సంక్షేమం కోసం ఆస్తులు అమ్మడం సమంజసమా?

YSRCP Navaratnalu
ఏపీ ప్రభుత్వం కొన్ని నెలల క్రితం చెప్పినట్టే ఆస్తుల అమ్మకాలు మొదలుపెట్టింది.  ఇందుకోసం విశాఖ, గుంటూరుల్లో సర్వే చేసి 18.8 ఎకరాల భూమిని సేకరించి పెట్టింది.  బిల్డ్ ఏపీ మిషన్ పేరుతో ఈ అమ్మకం చేపట్టనున్నారు.  వీటి అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంతో నవరత్నాలు, నాడు- నేడు పథకాలకు నిధులు సమకూర్చుకోనున్నారట .  ఇది తొలివిడత అమ్మకం మాత్రమే.  ఇక మీదట కూడా దశలవారీగా రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో ఉన్న ప్రభుత్వ భూములను అమ్మి సంక్షేమ పథకాలను అమలుచేసే ఆలోచనలో ఉంది సర్కార్.  
 
ఇప్పుడంటే ఈ భూముల విలువ రూ.208 కోట్లు.  ఈ అమ్మకంతో ప్రభుత్వం 90 నుండి 100 కోట్లలో ఆదాయం చూస్తుంది.  ఇదేమంత పెద్ద ఆదాయం కాదు.  అదే భవిష్యత్తులో విశాఖ రాజధానిగా మారితే వీటి విలువ అమాంతం పెరుగుతుంది.  అప్పుడు భూములు కావలసి వస్తే ప్రభుత్వం ఇప్పుడు అమ్మిన వారి దగ్గరే రెట్టింపు ధర పెట్టి ఆ భూములను తిరిగి కొనాల్సి వస్తుంది.  అసలు ఆస్తులు అమ్మి అభివృద్దికి కాకుండా ఎన్నికల్లో హామీలుగా చెప్పిన సంక్షేమ పథకాలకు వాడటం ఎంతవరకు సమంజసమో పాలకులే ఆలోచించాలి.  
 
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున  భూములు అమ్మి వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు సమకూర్చారు.  ఆ సొమ్ముతో అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేశారు.  అప్పుడంటే హైదరాబాద్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి కాబట్టి అమ్మి ప్రయోజనం పొందారు.  కానీ ఇప్పుడు వైఎస్ జగన్ కేవలం 300 కోట్ల కోసం భూములు అమ్మడం అనేది చర్చనీయాంశంగా మారింది.  
 
జగన్ ఎన్నికలనాడు ప్రకటించిన నవరత్నాలను అమలుచేయాలంటే యేడాదికి దాదాపు 90 వేల నుండి లక్ష కోట్లు కావాలి.  ఇప్పటికైతే రాష్ట్రానికి కొత్తగా సంపద సృష్టి మార్గాలేవీ కల్పించలేకపోయారు.  ఆ సృష్టి ఇప్పట్లో సాధ్యమయ్యేలా కూడా కనిపించట్లేదు.  కాబట్టి ఎన్నికల హామీలు నెరవేర్చాలంటే వైకాపా నాయకుల పద్దతి మేరకు ఇక మీదట కూడా ఆస్తులు అమ్ముకుంటూనే పోవాలి.  కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయనే చందాన ఆదాయ మార్గాలను అన్వేషించకుండా పథకాల కోసం ఆస్తులు విక్రయిస్తూపోతే భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు, అభివృద్దికి గజం స్థలం కూడా మిగలదేమో.