వైఎస్ జగన్ క్రిస్టియన్ కావచ్చు కానీ హిందూ వ్యతిరేకి ఎలా అవుతారు
అధికార పక్షం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వాటిలోని లొసుగుల్ని వెతకడమే ప్రత్యర్థి పార్టీల పని. ఈ లొసుగుల వెతుకులాట న్యాయబద్దంగా ఉంటే సరే కానీ శృతి మించి విపరీతాలకు దారితీస్తేనే ఇబ్బంది. ప్రస్తుతం ఏపీలో భారతీయ జనతా పార్టీ వైసీపీపై విమర్శలు చేస్తున్న తీరు ఇలానే ఉంది. టీటీడీ పాలకమండలి శ్రీవారి ఆస్తులను వేలం వేయాలని అనుకుంది. కానీ పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో పాలకమండలి వెనక్కి తగ్గింది. నేరుగా వైఎస్ జగన్ ఆస్తుల విక్రయాన్ని నిలిపివేయాలని ఆదేశించారు.
టీటీడీ ఆస్తులను అమ్మాలనుకుంటోందనే వార్త బయటికి రాగానే బీజేపీ వేగంగా స్పందించింది. అంతేకాదు కన్నా లక్ష్మీనారాయణ లాంటి అగ్రనేతలు ఆందోళనను తీవ్రతరం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం టీటీడీ ఆస్తులను కొల్లగొట్టాలనే కుట్ర చేస్తోందని, ముందు చిన్న భూములు విక్రయించి ఆ తర్వాత పెద్ద ఆస్తులను అమ్మేస్తారని అన్నారు. ఈ విక్రయం కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలను కించపరచడమేనని, హిందువులంతా ఒక్కటై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ఇక తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ అయితే హిందూత్వవాదానికి తెర లెపారు. జగన్ టీటీడీ భూములను అమ్మి పాస్టర్లకు జీతాలు ఇవ్వాలనుకుంటున్నారా, హిందువులం అంతా కలిసి తిరుమలను కాపాడుకుంటామని పెద్ద మాటే అన్నారు. ఈ మాటల్లో మతతత్వ ధోరణి స్పష్టంగా తెలుస్తోంది. వైఎస్ జగన్ మతం రీత్యా క్రైస్తవుడనే విషయాన్ని బలంగా నొక్కి చెప్పినట్టే ఉంది. ఇక కాషాయ అభిమాన గణం అయితే జగన్ హిందూ వ్యతిరేకి, అందుకే పాస్టర్లకు ఎవ్వరూ ఇవ్వని రీతిలో రూ. 5000 ఇస్తున్నారని అంటూ సోషల్ మీడియాలో రచ్చలు, చర్చలు స్టార్ట్ చేశారు.
జగన్ క్రిస్టియన్ అయినంత మాత్రాన హిందూ వ్యతిరేకి ఎలా అవుతారు. ఆయనకు హిందూ మత వ్యతిరేక భావనలే ఉంటే అసలు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగగలిగేవారు కాదు. తన వేల కిలోమీటర్ల పాదయాత్రలో సైతం జగన్ ఎన్నడూ తానొక క్రైస్తవుడినని చెప్పుకోలేదు. ఇతర మతాలవారి పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేసిన దాఖలాలు లేవు. పాస్టర్లకు 5000 సహాయం అంటున్నారే కానీ వారితో పాటు అర్చకులు, ఇమామ్ లకు కూడా అదే 5000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించిన సంగతిని ప్రస్తావించడం లేదు. జగన్ హిందూ వ్యతిరేకే గనుక అయితే ఇలా చేయరు కదా.
ఇక టీటీడీ భూముల విక్రయ ఆలోచన టీటీడీ పాలకమండలి నిలిపివేసేలా జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వెనక తమ పోరాటం, విమర్శలు, ఒత్తిళ్లు ఉన్నాయని భాజాపా, ఇతర పార్టీలు ప్రచారం చేసుకోవచ్చు. రాజకీయంగా ఈ వ్యూహం ఓకే కానీ జగన్ టీటీడీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పడం ఏదో క్రిస్టియానిటీ మీద హిందూత్వం విజయం సాధించేసినట్టు ప్రచారం చేయడం మాత్రం నైతికత అనిపించుకోదు.