వినాయక చవితి నాడు చంద్రుడిని ఎందుకు చూడరాదు?

Vinayaka Chavithi
వినాయక చవితి, భారతీయుల అతిముఖ్య పండుగలలో ఇది ఒక పండగ. . ఏ పని ప్రారంభించినా తొలి పూజ వినాయకుడిదే. అలాంటి విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా ఆరాధించే పండుగను కులమతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి పండుగను భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తేదీన జరుపుకుంటారు
నలుగుపిండితో వినాయకుడు
ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరుల పుత్రుడు గణపతి. తండ్రి వల్ల తలను పోగొట్టుకోవాల్సి వచ్చింది. హిందూ సాంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. ఏ పనులు తలపెట్టిన విఘ్నాలు లేకుండా కాపాడేవాడు. చివరకు ఏ శుభకార్యాలు తలపెట్టిన ముందుగా పూజలు అందుకునే ఆది దేవుడు.
పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు పరమశివుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు. దీనికి ప్రసన్నమైన శివుడు.. ఏ వరం కావాలో కోరుకోమంటాడు. దీనికి ఆ రాక్షసుడు ‘నీవు ఎల్లప్పుడు నా ఉదరంనందే నివసించాలి అంటాడు’ శివుడి అతని కోరికను మన్నించి గజాసురుడి కడుపులో ప్రవేశించి అతని ఉదరంలో నివసించసాగాడు.
విషయం తెలుసుకున్న పార్వతీదేవి.. విష్ణువు వద్దకు వెళ్లి ‘నా భర్తను భస్మాసురుడి నుంచి కాపాడినట్లుగా.. గజాసురిడి నుంచి కూడా రక్షించమ’ని వేడుకుంటుంది. దీనికి ఉపయం ఆలోచించిన విష్ణుమూర్తి దీనికి గంగిరెద్దు మేళమే సరైందని.. శివుడి ద్వారపాలకుడైన నందిని గంగిరెద్దుగా మారుస్తాడు. మిగతా బ్రహ్మాదిదేవతలను వివిధ వాయిద్యాకారులుగా మార్చి గజాసురిడి పురానికి వెళ్లి నందిని ఆడించారు. అందుకు తన్మయత్వం చెందిన గజాసురుడు ఏం కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. ఇది మహాన్నోతమైన గంగిరెద్దు, శివుడిని వెతుక్కుంటూ వచ్చింది, కాబట్టి నీ ఉదరంలో ఉన్న శివుడిని ఇచ్చేయమని కోరతారు.
అది అడిగింది ఎవరో కాదు సాక్షాత్తూ ఆ మహావిష్ణువేనని తెలుసుకున్న గజాసురుడు తనకింక మరణం తథ్యమని గ్రహిస్తాడు. దీంతో శివుడితో ‘నా ముఖం లోకమంతా ఆరాధించేట్టుగా.. నా చర్మాన్ని ధరించాలని కోరతాడు’ దీనికి శివుడు అంగీకరించగా.. విష్ణువు సైగతో నంది తన కొమ్ములతో గజాసురుడి కడుపును చీల్చి చంపేస్తుంది. అప్పుడు బయటకు వచ్చిన శివుడు.. విష్ణువును స్తుతిస్తాడు. విష్ణువు ఇలా దుష్టులకు అడిగిన దానాలు చేయకూడదని శివుడితో అంటాడు.
గజాసుర సంహారానంతరం…పరమేశ్వరుడు కైలాసం వస్తున్నాడని పార్వతీదేవికి తెలుస్తుంది. ఆ సంతోషంలో పార్వతీ..వంటికి నలుగు పెట్టుకుని స్నానం చేయబోతూ..ఆ నలుగుపిండితో ఓ బొమ్మను తయారుచేసి ప్రాణం పోస్తుంది. ఆ బొమ్మ బాలుడిగా మారుతుంది. ఆ బాలుడ్ని ద్వారం దగ్గర కాపలాగా వుంచి తన అనుమతి లేకుండా ఎవ్వరినీ లోనికి రానివ్వద్దని చెబుతుంది. కాసేపటికి అక్కడకు చేరుకున్న పరమశివుడు లోపలకు వెళుతుండగా ద్వారం వద్ద ఉన్న బాలుడు అడ్డుకుంటాడు. లోపలకు వెళ్ళాలి అడ్డు తొలగమంటాడు శివుడు చాలాసార్లు చెబుతాడు. తల్లి ఆజ్ఞ మీరని ఆ బాలుడు శివుడిని లోనికి ప్రవేశించనివ్వడు. ఆగ్రహంతో శివుడు తన త్రిశూలంతో బాలుడి శిరస్సు ఖండిస్తాడు. ఇంతలో అక్కడకు వచ్చిన పార్వతీదేవి బిడ్డ అలా పడి ఉండడం చూసి శోకిస్తుంది. అప్పుడు గజాసురుడి తలను బాలుడికి అతికింది ప్రాణం పోస్తాడు. గజ ముఖం ఉండడం వల్ల వినాయకుడు గజాననుడిగా పేరు పొందాడు.
కొన్ని రోజుల తర్వాత దేవతలంతా పరమేశ్వరుడి వద్దకు వెళ్లి తమకు విఘ్నం రాకుండా ఉండేందుకు కొలవడానికి ఓ దేవుడిని ప్రసాదించమని కోరగా ఆ పదవికి గజాననుడు, కుమార స్వామి ఇద్దరూ పోటీ పడ్డారు. ముల్లోకాల్లోని పుణ్య నదులన్నింటిలో స్నానం చేసి తిరిగి మొదట వచ్చిన వారే ఈ పదవికి అర్హులు అని చెప్పగా వెంటనే కుమార స్వామి నెమలి వాహనం ఎక్కి వెళ్లిపోయాడు. గజాననుడు మాత్రం నా బలాబలాలు తెలిసి మీరీ షరతు విధించడం సబబేనా? అని అడగ్గా.. తండ్రి అతడికో తరుణోపాయం చెప్పాడు.
ఓ మంత్రాన్ని వివరించి తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి దాన్ని పఠించమని చెప్పగా మంత్ర పఠనం చేస్తూ వినాయకుడు అక్కడే ఉండిపోయాడు. ఈ మంత్ర ప్రభావం వల్ల కుమార స్వామికి తాను వెళ్లిన ప్రతి చోట తనకంటే ముందుగా వినాయకుడే స్నానం చేసి వెళ్తున్నట్లుగా కనిపించసాగింది. దాంతో తిరిగొచ్చి తండ్రీ అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను. నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యం అప్పగించండి అని చెప్పాడు. అలా భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు విఘ్నేశ్వరుడయ్యాడు. ఆ రోజు దేవతలు, మునులు అందరూ వివిధ రకాల కుడుములు, పాలు, తేనె, అరటి పళ్లు, పానకం, వడపప్పు వంటివన్నీ సమర్పించారు.
వాటిని తినగలిగినన్ని తిని మిగిలినవి తీసుకొని భుక్తాయాసంతో రాత్రి సమయానికి కైలాసం చేరుకున్నాడు. తల్లిదండ్రుల కాళ్లకు నమస్కారం చేయడానికి ప్రయత్నిస్తే కడుపు నేలకు ఆనుతుందే కానీ చేతులు ఆనట్లేదు. ఇది చూసి చంద్రుడు నవ్వగా దిష్టి తగిలి పొట్ట పగిలి వినాయకుడు చనిపోతాడు. దీంతో పార్వతీ దేవి ఆగ్రహించి ఆ రోజు చంద్రుడిని చూసిన వాళ్లందరూ నీలాపనిందలకు గురవుతారని శాపమిస్తుంది. చంద్రుడిని చూసిన రుషి పత్నులు తమ భర్తల దగ్గర అపనిందలకు గురవుతారు.
రుషులు, దేవతలు ఈ విషయాన్ని శ్రీమహా విష్ణువుకి విన్నవించగా ఆయన అంతా తెలుసుకొని రుషులకు తమ భార్యల గురించి నిజం చెప్పి ఒప్పించడంతో పాటు వినాయకుడి పొట్టను పాముతో కుట్టించి ఆయనకు అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. ఆ తర్వాత దేవతలందరి విన్నపం మేరకు పార్వతి తన శాపవిమోచనాన్ని ప్రకటిస్తుంది. ఏ రోజైతే చంద్రుడు నా కుమారుడిని చూసి నవ్వాడో ఆరోజు మాత్రం అతడిని చూడకూడదు అని చెబుతుంది. దీంతో దేవతలంతా సంతోషిస్తారు. ఆ రోజే భాద్రపద శుద్ధ చవితి. ఆ రోజునే మనం వినాయక చవితిగా జరుపుకుంటాం.