వైసీపీ నేతల్లో కొందరు అధిష్టానం తీరుపై ఇప్పుడిప్పుడే అసమ్మతి గళం విప్పుతున్నారు. కానీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మాత్రం ఛాన్నాళ్ల క్రితమే ఈ పని మొదలుపెట్టారు. పైగా ఆయనది అసమ్మతి గళం కాదు దిక్కార ధోరణి. ప్రభుత్వం ఏర్పడి మంత్రి వర్గాన్ని తయారుచేసిన వెంటనే రఘురామకృష్ణరాజులో ఈ ధోరణి బహిర్గతమైంది. పార్టీలోని చాలామంది నేతల్లా అధినేతకు దగ్గరవాలని ట్రై చేయడం, పొగడ్తలు కురిపించడం, ప్రత్యర్థుల నుండి నాయకుడ్ని డిఫెండ్ చేయడం లాంటి పనులకు దూరంగా ఉండే ఆయన పాలనా పరమైన నిర్ణయాలను తప్పుబట్టడం లాంటివి మాత్రం తరచూ చేస్తూనే ఉన్నారు.
తెలుగు మీడియం రద్దు విషయంలో సర్కార్ నిర్ణయం సరికాదన్న ఆయన టీటీడీ భూముల విక్రయం అంశంలోనూ తప్పుబట్టారు. ఇళ్ల స్థలాల పంపిణీలో, ఇసుక తవ్వకాల్లో అవినీతి ఉందని ఆరొపించిన ఆయన తాజాగా వైఎస్ జగన్ మంచివారే కానీ అయన చుట్టూ ఒక కొటరీ ఉందని, దాన్ని దాటుకుని ఆయన దగ్గరకు వెళ్లడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. సాధారణంగా అయితే వైసీపీ అనఫిషియల్ పాలసీ ప్రకారం అధినేతపై ఇలా విమర్శలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఒక్కోసారి అవి పార్టీ నుండి సస్పెండ్ చేసే వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది.
రఘురామకృష్ణరాజుగారికి కూడా కావాల్సింది అదే. ఎందుకంటే ఆయన తన పాత గూడు భాజాపాలోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారని వినికిడి. త్వరలో కేంద్ర కేబినెట్లో మార్పులు జరిగే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. పనితీరు సరిగాలేని వారిని తప్పించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే యోచనలో మోదీ ఉన్నారట. ఈ బెర్తుల కోసం చాలా రాష్ట్రాల నేతలు ప్రయత్నిస్తున్నారు వారిలో రఘురామకృష్ణరాజు కూడా ఉన్నారట. భాజాపాతో రాజుగారికి చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. జగన్, విజయసాయిరెడ్డిలకు అయినా మోదీ, అమిత్ షాలను కలవడం కష్టమవచ్చేమో కానీ రఘురామకృష్ణరాజుకు మాత్రం చాలా సులభం.
ఒకానొక దశలో కేంద్రంతో స్నేహం విషయంలో పార్టీని దృష్టిలో పెట్టుకుని వెళ్లాలని రఘురామకృష్ణరాజుకు మొదట్లోనే సూచనలు వెళ్లాయి. కానీ ఆయన వాటిని ఏమాత్రం లెక్క చేయలేదు. కేంద్ర నాయకత్వంతో తన రిలేషన్స్ ఎంత బలంగా ఉన్నాయో బహిరంగంగా చూపే ప్రయత్నం చేశారు. ఇవన్నీ భాజాపాలోకి వెళ్లడానికి ఆయన ఎంచుకున్న దారులనేది కొందరి వాదన. తానంతట తానుగా పార్టీ మారితే కళంకమని ఆ పనేదే వైసీపీతోనే చేయించాలని చూస్తున్నారట. అందుకే అడుగడుగునా పార్టీ నిర్ణయాల మీద బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ విమర్శల మోతాదు ఇంకా పెరుగుతుంది. వాటి మూలాన జగన్ విసిగిపోయి పార్టీ నుండి సస్పెండ్ చేస్తే దర్జాగా లోపాల్ని ఎత్తి చూపితే వాళ్లే బహిష్కరించారు, అందుకే వెళ్తున్నాను అంటూ భాజాపాలో చేరి కేబినెట్ పదవి అందుకొని ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పవచ్చని ఆయన భావిస్తున్నట్టు రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
నిజమే.. ఎందుకంటే రఘురామకృష్ణరాజు బడా పారిశ్రామికవేత్త. ఆయనకు రాష్ట్ర స్థాయి లీడర్ల అండదండల కంటే కేంద్ర స్థాయి నేతల సపోర్ట్ చాలా అవసరం. అందుకే ఈ దిక్కార వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. వైసీపీ అధిష్టానానికి కూడా ఈ సంగతి బాగా తెలుసు. కాబట్టే ఆయన మీద ఇంతవరకు ఎలాంటి క్రమశిక్షణా పరమైన చర్యలూ తీసుకోలేదు. కానీ వాళ్లైనా ఎంతకాలమని పక్కలో బల్లాన్ని భరిస్తారు. ఏదో ఒకరోజు చర్యలు తీసుకోక తప్పదు. ఆ శుభదినం కోసమే రఘురామకృష్ణరాజు ఎదురుచూస్తున్నారు. మరి జగన్ రఘురామకృష్ణరాజు వేసిన ఈ ఎత్తుగడను ఎలా ఎదుర్కుంటారో చూడాలి.