తారాగణం : ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్, రవి వర్మ, మీసాల లక్ష్మణ్, ఇంద్రనీల్,
సంగీతం : శ్రీచరణ్ పాకాల, ఛాయాగ్రహణం : ప్రవీణ్, కూర్పు :
బ్యానర్ : షైనింగ్ పిక్చర్స్
నిర్మాతలు : మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు
విడుదల : డిసెంబర్ 25, 2025
Shambhala Movie Review: ప్రముఖ నటుడు సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ రికార్డు స్థాయిలో వరుసగా 20 ఫ్లాపులు ఎదుర్కొని, రెండేళ్ళ తర్వాత తిరిగి మరోసారి దండయాత్రకి సిద్ధమై ‘శంబాల’ అనే సూపర్ నేచురల్ థ్రిల్లర్ తో ఈ క్రిస్మస్ కి విచ్చేశాడు. దీనికి యుగంధర్ ముని కొత్త దర్శకుడు. కొత్త నటి అర్చనా అయ్యర్ ఇందులో కథానాయిక. ట్రైలర్ తో విపరీతంగా ఆసక్తి రేపిన ఈ మూవీపై అందరి దృష్టీ వుంది. అయితే కొన్ని సినిమాలు థియేటర్ లో చూడనక్కర్లేదనీ, ఇంట్లో (ఓటీటీలో) చూసుకుంటే చాలనీ ప్రేక్షకులు డిసైడ్ చేసుకుంటున్న సమయంలో, ‘శంబాల’ అలాటి ఓటీటీ మూవీయేనా, లేక థియేటర్ మూవీనా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం…

కథేమిటి?
1980 లలో వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన శంబాల అనే గ్రామంలో ఆకాశం నుంచి ఒక వింత ఉల్క వచ్చి పడుతుంది. ఎర్రగా మెరుస్తూ, పొగలుగ్రక్కుతున్న దీన్ని చూసి భయపడి గ్రామస్తులు దీనికి ‘బండ భూతం’ అని పేరు పెడతారు. అప్పట్నుంచీ ఆ గ్రామంలో ఊహించని వింత ఘటనలు జరుగుతూంటాయి. ప్రజలు వింతగా ప్రవర్తిస్తూ వరుస హత్యలు, ఆత్మహత్యలతో హడలెత్తిస్తూంటారు. ఆవు నుంచి పాలకి బదులు రక్తం వస్తుంది. గ్రామమంతా అల్లకల్లోలంగా వుంటుంది. ఈ సమస్యేంటో తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం విక్రమ్ (ఆది సాయికుమార్) అనే ఖగోళ శాస్త్రజుడ్ని పంపిస్తుంది. విక్రం ప్రజల మూఢనమ్మకాల్ని సైన్స్ తో తిప్పి కొడుతూంటాడు. ఆవుని చంపకుండా అడ్డుకుంటాడు. అసలా ఈ వింత ఉల్కతో వున్న మిస్టరీ ఏమిటి? అక్కడి గ్రామదేవతతో దానికున్న సంబంధమేమిటి? గుడి పూజారి కూతురు దేవి (అర్చనా అయ్యర్) విక్రం కేలా తోడ్పడింది. విక్రం ఎవరు? ఈ మిస్టరీని ఛేదించి గ్రామాన్ని ఎలా కాపాడాడు? ఇదీ మిగతా కథ.
ఎలా వుంది కథ?
దర్శకుడు యుగంధర్ ముని సైన్సుకీ, మత శాస్త్రాలకీ సంఘర్షణ గురించి చెప్పదల్చాడు. ఇది కొత్త కాదు. దీని మీద చాలా సినిమా లొచ్చాయి. అయితే ఈ కథ చెప్పడానికి ఈ సృష్టించిన వాతావరణం, సంఘటనలు, ఉల్కా శకలం అనే మిస్టరీ కొత్తగా మార్చేశాయి. మనం గెలవాల్సింది మనతోనే గానీ, భూతంతో కాదనే మూఢనమ్మకాల్ని ఖండించే సైన్స్ దృక్పథంతో, మనిషిలోని అరిషడ్వర్గాలని దైవ శక్తిని, క్షుద్ర శక్తినీ ముడి వేస్తూ కూడా ఓ పక్క స్పిరిచ్యువాలిటీని కూడా చిత్రించే కథా కథనాలతో బలంగా చెప్పాడు దర్శకుడు.

ఈ సినిమా ప్రధానబలం వెన్నులో వణుకు పుట్టించే హార్రర్ దృశ్యాల దర్శకత్వం, చిత్రీకరణ. ప్రారంభం నుంచే శంబాల గ్రామ వెయ్యేళ్ళ చరిత్ర చెప్పడంతో ఎత్తుకున్న హార్రర్ కథనం ఇంటర్వెల్ దాకా బిగి సడలకుండా సాగుతుంది. గ్రామం మీద ఉల్క పడడం, దాని ఫలితంగా జరిగే వింత సంఘటనలు కూడా హార్రర్ నుంచి దూరం జరగవు. సైంటిస్టుగా హీరో పాత్ర ఎంటరవడంతో హార్రర్ కి సైన్స్ కీ సంఘర్షణ మొదలవుతుంది. హీరో ఉల్కా రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నాలు సైన్తిఫ్ గా ఏమీ లేకపోయినా హార్రర్ డామినేషన్ తో ఆ లోటు తెలీదు. సైంటిస్టుల బృందం, తగిన ఎక్విప్ మెంట్ లేకుండా ఒంటరిగా హీరో చేసే పరిశోధన కూడా లాజికల్ గా వుండదు. అయినా హార్రర్ డామినేషన్ తో ఇంటర్వెల్ మరో భయంకర రహస్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది.
సెకండాఫ్ లో ఇంతే బిగి సడలకుండా హీరో ఒకటొకటే చిక్కుముడులు విప్పుకుంటూ పోయే కథనం కూడా సస్పెన్స్ తో కూర్చోబెడుతుంది. ఫస్టాఫ్ లో రవి వర్మ, మీసాల లక్ష్మణ్ పాత్రలతో భయపెట్టే హార్రర్ ద్రుశ్యాలుంటే, సెకండాఫ్‌లో ఇంద్రనీల్ పోషించిన పాత్రతో సీన్ల థ్రిల్ చేస్తాయి. అయితే సినిమాలో కొన్ని బలహీన దృశ్యాలు కూడా లేకపోలేదు. అయినా సెకండాఫ్ కథ దారి తప్పకుండా,హీరో హీరోయిన్ల మధ్య ఎలాటి టైం పాస్ ప్రేమాయణాలూ లేకుండా క్లయిమాక్స్ వరకూ మిస్టరీని విప్పుతూ బలమైన ముగింపుకు చేర్చాడు దర్శకుడు. ఇంతకీ ఆ ఉల్కా రహస్యమేమిటి? ఇది ముగింపు చూసి మాత్రమె తెలుసుకోవాలి.
ఎవరెలా చేశారు?
యువ సైంటిస్టుగా ఆది సాయి కుమార్ ఒక సీరియస్ పాత్రలో ఈసారి కనిపిస్తాడు. అయితే కమర్షియల్ మాస్ హీరో యాక్షన్ సీన్లు కూడా చేసి ఒక వర్గం ప్రేక్షకుల్ని సంతృప్తి పరుస్తాడు. నటన, డైలాగ్ డెలివరీ బావున్నాయి. గ్రామాన్ని కాపాడే ఏకైక దిక్కుగా వున్న తన పాత్ర పట్ల అభిమానం పెరిగేట్టు కొన్ని దృశ్యాలుంటే పాత్రకి మరింత రాణింపు వచ్చేది.

హీరోయిన్ అర్చనా అయ్యర్ పాత్రకూడా కథకి పనికొచ్చేదే. ఆమె నటన కూడా కథని నిలబెట్టేదే. ఇక రవివర్మ, మీసాల లక్ష్మణ్, ఇంద్రనీల్ అయితే చెప్పనవసరం లేదు. హార్రర్ ఎలిమెంటుని నటనలతో పతాక స్థాయికి చేర్చారు. మిగిలిన పాత్రల్లో తారాగణం కూడా ప్లస్ అయ్యారు.
సాంకేతికాల సంగతి?
ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చరణ్ పాకాల అందించిన హార్రర్ నేపథ్య సంగీతం. హార్రర్ దృశ్యాల షాక్ వేల్యూని మరింత పెంచేలా వుంది బిజిఎం. అయితే పాటల విషయంలో అంతంత మాత్రమే. విజువల్స్ ఫరవా లేదు. 1980 లనాటి పీరియెడ్ వాతావరణాన్ని ఫీల్ చెడకుండా చిత్రీకరించాడు కెమెరా మాన్ ప్రవీణ్. హార్రర్ దృశ్యాలకి లైట్లు, షాట్లు వాతావరణాన్ని భీకరంగా చేశాయి. శ్రవణ ఎడిటింగ్ సినిమా స్పీడు పెంచేలా వుంది. ఇతర ప్రొడక్షన్ విలువలు ఫర్వాలేదు.
చివరికేమిటి?
రూరల్ సూపర్ నేచురల్ హార్రర్ గా సైన్సునీ, మతాన్నీ; దైవ శక్తినీ, క్షుద్ర శక్తినీ పరస్పర పోరాట అంశాలుగా చేసి చెప్పిన ఈ మూవీ ఫలితం చెడని ఒక డిఫరెంట్ ప్రయత్నం. ప్రారంభం నుంచీ ముగింపు వరకూ టెన్షన్ తో కూర్చో బెడుతుంది. కచ్చితంగా దీన్ని థియేటర్ లో చూస్తేనే పూర్తిస్థాయి అనుభవాన్ని పొందగల్గుతారు. హీరో అది సాయికుమార్ ఎట్టకేలకు ఒక విజయమందుకున్న, క్లాస్ –మాస్ ప్రేక్షకులందరికీ పైసా వసూల్ ఫీలింగ్ తో తృప్తి నిచ్చే ప్రయత్నంగా ఇది నిలుస్తుంది.
రేటింగ్ : 2.5 / 5

