ప్రతి ఒక్కరూ జీవితంలో పైకి ఎదగాలని, అందరిలోనూ తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకోవాలని ఆశపడుతూ ఉంటారు. అయితే ఇలా వారు అనుకున్నది సాధించి విజయం సాధించడానికి అన్ని విషయాలలోనూ చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవల్సి వస్తుంది. చాణక్యుడు చెప్పిన నీతి శాస్త్రం ప్రకారం ఏ సందర్భంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అనే విషయాల గురించి చాలా స్పష్టంగా బోధించాడు. చాణక్యుడు అందించిన ఈ నీతి సూత్రాలను పాటించి పూర్వకాలంలో ఎంతో మంది రాజులు చరిత్రలో నిలిచిపోయారు. అయితే నీతి శాస్త్రం ప్రకారం మనము ఏ విషయాలన్నీ ఇతరులతో పంచుకోవాలో..? ఏ విషయాలను ఇతరులకు చెప్పకుండా దాచుకోవాలో..? అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎవరితో పంచుకోకుడని విషయాలు :
• చాణక్యుడు అందించిన నీతి శాస్త్రం ప్రకారం మనం సంపాదించే డబ్బు వివరాల గురించి పొరపాటున కూడా ఇతర వ్యక్తులతో మనం చర్చించకూడదు. మన సంపద గురించి తెలిసిన తర్వాత కొందరు వ్యక్తులు మన నాశనాన్ని కోరుకోవడానికి చెడు ప్రయోగాలు చేసే అవకాశాలు ఉంటాయి.
• అలాగే మన కుటుంబ విషయాల గురించి కూడా పొరపాటున ఇతరులతో చర్చించకూడదు. ఇలా కుటుంబ విషయాలను ఇతరులతో చర్చించడం వల్ల మన సమస్యలను మనమే అందరికీ తెలియజేసినట్లు అవుతుంది.
• భార్య భర్తల మధ్య జరిగిన విషయాల గురించి పొరపాటున కూడా మూడో వ్యక్తితో చర్చించకూడదు. కొన్ని విషయాలను కనీసం తల్లితండ్రులతో కూడా చర్చించకుండానే భార్యాభర్తలిద్దరూ సామరస్యంగా చర్చించుకుని సమస్యలను తొలగించుకోవాలి.
• అలాగే ఎవరైనా మనల్ని అవమానపరిచినప్పుడు ఆ విషయాల గురించి ఇతరులతో చర్చించకూడదు. మనకు జరిగిన అవమానాన్ని ఇతరులతో చర్చించడం వల్ల వారు కూడా మనల్ని ఎగతాళి చేస్తూ అవమానించే అవకాశాన్ని మనమే ఇచ్చినట్లు అవుతుంది.