మానవ జీవితం అంటే సుఖమయం కాదు. అనేక కష్టాలు, నష్టాలు,సుఖాలు, దుఃఖాల మయం. అయితే సంతోషం వస్తే సంబురం కానీ కష్టం, నష్టం వస్తే మానవుడు తట్టుకోలేడు. అదికూడా వరుసగా వస్తే ఇంకా దుర్భరం. అయితే వీటన్నింటి నుంచి తప్పించుకునే మార్గాలు అనేకం మన సనాతన ధర్మంలో ఉన్నాయి. వాటిలో శ్రీవిద్య, దుర్గా అమ్మవారి ఆరాధన ముఖ్యమైనవి. వాటి గురించి తెలుసుకుందాం…
శ్రీ కనకదుర్గా తల్లి శ్రీఘ్ర అనుగ్రహంతో బయటపడటానికి, సులభమైన మార్గం, శ్రీ దేవీ భాగవత పారాయణం. కానీ శ్రీ దేవి భాగవత పారాయణం చేయటానికి కానీ, చేయించటానికి కానీ, చాలా నియమాలు ఉన్నాయి. అటువంటి నియమాలతో, శ్రీ దుర్గామాత దేవీ భాగవత పారాయణం చేయగలిగినా..లేక సమర్ధులైన వారిచేత చేయించ గలిగినా మంచిదే. కానీ, అటువంటి అవకాశం లేని వారికి కూడా, పరమ దయామూర్తులైన వశిన్యాది వాగ్దేవతలు, మనకు ఒక సులభమైన ప్రక్రియను, శ్రీ లలితా సహస్రనామంలో మనకు చెప్పారు.
వశిన్యాది వాగ్దేవతా మాతలు చెప్పిన ఆ ప్రక్రియ అందరికీ చాలా సులభ సాధ్యమైనది మరియు నియమాలతో కూడిన శ్రీ దేవి భాగవతం పారాయణ వల్ల కలిగే సమాన ఫలితాన్ని ఇవ్వగలిగినది.
16 నామాలతో అమ్మ ఆరాధన … శ్రీ దేవీ భాగవతంలో 13 అధ్యాయాలు ఉన్నాయి. ఈ పదమూడు అధ్యాయాలకు, వశిన్యాది వాగ్దేవతలు మనకు శ్రీ లలితా సహస్రనామంలో, శ్రీదుర్గా మాత 13 నామములు చెప్పారు. ఈ 13 నామాలకు, సమిష్టిగా ఇంకొక నామం చెప్పారు. అలా, 14 నామాలకు ముందు, చివరలో, శ్రీ మాత్రే నమః అన్న నామము కలిపి, ఈ పదహారు నామాలను, శ్రీ కనకదుర్గా అమ్మవారి ముందు పఠించి, వీలైతే, శ్రీ కనకదుర్గ పాయసాన్నప్రియాయై కనుక, అమ్మవారికి పాయసాన్నమును నైవేద్యం పెట్టగలిగితే, శ్రీ దేవీ భాగవత పారాయణ ఫలితం వెంటనే లభించి, శ్రీదుర్గా మాత అనుగ్రహంతో వారి సమస్యలు వెంటనే తొలగిపోతాయి.
ఆ నామాలు ఇవే…
– 1) మహారూపా
– 2) మహాపూజ్యా
– 3) మహాపాతక నాశినీ
– 4) మహామాయా
– 5) మహాసత్వా
– 6) మహాశక్తి
– 7)మహారతిః
– 8) మహాభోగా
– 9)మహేశ్వర్యా
– 10) మహావీరా
– 11) మహాబలా
– 12)మహాబుద్ధి
– 13)మహాసిద్ధి
కలిపిన ఇంకొక నామం..
– 14) మహాయోగీశ్వరేశ్వరి.
వీటన్నింటికి శ్రీమాత్రేనమః అనే నామాన్ని జోడించి చదువాలి.
భక్తి, శ్రద్ధలతో పై నామాలను శుచితో, శుభ్రమైన వస్త్రాలను ధరించి అమ్మ ముందు కూర్చుని జపించాలి. తప్పక అనుకూల ఫలితాలు వస్తాయి.