్టులో సిద్ధం కాకముందే తనకు తానే ఉత్తర్వులు ఇచ్చుకోవడం, బాధ్యతలు చేపట్టడం రాజ్యాంగ బద్దం అనే అనుకోవాలి. ఈ చర్యలను సమర్ధించే వ్యవస్థలు, వ్యక్తులు రాజ్యాంగ బద్ధంగా ఉన్నారనే ప్రజలు భావించాలని కొత్త బాష్యం చెపుతోంది ఆంధ్ర ప్రదేశ్. 
 
ఇక నిమ్మగడ్డ వ్యవహారం కాసేపు పక్కన పెడితే, కోర్టు భవనంపై గాలిలో ఎగిరే ప్రతి కాగితాన్నీ సుమోటో గా స్వీకరిస్తున్న హై కోర్టు చంద్రబాబు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే స్పందించకపోవడం కూడా రాజ్యాంగ బద్ధమే అనుకోవాలి. లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ ఆంధ్ర ప్రదేశ్ వచ్చేందుకు, అందునా విశాఖపట్నం వచ్చేందుకు పోలీస్ అనుమతి తీసుకున్నారు. పోలీసులు కూడా లాక్ డౌన్ నిబంధనల మేరకు అనుమతి ఇస్తూ కేంద్రం ఆమోదించిన, అమలు చేస్తున్న నిబంధనలు చంద్రబాబుకు ఆయన తనయుడు లోకేష్ కు కూడా వర్తిస్తాయని పేర్కొన్నారు. 
 
ఈ నిబంధనల మేరకు చంద్రబాబు, లోకేష్ తమ వాహనాల్లో నేరుగా ఉండవల్లి లోని తమ అద్దె ఇంటికి చేరుకోవాలి. ఆ తర్వాత వారం రోజులు క్వారంటైన్ లో ఉండాలి. కానీ జరిగిందేమిటి? హైదరాబాద్ నుండి బయలుదేరితే లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా జగ్గయ్యపేట నుండి ఉండవల్లి వరకు భారీ ప్రదర్శన. కార్యకర్తలు అనుచరుల ఊరేగింపు. లాక్ డౌన్ నిబంధనలు ఇలా ఉల్లంఘించినందుకు చంద్రబాబు పై చర్యలేం ఉండవు. చంద్రబాబు ఉల్లంఘనలపై  ఒకవేళ ఏదైనా కాగితం కోర్టుకు చేరినా దాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం కూడా రాజ్యాంగ బద్దమే. 
 
లాక్ డౌన్ సమయంలో ప్రజలకు కూరగాయలు, సరుకులు పంచిన అధికార పార్టీ శాసనసభ్యులకు లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద నోటీసులు జారీ చేసిన కోర్టు చంద్రబాబుకు, లోకేష్ కు నోటీసులు జారీచేయకపోవడం రాజ్యాంగబద్ధమే అని ప్రజలు అనుకోవాలి. అందుకే తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం అదృష్టవంతులు. రేవంత్ రెడ్డి దొరికిపోవడంతో ప్రభుత్వం బతికి పోయింది. లేకపోతే అక్కడ కూడా ఇలాంటి రాజ్యాంగబద్ధమైన కార్యాలే జరుగుతూ ఉండేవి అనే అభిప్రాయం ప్రజలకు కలగక మానదు. 
 
By Aditya for TeluguRajyam.com