కౌసర్ బేగంకు మోదీ ప్రశంస… ఎవరీ వరంగల్ కౌసర్ బేగం

జీవితంలో జరిగిన అనుభవాలే పాఠాలు నేర్పుతాయంటారు. ఆమెకు జరిగిన అనుభవాలే నేడు ఇతర మహిళలకు పాఠాలు అవుతున్నాయి. చిన్నతనంలోనే అనేక ఇబ్బందులను ఎదుర్కొని కష్టాల్లోకి వెళ్లిపోయింది. కట్టుకున్నవాడు నిర్లక్ష్యం చేయడంతో వెరవక చంకన ఇద్దరు పిల్లలను వేసుకొని తన జీవితాన్ని ప్రారంభించింది. కూలీనాలీ చేసి తన జీవితాన్ని ఉన్నతంగా మలుచుకుంది. మహిళా సంఘాల్లో చేరి దేశవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలకు శిక్షణనిచ్చే స్థాయికి ఎదిగింది. ఆమె వరంగల్ జిల్లా వేలేరుకి చెందిన కౌసర్ బేగం. ప్రధాన మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానితో మాట్లాడి దేశ ప్రధానితోపాటు, దేశ ప్రజల మన్ననలు అందుకుంటున్న ఆమె ప్రధానితో ఏం మాట్లాడారు? అసలు ఎవరీ కౌసర్ బేగం… తెలియాలంటే ఈ స్టోరి చదవాల్సిందే…

ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లి నుంచి వివిధ రాష్ట్రాల స్వయం సహాయక సంఘాల మహిళలు, కమ్యూనిటి రిసోర్సు పర్సన్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు. వివిధ రాష్ట్రల వారితో మాట్లాడుతుండగా తెలంగాణలోని వరంగల్ జిల్లా వంతు వచ్చింది. అప్పుడే మైకు తీసుకొని మాట్లడే ప్రయత్నం చేసింది కౌసర్ బేగం. ప్రధానితో మాటలంటే ఎవరికైనా కాస్త భయమే కదా.. ఆ భయాన్ని వదిలేసి గొంతు సరిచేసుకుని నమస్తే..మానవీయ మహోదయ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీ… అంటూ కౌసర్ తన సంభాషణను మొదలు పెట్టింది. ఆమె గొంతులోని ఆత్రుతను గమనించిన ప్రధాని ఆమె చెప్పెదంతా ఆశ్చర్యంగా విన్నారు.

“సర్ మాది వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు. నాకు పదహారేళ్లు ఉన్నప్పుడే పెళ్లయింది. మా వారిది వరంగల్. చిన్న ఉద్యోగం చేస్తూ ఆయన నన్ను బాగానే చూసుకునేవారు. మూడు సంవత్సరాల కాలంలో మాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇంత వరకు బాగానే సాగిన మా జీవితంలో మద్యం చిచ్చు పెట్టింది. మా ఆయన మద్యానికి అలవాటుపడి నన్ను, ఇద్దరు పిల్లల్ని ఇబ్బంది పెట్టే వారు. పెద్దమనుషులతో చెప్పించినా ఆయనలో మార్పు రాకపోవడంతో పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయాను. అప్పుడు మా గ్రామంలోని మహిళస్వయం సంఘాల గ్రూపులో చేరాను. నేను సంఘంలో చేరాక నా ఆర్థిక సమస్యలన్నీ తీరాయి. పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాను. సొంతిల్లూ కట్టుకున్నా.. ఇతరులను ఆదుకునే స్థాయికి చేరుకున్నా. నా జీవితంలో జరిగిన నా సంఘటననే నేను అందరికీ చెబుతుంటాను నా మాట తీరు నచ్చడంతో అంతా వినటానికి ఆసక్తి చూపుతారు. అలా నేను మొదట మా జిల్లాలో, క్రమంగా వేరే రాష్ట్రాలకు శిక్షణ కార్యక్రమాలకు వెళ్లేదాన్ని. అలా మధ్యప్రదేశ్ , హర్యానా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఒడిశా, పంజాబ్ వంటి రాష్ట్రాలకు వెళ్లి అక్కడి మహిళలకు సంఘాల ఏర్పాటు, దాన్ని నడిపే విధానం గురించి మొదలు పెట్టాను సార్” అని ఆమె ప్రధానికి చెప్పింది.
ఆమె ప్రసంగం విని ఆశ్చర్యం చెందిన ప్రధాని అన్ని రాష్ట్రాలు తిరిగిన నీవు గుజరాత్ కు ఎందుకు వెళ్ళలేదమ్మా అని ప్రశ్నించారు. తద్వారా గుజరాత్ కు కూడా వెళ్లాలని సూచించారు. ప్రధాని మాట్లాడుతూ.. “ ఇద్దరు పిల్లలను ఒంటరిగా పోషిస్తూ..నీ జీవితాన్ని నిర్మించుకోవడమే కాకుండా.. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మరెందరో మహిళల జీవితాల్ని తీర్చిదిద్దే స్థాయికి ఎదగడం స్పూర్తిదాయకం” అంటూ ప్రధాని కౌసర్ బేగంను అభినందించారు.

ఇంతకీ ఎవరీ కౌసర్ బేగం…?

వరంగల్ జిల్లా వేలేరుకు చెందిన కౌసర్ బేగంకి చిన్నతనంలోనే వరంగల్ కు చెందిన వ్యక్తితో వివాహం అయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త తాగి వచ్చి వేధింపులకు గురి చేస్తుంటే తట్టుకోలేక పిల్లలను తీసుకొని పుట్టినిల్లు అయిన వేలేరుకు వచ్చింది. గ్రామంలోని కనకదుర్గ మహిళ సంఘంలో సభ్యురాలిగా చేరిన కౌసర్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేది. కూలీనాలి పనిచేస్తూ జీవనం సాగించేది. 2007లో అప్పటి ఏపీఎం ఏరియా కోఆర్డినేటర్ గా పనిచేసిన టి.రవీందర్ మహిళా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇవి ఎలా నడుస్తున్నాయో వీటి ఉద్దేశ్యమేంటో వివరించమన్నారు. అప్పుడు కౌసర్ బేగం తన అనుభవాలను వివరించింది. ఆమె మాటతీరు నచ్చిన ఆయన కౌసర్ ను సీఆర్ పీ గా నియమించారు. అలా కొన్ని రోజులు ఆమెకు శిక్షణనిచ్చి ఇతర ప్రాంతాల మహిళలకు తన అనుభవాలను చెప్పమన్నారు. అలా మొదలుపెట్టిన ఆమె.. జిల్లాలో, రాష్ట్రంలో ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లోని మహిళలకు శిక్షణనిచ్చే స్థాయికి ఎదిగారు. అలా చెప్పటం వలన మిగిలిన వారిలో చైతన్యం వస్తుందనేది అధికారుల నమ్మకం. మధ్యప్రదేశ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, పంజాబ్‌ వంటి రాష్ట్రాలకు వెళ్లి అక్కడి మహిళలకు సంఘాల ఏర్పాటూ, దాన్ని నడిపే విధానం గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఇతర మహిళలకు ఆదర్శంగా నిలుస్తూ కౌసర్ తన జీవితాన్ని ఉన్నతంగా మలుచుకుంది.

కాకతీయ మహిళ గ్రూపు సభ్యులంతా వరంగల్ కాకతీయులకు గుర్తుగా ఎర్రచీరలు ధరిస్తారు. వీరంతా ఒకే రకమైన చీరలు ధరించటాన్ని ప్రధాని అడిగారు. అప్పుడు కౌసర్ కాకతీయులకు గుర్తుగా ధరిస్తామని తెలిపింది. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధాని మోదీ గారితో మాట్లాడే అవకాశం నా ఒక్కదానికే రావడం అదృష్టంగా భావిస్తున్నానని కౌసర్ అంటుంది. చిన్న సమస్యకే జీవితం అంతా కోల్పోయినట్టు భావిస్తున్న ఈ రోజుల్లో భర్త సహాయం లేకున్నా పిల్లలను చదివిస్తూ, తన జీవితంలో పడిన కష్టాలకు ఏ మాత్రం వెరవకుండా ఇతర మహిళల జీవితాల్లో వెలుగు నింపుతున్న కౌసర్ బేగం జీవితం నేటి మహిళలకు ఆదర్శం…